Begin typing your search above and press return to search.

జ‌గ‌ప‌తి బాబుకు రెబ‌ల్ స్టార్ ఫోన్ కాల్!

సీనియర్ నటుడు జగపతి బాబు సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు.

By:  Srikanth Kontham   |   25 May 2026 12:33 PM IST
జ‌గ‌ప‌తి బాబుకు రెబ‌ల్ స్టార్ ఫోన్ కాల్!
X

సీనియర్ నటుడు జగపతి బాబు సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా మెప్పించిన ఆయన అటుపై విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకు పోతున్నారు. అయితే కెరీర్‌లో -వ్యక్తిగత జీవితంలో ఎదురైన కొన్ని క్లిష్ట పరిస్థితుల వల్ల ఆయన తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారుట‌. తాజాగా ఓ ముఖాముఖిలో పాల్గొన్న జగపతి బాబు ఆ కష్ట కాలంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తనకు ఎలా అండగా నిలిచారో? గుర్తుచేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. జగపతి బాబు మానసికంగా ఎంతో కుంగిపోయి ఒంటరితనంతో బాధపడుతున్న సమయంలో ప్రభాస్ ఫోన్ చేశారట. ఆప్యాయంగా పలకరిస్తూ.. డార్లింగ్ నేనున్నాను. నీకేం కాదు.. దేనికీ ఆందోళన చెందకు` అంటూ ఎంతో ధైర్యాన్ని ఇచ్చారని జగపతి బాబు వెల్లడించారు. ప్రభాస్ మాట్లాడిన ఆ కొన్ని మాటలు తనలో కొండంత బలాన్ని నింపాయని, డిప్రెషన్ నుండి బయటపడటానికి ఆ సానుకూలమైన మద్దతు ఎంతో సహాయపడిందని కృతజ్ఞత చాటుకున్నారు. పరిశ్రమలో ప్రభాస్‌ను ఎందుకు అందరూ డార్లింగ్ అని పిలుస్తారో ఆయన మంచి మనసును బట్టి అర్థమవుతుందని ప్రశంసించారు.

ఇదే ఇంటర్వ్యూలోనే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి , ఆయన కుటుంబం గురించి జగపతి బాబు కొన్ని ఇంట్రెస్టింగ్ విష‌యాలు రివీల్ చేసారు. రాజమౌళి కుటుంబం చాలా క్రమశిక్షణతో కూడిన , ఎంతో ఉన్నతమైన కుటుంబమని కొనియాడారు. సినిమా పరిశ్రమలో ఇంతటి అపారమైన విజయాన్ని, అంతర్జాతీయ ఖ్యాతిని అందుకున్నా? ఆ కుటుంబంలో ఏమాత్రం గర్వం కనిపించదన్నారు. వారి నడవడిక - నిరాడంబరత అందరికీ ఆదర్శనీయమని పేర్కొన్నారు. అలాగే రాజమౌళి ఫ్యామిలీ ఐక్యతను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఒక ప్రాజెక్ట్ కోసం ఆ కుటుంబ సభ్యులంతా కలిసికట్టుగా ఎలా శ్రమిస్తారో జగపతి బాబు వివరించారు. కథా చర్చల నుండి నిర్మాణ పనుల వరకు ఒకరికొకరు అండగా నిలుస్తూ ఒకే తాటిపై నడవడం వారి ప్రత్యేకత అన్నారు. చలనచిత్ర రంగానికి వారు అందిస్తున్న సేవల వెనుక ఆ కుటుంబం కఠోర శ్రమ , అంకితభావం దాగి ఉన్నాయని అలాంటి వారితో అనుబంధం ఉండటం ఎవరికైనా గొప్ప అనుభూతిని ఇస్తుందని అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం జగపతి బాబు టాలీవుడ్‌లోనే కాకుండా సౌత్ ఇండియా వ్యాప్తంగా మోస్ట్ వాంటెడ్ నటుడిగా బిజీ అవుతున్నారు. క్యారెక్టర్‌లో వైవిధ్యం చూపిస్తూ విభిన్న భాషా చిత్రాలలో కీలక పాత్రలను ఎంచుకుంటూ తన నటనతో చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేస్తున్నారు. నటుడిగా కెరీర్ పరంగా ఎన్నో శిఖరాలను అధిరోహించినా? తెరవెనుక సెలబ్రిటీలు ఎదుర్కొనే మానసిక సంఘర్షణలను జగపతి బాబు ఈ విధంగా బహిరంగంగా పంచుకోవడం అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. పరిశ్రమలో తోటి నటుల మధ్య ఉండే నిజమైన స్నేహం, ఆప్యాయత ఒకరినొకరు ఎలా కాపాడుకుంటాయనే దానికి ప్రభాస్- జగపతి బాబుల అనుబంధమే చక్కని ఉదాహరణగా నిలుస్తోంది.