పిల్లల్ని ఈ ప్రపంచంలోకి తీసుకురావద్దు.. జగపతి సెన్సేషనల్ కామెంట్స్!
టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు మరోసారి తన ముక్కుసూటి వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు.
By: Sravani Lakshmi Srungarapu | 25 May 2026 2:00 PM ISTటాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు మరోసారి తన ముక్కుసూటి వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. కెరీర్ ప్రారంభంలో ఫ్యామిలీ హీరోగా ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఆయన.. ఇప్పుడు విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. అయితే సినిమాలకన్నా బయట ఆయన చెప్పే జీవిత తత్వాలు, ఫ్యామిలీ, పిల్లలు, సమాజం గురించి వ్యక్తపరిచే అభిప్రాయాలే తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రపంచంలోకి పిల్లలను తీసుకురావొద్దంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి.
ప్రస్తుతం ప్రపంచం వెళ్తున్న దిశ తనను భయపెడుతోందని జగపతి బాబు అభిప్రాయపడ్డారు. టెక్నాలజీ, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో మానవ సంబంధాలు క్రమంగా దూరమవుతున్నాయని ఆయన అన్నారు. కలియుగం అనేది ఇప్పుడు కళ్లముందే కనిపిస్తోందని, ప్రపంచం పూర్తిగా వేరే దిశలోకి వెళ్తోందని, ఫ్యూచర్ చాలా భయంకరంగా అనిపిస్తోందని, అలాంటి పరిస్థితుల్లో మన స్వార్థం, సరదా కోసం పిల్లలను ఈ ప్రపంచంలోకి ఎందుకు తీసుకురావాలని ప్రశ్నించారు. తల్లిదండ్రులు పిల్లలను కనడం తమ కోరిక కోసం మాత్రమేనని, కానీ ఆ పిల్లలే తర్వాత జీవితంలో అనేక ఒత్తిడులు, సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇదే టైమ్ లో పిల్లల పెంపకం, పెళ్లిళ్ల విషయంలో కూడా తన అభిప్రాయాలను ఆయన మరోసారి స్పష్టంగా వెల్లడించారు. గతంలో కూడా తన పెద్ద కూతురికి పెళ్లి చేయడం తప్పైందని చెప్పిన జగపతి బాబు, తన చిన్న కూతురికి తాను స్వయంగా పెళ్లి చేయనని కూడా చెప్పిన విషయం తెలిసిందే. పిల్లల జీవితాలను తల్లిదండ్రులు నియంత్రించాలనుకోవడం ప్రేమ కాదని, అది బాధ్యత పేరుతో చేసే ఒత్తిడేనని ఆయన అభిప్రాయపడ్డారు.
జగపతి బాబు దృష్టిలో బాధ్యత అనే పదానికంటే ప్రేమ అనే భావన గొప్పదట. పిల్లలకు ఏది ఇష్టమో అది చేసుకునే స్వేచ్ఛ ఇవ్వడమే నిజమైన ప్రేమ అని ఆయన పేర్కొన్నారు. పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడం బాధ్యత కాదని, నీకు నచ్చినట్టు జీవించు అని చెప్పడమే ప్రేమని ఆయన వ్యాఖ్యానించారు. తన పెద్ద కూతురికి పిల్లలు వద్దని, అవసరమైతే దత్తత తీసుకుని పెంచుకుంటానని చెప్పినప్పుడు కూడా తాను పూర్తి మద్దతు ఇచ్చానని తెలిపారు.
జగపతి బాబు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. కొందరు ఆయన ఆలోచనలను ఆధునిక దృక్పథంగా అభినందిస్తుంటే, మరికొందరు మాత్రం కుటుంబ వ్యవస్థపై ఇటువంటి వ్యాఖ్యలు అతిగా ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ పిల్లల భవిష్యత్తు, సమాజ మార్పులు, తల్లిదండ్రుల బాధ్యతలపై ఆయన లేవనెత్తిన ప్రశ్నలు మాత్రం ఆలోచింపజేసేలా ఉన్నాయనే మాట వినిపిస్తోంది.
