Begin typing your search above and press return to search.

వైసీపీ ఇంచార్జెస్ అండర్ కోల్డ్ స్టోరేజ్

వైసీపీ నేతలు గేర్ మార్చలేదని స్పీడ్ పెంచలేదని స్వయంగా అధినేత జగనే మీడియా సమావేశంలో వాపోయారు.

By:  Satya P   |   16 Sept 2025 12:45 PM IST
వైసీపీ ఇంచార్జెస్ అండర్ కోల్డ్ స్టోరేజ్
X

వైసీపీ నేతలు గేర్ మార్చలేదని స్పీడ్ పెంచలేదని స్వయంగా అధినేత జగనే మీడియా సమావేశంలో వాపోయారు. అధికారంలో ఉన్నపుడు అలాగే చేశారు ఇపుడు అదే తీరున ఉన్నారు అని కూడా ఆయన తమ వారి మీదనే సెటైర్లు పేల్చారు. నిజానికి జగన్ అలా నవ్వు తెచ్చుకుని అంటున్నా ఆ నవ్వు వెనక ఆవేదన నిర్వేదం అన్నవి స్పష్టంగా కనిపించాయి. తమ పార్టీ ప్రభుత్వం ఉన్నపుడూ ఒకేలా ఉన్నారు, దిగిపోయినపుడూ అలాగే ఉన్నారు, వీరికి చురుకుదనం వచ్చేదెపుడూ అన్నది ఆయన మాటల వెనక ఉద్దేశ్యం అయి ఉండాలని అంతా అంటున్నారు.

అధినేత తీరు అలా :

అయితే తన పార్టీ నేతలను విమర్శిస్తున్న జగన్ వైసీపీని పరుగులు పెట్టించేలా గేర్ మార్చారా అన్నది కూడా ప్రశ్నగా ముందుకు వస్తోంది ఎందుకంటే అందరి కంటే ఎక్కువ బాధ్యత ఆయనకే ఉంది కాబట్టి అంటున్నారు. వైసీపీ ఎపుడైతే ఓటమి పాలు అయిందో జగన్ బెంగళూరుకి మకాం మార్చేశారు. ఆయన తాడేపల్లికి వారానికి నాలుగు రోజులు మాత్రమే వస్తున్నారు. అలా వచ్చి టీడీపీ కూటమి మీద విమర్శలను ట్వీట్లను వేస్తూ తన పని సరి అని వెళ్ళిపోతున్నారు అని అంటున్నారు. అలా అధినేత ఉంటే నాయకులు తమకు తోచిన విధంగా వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు.

మొక్కుబడిగానే అంతా :

ఇక వైసీపీ అందరికీ పార్టీ పదవులు ఇచ్చింది. ప్రతీ నియోజకవర్గంలో ఇంచార్జిలను నియమించింది. అలా బాధ్యత తీసుకున్న వారు అంతా ఏమి చేస్తున్నారు అంటే తమ సొంత పనులు ఎక్కువగా చూసుకుంటునారు అని అంటున్నారు. పార్టీ ఇస్తున్న ఆందోళన కార్యక్రమాలలో కొంతమంది తూతూ మంత్రంగా పాల్గొంటూంటే మరికొంతమంది అయితే అసలు పార్టీ పిలుపునకు అందకుండా దూరంగా ఉంటున్నారు. తమ వ్యాపారాలు చూసుకుంటున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం మీద ఎన్నో ఫిర్యాదులు ఉన్నాయి. సమస్యలు చూస్తే జనాలకు సంబంధించి చాలా ఉన్నాయి. కానీ వీటి మీద వైసీపీ నేతలు ఎవరూ దృష్టి పెట్టడం లేదు సరికదా తమకెందుకొచ్చిన తంటా అన్నట్లుగా ఊరుకుండిపోతున్నారు అని అంటున్నారు.

టీడీపీ కూటమితో లాలూచీ :

తెలుగుదేశం కూటమితో లాలూచీ పడుతూ వారితో కలసి వ్యాపారాలు చేసుకుంటూ వైసీపీ ఊసే మరచిపోతున్న నాయకులు చాలా మందే ఉన్నారని అంటున్నారు. ముందు తమ సంగతి చూసుకుంటే చాలు ఆ మీదట పార్టీ విషయం అన్నట్లుగా అనేక మంది వైఖరిగా ఉంది. దీని మీద అధినాయకత్వం ఎన్ని సార్లు చెప్పినా ఎవరికీ పట్టింపు అయితే ఉండడం లేదు అని అంటున్నారు. ఎవరికీ పార్టీ పట్టదు, ప్రజా సమస్యలు అంతకంటే పట్టవు, పార్టీ కష్టాలలో ఉంది లేపాలి అన్న ఆలోచన అంతకంటే లేదు, కష్టపడి పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్ అడగవచ్చు అన్న భవిష్యత్తు ఆలోచనలు కూడా లేదు, షార్ట్ కట్ ప్లాన్స్ తోనే వైసీపీలో ఇంచార్జీలు అత్యధికులు ఉన్నారని అంటున్నారు. అందుకే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా పార్టీ యాక్టివిటీస్ సైతం పడకేస్తున్నాయని అంటున్నారు.

జగన్ దాన్నే నమ్ముకున్నారా :

ఇక వైసీపీ అధినాయకత్వం ఆలోచనలు కూడా వేరుగా ఉన్నాయని అంటున్నారు. పార్టీ స్ట్రక్చర్ కోసం అన్నట్లుగానే ఇంచార్జిలను నియమించి నడిపిస్తున్నారు కానీ ఎన్నికల వేళకు లెక్కలు చాలా మారుతాయని అంటున్నారు. అంతకు మించి తాను ఎవరికి టికెట్ ఇస్తే వారు గెలిచి వస్తారన్న నిబ్బరం కూడా జగన్ కి బాగా ఉందని అంటున్నారు. అందుకే ఇంచార్జిలు పార్టీని గాలికి వదిలేస్తూంటే అధినేత సైతం వారి విషయలో ఏ రకమైన సమీక్షా సమావేశాలు నిర్వహించడం లేదని అంటున్నారు. పార్టీ అన్నాక నేతలతో ఎప్పటికపుడు సమావేశాలు ఉండాలి. ప్రతిపక్షంలో ఉన్నపుడు అది మరీ అవసరంగా ఉంటుంది. కానీ వైసీపీలో ఆ రకమైన కార్యక్రమాలు ఏవీ పెద్దగా ఉండడం లేదు అని అంటున్నారు.

ఫోటోలకే పరిమితంగా :

వైసీపీ ఇంచార్జిలను కేవలం ఫోటోలకే పరిమితం చేస్తూ అధినాయకత్వం కూడా అలాగే వ్యవహరిస్తోంది అని అంటున్నారు. దాంతో వారి పట్ల సీరియస్ ఫోకస్ ఉండడం లేదు అన్న మాట ఉంది. ఇవన్నీ చూస్తూంటే ఎవరి అవసరాలకు వారు వైసీపీ నీడన ఉంటూ తమ పబ్బం గడుపుకుంటున్నారు అన్నదే వినిపిస్తున్న మాటగా ఉంది. అధికార పార్టీతో కుమ్మక్కు అవుతున్న వారు ప్రభుత్వం తప్పులు ఏమి ఎత్తి చూపుతారు అని కూడా అంటున్నారు ఏది ఏమైనా వైసీపీ మరో మూడున్నరేళ్ళ పాటు విపక్షంలో ఉండాలి. ఇదే తీరున సాగితే ఎన్నికల వేళకు ఎలా ఉంటుంది అన్నదే చర్చగా ఉంది. ఆ సమయానికి ఉన్న రాజకీయం బట్టి ఎలా ఉండాలో అన్నది పార్టీలో నేతల ఆలోచనలుగా ఉంటే ఎవరు గెలుపు గుర్రాలు అన్నది చూసి మరీ ఎంచుకోవాలన్నది హైకమాండ్ ప్లాన్ గా ఉంది అని అంటున్నారు. మొత్తానికి వైసీపీలో ఇపుడు అంతా ఎవరికి వారే అన్న చందంగా కధ సాగుతోంది అన్న విమర్శలు అయితే గట్టిగానే వినిపిస్తున్నాయి.