200 కోట్ల మోసం కేసు.. హీరోయిన్ నుంచి ఈ ట్విస్టు ఊహించలేదు!
సుప్రీంకోర్టుకు చెందిన జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ ఉపసంహరణకు అనుమతి ఇచ్చింది.
By: Sivaji Kontham | 27 Jun 2026 8:53 AM ISTబాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తనపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసు విచారణను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ప్రత్యేక అనుమతి పిటిషన్ (ఎస్.ఎల్.పి)ను ఉపసంహరించుకున్నారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పిఎంఎల్ఏ) కింద ట్రయల్ కోర్టు తనపై మోపిన చార్జీలను, అలాగే అంతకుముందు ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ జాకీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఇప్పుడు ఈ పిటిషన్‌ను వెనక్కి తీసుకోవడంతో ఇకపై దిగువ కోర్టులోనే నేరుగా న్యాయపోరాటం చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది.
సుప్రీంకోర్టుకు చెందిన జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ ఉపసంహరణకు అనుమతి ఇచ్చింది. చట్టప్రకారం అందుబాటులో ఉన్న ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించే స్వేచ్ఛను కోరుతూ జాక్వెలిన్ తరఫు న్యాయవాదులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు జూన్ 11న ఈ కేసును విచారించాల్సిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా బెంచ్ నుండి తప్పుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన అనుబంధ వ్యవహారంలో తన కుమారుడు ప్రభుత్వం తరఫున హాజరయ్యారని పేర్కొంటూ ఆయన ఈ నిర్ణయం తీసుకోవడంతో కేసు ప్రస్తుత ధర్మాసనానికి బదిలీ అయింది.
ఈ పరిణామంతో ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో ట్రయల్ విచారణకు మార్గం సుగమమైంది. ఇటీవలే ఈ కోర్టు ముందు హాజరైన జాక్వెలిన్, తనపై వచ్చిన ఆరోపణలను తిరస్కరిస్తూ తాను నిర్దోషినని కోర్టుకు విన్నవించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సుకేష్ చంద్రశేఖర్, అతడి భార్య లీనా మరియా పాల్‌తో పాటు మరో 14 మందిపై మనీలాండరింగ్ చార్జీలను ట్రయల్ కోర్టు ఇప్పటికే ఖరారు చేయగా.. నిందితులందరూ ఆరోపణలను తోసిపుచ్చుతూ విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు.
సుప్రీంకోర్టు పిటిషన్‌ను ఉపసంహరించుకోవడానికి కొద్దిరోజుల ముందే ఈ కేసులో అప్రూవర్‌గా మారేందుకు తాను పెట్టుకున్న దరఖాస్తును కూడా జాక్వెలిన్ వెనక్కి తీసుకున్నారు. తమను అప్రూవర్‌గా మార్చడాన్ని ఈడీ (ED) తీవ్రంగా వ్యతిరేకించింది. దర్యాప్తు సమయంలో జాక్విలిన్ ప్రవర్తన సంతృప్తికరంగా లేదని.. పూర్తి నిజాలను వెల్లడించలేదని ఈడీ కోర్టుకు తెలిపింది. సుకేష్ చంద్రశేఖర్ నేరపూరిత నేపథ్యం తెలిసిన తర్వాత కూడా జాకీ అతడితో పరిచయాన్ని కొనసాగించిందని... విచారణకు సరిగ్గా సహకరించలేదని దర్యాప్తు సంస్థ ఆరోపించింది.
ఈ వందల కోట్ల స్కామ్ మూలాల్లోకి వెళితే... మాజీ రాన్‌బాక్సీ ప్రమోటర్ల భార్యల నుండి సుకేష్ చంద్రశేఖర్ వసూలు చేసిన రూ. 200 కోట్ల నేరపూరిత సొమ్ము నుండి సుమారు రూ. 7 కోట్ల విలువైన లగ్జరీ వస్తువులు, ఖరీదైన బహుమతులను జాక్వెలిన్‌కు అందించినట్లు ఈడీ నిర్ధారించింది. అయితే ఈ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మొదటి నుండి వాదిస్తున్నారు. సుకేష్ నేర కార్యకలాపాల గురించి కానీ, ఆ బహుమతుల కొనుగోలుకు ఉపయోగించిన నిధుల మూలాల గురించి కానీ తనకు ఎలాంటి అవగాహన లేదని తాను అతని చేతిలో మోసపోయానని జాక్విలిన్ పేర్కొంటున్నారు. అయితే జైలు నుంచే తన ప్రేయసి జాక్విలిన్ కి ప్రేమలేఖలు రాస్తూ సుకేష్ చంద్రశేఖర్ అందరినీ కన్ఫ్యూజ్ చేస్తూ జాక్విలిన్ ని ఆడుకుంటున్న విషయం తెలిసిందే.
