జాకీ చాన్ లా టాలీవుడ్ హీరోల రిస్కులు!
హాలీవుడ్ యాక్షన్ హీరో, మార్షల్ ఆర్ట్స్ కింగ్ జాకీచాన్ అరివీర భయంకరమైన సాహసాల గురించి ఎంత చెప్పినా తక్కువే. రిస్కులు చేయనిదే ఆయన సినిమా లేదు.
By: Sivaji Kontham | 20 Oct 2025 9:11 AM ISTహాలీవుడ్ యాక్షన్ హీరో, మార్షల్ ఆర్ట్స్ కింగ్ జాకీచాన్ అరివీర భయంకరమైన సాహసాల గురించి ఎంత చెప్పినా తక్కువే. రిస్కులు చేయనిదే ఆయన సినిమా లేదు. శరీరంలో 216 ఎముకలు విరగ్గొట్టుకుని ఇప్పటికీ రిస్కీ స్టంట్లకు వెనకాడని డేరింగ్ హీరో. అతడి శరీరంపై వందలాదిగా కుట్లు పడ్డాయి. కొన్నిసార్లు అతడు ప్రమాదం కారణంగా గాయాల నుంచి కోలుకునేందుకు ఏళ్ల తరబడి వేచి చూసాడు. శరీరంలో ఎముకలు విరగడం అవి తిరిగి అతుక్కోవడం అంటే అంత ఆషామాషీ కాదు. చాలాసార్లు కాళ్లు, మోచేతులు కూడా విరగ్గొట్టుకున్నాడు. ఒకసారి పుర్రె కూడా చిట్లిపోయింది. అయినా సాహసాలకు అతడు ఎప్పుడూ వెనకాడలేదు.
`మిషన్ ఇంపాజిబుల్` ఫ్రాంఛైజీ కోసం టామ్ క్రూజ్ సాహస విన్యాసాలు అసాధారణమైనవి. ప్రమాదకర విన్యాసాలతో అతడు ప్రతిసారీ ఆశ్చర్యపరుస్తాడు. వేల అడుగుల ఎత్తు నుంచి అతడు చేసే జంప్ లు గగుర్పాటుకు గురి చేస్తాయి. భారీ ఛేజ్ లు యాక్షన్ సన్నివేశాల్లో అతడు చాలాసార్లు గాయపడ్డాడు. అయినా 60ప్లస్ ఏజ్ లోను అతడు సాహసాల బాటను విడిచిపెట్టడు.
ఇదంతా హాలీవుడ్ హీరోల స్టంట్స్ గురించిన విషయాలు. అయితే చాలా మంది తెలుగు స్టార్లు హాలీవుడ్ స్టార్ల స్ఫూర్తితో స్టంట్స్ పరంగా రిస్కులు చేయడానికి వెనకాడటం లేదు. టామ్ క్రూజ్ స్ఫూర్తితో, మహేష్ అతడిని ఇమ్మిటేట్ చేసేందుకు చాలాసార్లు ప్రయత్నించారు. కెరీర్‌లో మహేష్ చాలా సాహసాలు చేయడానికి టామ్ క్రూజ్ ఒక స్ఫూర్తి. వెండితెరపై అడుగుపెట్టిన ఆరంభ రోజుల్లోనే `వంశీ` లాంటి చిత్రంలో టామ్ క్రూజ్ స్ఫూర్తి కనిపించింది. పోకిరి లో అతడి స్టైల్, స్పీడ్ వెనక తన ఫేవరెట్ హాలీవుడ్ హీరోల స్ఫూర్తి దాగి ఉంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ యాక్షన్, స్టంట్స్ ఒక హాలీవుడ్ హీరోకు తక్కువ కాదు. దీనికి అతడు చాలామంది హాలీవుడ్ స్టార్లను స్ఫూర్తిగా తీసుకుంటారు. రిస్కీ యాక్షన్ సీన్స్ లో డూప్ ని ఉపయోగించడం చాలా అరుదు. ఇప్పుడు తమిళ స్టార్ హీరో విశాల్ తన శరీరంలో 118 కుట్లు పడ్డాయని, రిస్కీ స్టంట్లు చేయడానికి వెనకాడని స్వభావం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని తెలిపాడు. విశాల్ తన పాడ్ కాస్ట్ లో ఓపెన్ గా మాట్లాడిన విషయాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసాయి. ప్యారడైజ్ కోసం నాని కూడా అలాంటి రిస్కీ స్టంట్స్ చేస్తున్నారు. వార్ 2 కోసం ఎన్టీఆర్ సాహసాలు, రిస్కుల గురించి ఎంత చెప్పినా తక్కువే. అగ్రెస్సివ్ హీరో గోపిచంద్ రిస్కీ స్టంట్లు యాక్సిడెంట్ల గురించి తెలిసిందే. పాన్ ఇండియా రీచ్ కోసం చాలా మంది సౌత్ హీరోలు రిస్కులకు వెనకాడటం లేదు. అంతెందుకు .. నటసింహం నందమూరి బాలకృష్ణ సైతం లెజెండ్, అఖండ చిత్రాల్లో రిస్కీ స్టంట్లకు వెనకాడటం లేదు.. అంటే అది ఆశ్చర్యానికి గురి చేయక మానదు!!
