Begin typing your search above and press return to search.

70 ఏళ్ల వ‌య‌సులో సూప‌ర్ హీరోగా!

బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. 70 ఏళ్లు మీద ప‌డినా? ఆయ‌న స్పీడ్ ఏమాత్రం త‌గ్గ‌లేదు.

By:  Srikanth Kontham   |   14 May 2026 4:00 PM IST
70 ఏళ్ల వ‌య‌సులో సూప‌ర్ హీరోగా!
X

బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. 70 ఏళ్లు మీద ప‌డినా? ఆయ‌న స్పీడ్ ఏమాత్రం త‌గ్గ‌లేదు. న‌వ న‌టుడిలా నేటి త‌రం న‌టుల‌తో పోటీ ప‌డి మ‌రీ న‌టిస్తున్నారు. వార‌సుడు టైగ‌ర్ ష్రాప్ రంగంలోకి దిగినా? డాడ్ మాత్రం ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. తాజాగా ఆయన నటిస్తున్న `ది గ్రేట్ గ్రాండ్ సూపర్ హీరో: ఏలియన్స్ కా ఆగమన్` అనే చిత్రం ఇప్పుడు చిత్ర పరిశ్రమలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. 70 ఏళ్ల వ‌య‌సులో సూపర్ హీరో పాత్రను పోషించడం అనేది జాకీ ష్రాఫ్‌కు సవాలుగా మారింది.

సాధారణంగా యాక్షన్ , మాస్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే జాకీ ఇప్పుడు ఫాంటసీ , సైన్స్ ఫిక్షన్ జోనర్‌లో అడుగుపెట్టడం విశేషం. ఈ ప్రాజెక్టు గురించి జాకీ ష్రాఫ్ మాట్లాడుతూ తన కుమారుడు - బాలీవుడ్ యాక్షన్ స్టార్ టైగర్ ష్రాఫ్ ఇచ్చిన సలహాను గుర్తుచేసుకున్నారు. `సూపర్ హీరో పాత్ర పోషించడం అంత సులభం కాదు. అది చాలా కష్టంతో కూడుకున్న పని` అని టైగర్ తన తండ్రిని ముందే హెచ్చరించాడట. స్వయంగా ఫ్లయింగ్ జట్ వంటి సూపర్ హీరో చిత్రాల్లో నటించిన అనుభవం ఉన్న టైగర్ ఈ తరహా పాత్రలకు అవసరమైన శారీరక శ్రమ , విజువల్ ఎఫెక్ట్స్ షూటింగ్ సమయంలో ఉండే ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని ఆ మాట చెప్పినట్లు జాకీ వివరించారు.

దీంతో కుమారుడి హెచ్చరికను జాకీ సవాలుగా తీసుకున్నారు. కుర్రాళ్లే కాకుండా తన వయసు వారు కూడా సూపర్ హీరోలుగా మెరవగలరని నిరూపించాలనే పట్టుదలతో సినిమాను అంగీకరించినట్లు జాకీ గుర్తు చేసుకున్నారు.

ఈ సినిమాలో జాకీ ష్రాఫ్ ధరించే కాస్ట్యూమ్ , ఆయన చేసే విన్యాసాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. ఏలియన్స్ భూమిపైకి వచ్చినప్పుడు సూపర్ హీరోగా వారిని ఎలా ఎదుర్కొ న్నాడు అనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. షూటింగ్ అనుభవాల గురించి చెప్పారు.

భారీ గ్రీన్ మ్యాట్‌ల మధ్య, గాల్లో వేలాడుతూ నటించడం తనకు ఓ భిన్నమైన అనుభవాన్ని ఇచ్చిందని జాకీ తెలిపారు. `నేను నా కెరీర్‌లో ఎన్నో యాక్షన్ సీక్వెన్స్‌లు చేశాను. కానీ ఒక సూపర్ హీరోగా నటించడం అనేది పూర్తిగా మరో ప్రపంచం` అన్నారు. టైగర్ ష్రాఫ్ వంటి యువ నటులు పడే కష్టం ఇప్పుడు తనకు అర్థమవుతోందని, ప్రతి షాట్‌లోనూ పర్ఫెక్షన్ కోసం సాంకేతికతతో పోటీ పడాల్సి వ‌స్తుంద‌ని పేర్కొన్నారు. మొత్తానికి జాకీ ష్రాఫ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ నేటి తరం నటులకు పోటీనిస్తున్నారు. కుమారుడి సలహాను గౌరవిస్తూనే తనలోని నటుడిని కొత్తగా ఆవిష్కరించుకోవడానికి చేస్తున్న ప్రయత్నం అభినందనీయం.