స్టేజ్ పై ఏడ్చేసిన జబర్దస్త్ కమెడియన్.. 18 ఏళ్ల కెరియర్ లో!
సినీ ఇండస్ట్రీలో ప్రతిభ ఉన్నా సరైన అవకాశం దక్కక ఎందరో నటులు కష్టపడుతుంటారు. 'ఇరుముడి' చిత్ర విజయోత్సవ వేదికపై జబర్దస్త్ ఫేమ్ కొమరం తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
By: Madhu Reddy | 24 Aug 2026 10:39 PM ISTసినీ ఇండస్ట్రీలో ప్రతిభ ఉన్నా సరైన అవకాశం దక్కక ఎందరో నటులు కష్టపడుతుంటారు. 'ఇరుముడి' చిత్ర విజయోత్సవ వేదికపై జబర్దస్త్ ఫేమ్ కొమరం తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. దాదాపు 18 ఏళ్ల సినీ ప్రయాణంలో తాను ఎదుర్కొన్న అవమానాలు, లేడీ గెటప్‌ల వల్ల పడ్డ ముద్రలు, ఆ తర్వాత జీవితాన్ని మార్చిన ‘నాగులు’ పాత్ర వెనుక ఉన్న సంఘర్షణను వివరిస్తూ ఆయన మాట్లాడిన మాటలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి..
లేడీ గెటప్‌లకే పరిమితం చేశారు:
మైక్ అందుకుని మాట్లాడిన కొమరం.. ఇండస్ట్రీకి వచ్చి 18 ఏళ్లు దాటినా, గత 12 ఏళ్లుగా కేవలం ‘కొమురక్క’ అనే లేడీ గెటప్‌కే తనను పరిమితం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. "అందరూ నన్ను ఆ గెటప్‌తోనే చూసి గేలి చేశారు. నాతో ఒకే రూమ్‌లో ఉన్న సుమారు 15 మంది స్నేహితులు దర్శకులుగా ఎదిగినా, వాళ్లెవ్వరికీ నాలో ఉన్న నటుడు గుర్తుకు రాలేదు, ఒక్క చిన్న అవకాశం కూడా ఇవ్వలేదు" అని కన్నీటిపర్యంతమయ్యారు.
నాగులు పాత్రతో మారిన జీవితం:
ఎలాంటి పరిచయం లేకపోయినా దర్శకుడు శివ నిర్వాణ తనపై నమ్మకంతో 'ఇరుముడి'లో ‘నాగులు’ అనే కీలక పాత్ర ఇచ్చారని కొమరం కొనియాడారు. మొదటి రోజు రవితేజ కాలర్ పట్టుకుని కొట్టే సీన్ ఉందని చెప్పినప్పుడు భయపడ్డానని, కానీ ఆ ఒక్క పాత్ర తన జీవితాన్నే మార్చేసిందని తెలిపారు. ఆ పాత్ర చూసి ఇప్పుడు తన భార్యాపిల్లల కళ్లల్లో ఎన్నడూ లేని సంతోషం కనిపిస్తోందని, ఇప్పటికే పలు పెద్ద బ్యానర్ల నుంచి ఆఫర్లు వస్తున్నాయని చెప్పారు.
రవితేజ మాస్ హృదయం:
మాస్ మహారాజా రవితేజ వ్యక్తిత్వాన్ని కొనియాడుతూ.. "ఇండస్ట్రీలో హీరోలందరికీ వేర్వేరు అభిమానులు ఉంటారు, కానీ హీరోల అభిమానులందరూ ఇష్టపడే ఏకైక హీరో రవితేజ సార్. ఇక ఫైట్ సీన్లలో నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు, దెబ్బలు తగలకుండా ఎంతో సహకరించారు" అని కొమరం అన్నారు. రవితేజ గారితో వర్క్ చేయడం వల్లే ఈ క్యారెక్టర్ ఇంత బలంగా వచ్చిందని పేర్కొన్నారు.
ఆరు పెద్ద బ్యానర్ల నుంచి అవకాశాలు:
శివ నిర్వాణ నమ్మకం వల్లే ఇదంతా సాధ్యమైందని, 'ఇరుముడి' మూవీ తర్వాత తనకి ఇప్పటికే ఆరేడు ప్రముఖ ప్రొడక్షన్ హౌస్‌ల నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయని కొమరం ఆనందం వ్యక్తం చేశారు. ఇక కుటుంబాలంతా థియేటర్లకు వచ్చి సినిమా చూస్తుండటం చాలా సంతోషంగా ఉందన్నారు.
కష్టానికి తగిన ప్రతిఫలం:
ఎన్ని అవమానాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా పోరాడిన కొమరం, 'నాగులు' పాత్రతో తనలోని అసలైన నటుడిని నిరూపించుకున్నారు. ఇక క్యారెక్టర్ ఏదైనా ప్రాణం పెట్టి నటిస్తే విజయం కచ్చితంగా వరిస్తుందని చెప్పడానికి కొమరం ప్రయాణమే ఒక ఉదాహరణ.
