గోపీచంద్ ఎగ్జిట్ తో అతడొచ్చాడా?
బాలీవుడ్ లో సన్ని డియోల్ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని తెరకెక్కించిన `జాట్` మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.
By: Srikanth Kontham | 17 Nov 2025 3:00 PM ISTబాలీవుడ్ లో సన్ని డియోల్ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని తెరకెక్కించిన `జాట్` మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. గోపీచంద్ మార్క్ యాక్షన్ ఎంటర్ టైనర్ కు అక్కడ ఆడియన్స్ ఫిదా అయ్యారు. అసలైన మాస్ సినిమా ఎలా ఉంటుందో? హిందీ ఆడియన్స్ కు తొలిసారి రుచి చూపించాడు. దీంతో `జాట్` కి సీక్వెల్ ని కూడా అప్పట్లోనే ప్రకటించారు. అదే హీరోతో గోపీచంద్ మలినేని `జాట్ 2`ని రూపొందిస్తాడని తేలింది. అయితే ఇప్పుడీ ప్రాజెక్ట్ నుంచి దర్శకుడిగా గోపీచంద్ మలినేని ఎగ్జిట్ అయినట్లు తెలుస్తోంది.
సీక్వెల్ నుంచి తానే తప్పుకున్నాడా:
అతడి స్థానంలో `అందాజ్ అప్నా అప్నా`, `బర్సాత్` లాంటి హిట్ చిత్రాల్ని తెరకెక్కించిన రాజ్ కుమార్ సంతోషీని తీసుకున్నట్లు తెలిసింది. మరి గోపీచంద్ ఎందుకు బయటకు వచ్చినట్లు? అంటే బాలయ్య ప్రాజెక్ట్ కారణంగానే తప్పుకున్నట్లు తెలుస్తోంది. `అఖండ2` రిలీజ్ అనంతరం గోపీచంద్ బాలయ్యతో ఓ సినిమా చేయాల్సిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో `జాట్ 2` ఛాన్స్ మిస్ చేసుకున్నట్లు తెలుస్తోంది. సన్ని డియోల్ కూడా `జాట్ 2`ని ఇప్పటికిప్పుడే పట్టాలెక్కించాలని పట్టు బట్టారుట. కానీ గోపీచంద్ కు వీలు కాకపోవడంతో ఆ స్థానంలోకి రాజ్ కుమార్ సంతోషిని తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
సెట్స్ లో వారిద్దరు ఒకే సినిమాతో:
ఆ మార్పు అన్నది ఇద్దరి మధ్య ఎలాంటి మనస్పర్దలు లేకుండానే జరిగినట్లు తెలుస్తోంది. తన కోసం సన్ని డియోల్ ని వెయిట్ చేయించొద్దని ప్రత్యామ్నాయంగా మరో డైరెక్టర్ తో చేయాలనుకుంటే ముందుకు వెళ్లాలని గోపీచంద్ సూచించడంతో సన్ని మూవ్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సన్ని డియోల్ కథానాయకుడిగా రాజ్ కుమార్ సంతోషి `లాహోర్ 1947` తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే `జాట్ 2` ని పట్టాలెక్కిద్దామని ఇద్దరి మధ్య ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాదే `జాట్ 2` ప్రారంభమవుతుంది.
సీక్వెల్ రైటర్ ఎవరు?
అయితే `జాట్ 2 `కథ ఎవరు అందిస్తున్నారు? అన్నది తేలాలి. సీక్వెల్ రైట్స్ తీసుకుని రాజ్ కుమార్ స్టోరీ పనులు చూస్తున్నాడా? లేక! స్టోరీ ఇవ్వాల్సిన బాధ్యత గోపీచంద్ పై ఉందా? అన్నది తేలాలి. దీనికి సంబంధించి సమస్త సమాచారం మరికొన్ని రోజుల్లోనే అధికారికంగా బయటకు వస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం గోపీచంద్ మలినేని బాలయ్య ప్రాజెక్ట్ పైనే పని చేస్తున్నారు. `అఖండ 2` డిసెంబర్ 5న రిలీజ్ అవుతుంది. అనంతరం ఎప్పుడైనా బాలయ్యతో గోపీచంద్ ప్రాజెక్ట్ మొదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. నటీనటుల సహ హీరోయిన్ ఎంపిక ప్రక్రియ పూర్తయింది. కానీ ఆ వివరాలు ఇంకా వెల్లడించలేదు.
