కంటెంట్ బాగున్నా.. అదీ మెయినే 'అర్జున'..
సినిమా స్టోరీ బాగుంటే సరిపోదు.. ప్రేక్షకుల ముందుకు వచ్చే సమయం కూడా చాలా ముఖ్యం.
By: M Prashanth | 21 Oct 2026 4:00 AM ISTసినిమా స్టోరీ బాగుంటే సరిపోదు.. ప్రేక్షకుల ముందుకు వచ్చే సమయం కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా పెద్ద సినిమాలతో పోటీ ఉన్నప్పుడు ఆ విషయం మరింత ఇంపార్టెంట్. ఇప్పుడు 'ఇట్లు అర్జున' సినిమాకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. అక్టోబర్ 30న విడుదలవుతుందని ఇప్పటికే ప్రకటించిన ఆ సినిమాకు ఇప్పుడు వెంకటేష్ 'ఆదర్శ కుటుంబం' రూపంలో గట్టి పోటీనే ఎదురుకానుంది.
అనీష్, అనస్వర రాజన్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న 'ఇట్లు అర్జున' సినిమాకు మహేష్ ఉప్పల దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. అక్కినేని నాగార్జున ఆ మూవీని సమర్పిస్తున్నారు. ఒక అందమైన ప్రేమకథగా రూపొందుతున్న ఆ మూవీపై ప్రేక్షకుల్లో మంచి హైప్ ఉంది. అయితే, ఇప్పుడు విడుదల తేదీ దగ్గరపడుతున్న సమయంలో 'ఆదర్శ కుటుంబం'తో పోటీ హాట్ టాపిక్ గా మారింది.
నిజానికి 'ఇట్లు అర్జున' విడుదల తేదీ ఇప్పటికే రెండు సార్లు మారింది. మొదట అక్టోబర్ 2న విడుదల చేయాలని భావించారు. ఆ తర్వాత అక్టోబర్ 9కి మార్చారు. చివరకు అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించారు. ఇటీవల నాగార్జున కూడా మూవీ ఈవెంట్ లో క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన సినిమా కావడంతో మళ్లీ తేదీని మార్చే అవకాశం తక్కువగా కనిపిస్తోంది.
పైగా ప్రమోషన్ల కోసం సిద్ధం చేసిన కంటెంట్ ను ఇప్పటికే కొంతవరకు యూజ్ చేశారు మేకర్స్. అదే సమయంలో వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న 'ఆదర్శ కుటుంబం' అక్టోబర్ 30న విడుదల కానున్నట్లు వెంకటేష్ ప్రకటించారు. దీంతో ఇప్పుడు రెండు సినిమాలు ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వెంకటేష్ కు ఉన్న క్రేజ్, త్రివిక్రమ్ సినిమాలపై ఉండే అంచనాలు 'ఆదర్శ కుటుంబం'కు స్ట్రెంత్ గా మారనున్నాయి.
దీంతో 'ఇట్లు అర్జున' తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఒకే రోజు రెండు సినిమాలు విడుదలైతే థియేటర్ల కేటాయింపు కూడా ముఖ్యమైన అంశమే. పెద్ద సినిమాకు ఎక్కువ థియేటర్లు దక్కితే మరో మూవీకి అందుబాటులో ఉండే స్క్రీన్లు తగ్గే అవకాశం ఉంటుంది. అయితే, పెద్ద సినిమా వస్తోందని చిన్న మూవీ ఎప్పుడూ వెనక్కి తగ్గాల్సిందేనని చెప్పలేం. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు కొత్త సినిమాలను కూడా ఆదరిస్తారు.
పెద్ద సినిమాకు మించిన హిట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఆ కంటెంట్ ను ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లడానికి సరైన సమయం, తగిన ప్రమోషన్స్ అవసరం. ఇప్పటికే రెండుసార్లు విడుదల తేదీ మార్చుకున్న 'ఇట్లు అర్జున'కు మరోసారి డేట్ మార్చడం అంత ఈజీ కాదు. అదే సమయంలో 'ఆదర్శ కుటుంబం'తో పోటీని తక్కువగా అంచనా వేయలేం. అందుకే కంటెంట్ బాగున్నా, రిలీజ్ చేసే విండో కూడా అంతే ముఖ్యం. మరి ఆ విషయంలో 'అర్జున' ఏం చేస్తాడో అంతా వేచి చూడాలి.
