Begin typing your search above and press return to search.

బడా సినీ నిర్మాణ సంస్థపై ఐటీ సోదాలు.. దేశం గ‌ర్వించ‌ద‌గ్గ‌ సినిమా తీస్తుంటే చిక్కులా!

సహజంగానే పెద్ద బడ్జెట్లతో సినిమాలు నిర్మిస్తున్నారంటే ఆయా నిర్మాతలు లేదా నిర్మాణ సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ అధికారుల నిఘా ఉంటుంది.

By:  Sivaji Kontham   |   7 Oct 2026 10:24 PM IST
బడా సినీ నిర్మాణ సంస్థపై ఐటీ సోదాలు.. దేశం గ‌ర్వించ‌ద‌గ్గ‌ సినిమా తీస్తుంటే చిక్కులా!
X

సహజంగానే పెద్ద బడ్జెట్లతో సినిమాలు నిర్మిస్తున్నారంటే ఆయా నిర్మాతలు లేదా నిర్మాణ సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ అధికారుల నిఘా ఉంటుంది. గూఢచార వర్గాల సమాచారం లేదా లావాదేవీల పరిశీలనలో భాగంగా టాలీవుడ్‌లోనూ, బాలీవుడ్‌లోనూ చాలా అగ్ర నిర్మాణ సంస్థలు గతంలో ఐటీ రైడ్స్‌ను ఎదుర్కొన్న చరిత్ర ఉంది. ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతున్న ఒక ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ కార్యాలయాలపై ఐటీ దాడులు జరగడం ప్రస్తుతం నేష‌న‌ల్ మీడియా స‌హా సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

విదేశీ చెల్లింపులు -సరిహద్దు లావాదేవీలకు సంబంధించిన అనుమానాస్పద అంశాల నేపథ్యంలో ఐటీ శాఖ అధికారులు రంగంలోకి దిగారని టైమ్స్ ఆఫ్ ఇండియా స‌హా మిడ్ డే త‌మ క‌థ‌నంలో పేర్కొన్నాయి. ముంబైలోని సదరు అగ్ర నిర్మాణ సంస్థ (అగ్ర నిర్మాత నేతృత్వంలోని) ప్రధాన కార్యాలయాలతో పాటు దాని కీల‌క ఆడిటర్ ప్రాంగణాలలో కూడా ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. విజువల్ ఎఫెక్ట్స్, పోస్ట్-ప్రొడక్షన్ రంగాలలో అంతర్జాతీయంగా విస్తృతమైన కార్యకలాపాలు కలిగి ఉన్న ఈ సంస్థకు సంబంధించిన విదేశీ ఆర్థిక ప్రవాహాలు ఈ విచారణకు ప్రధాన కారణమని తెలుస్తోంది.

ఈ ఐటీ తనిఖీల వార్తలు బయటికి రాగానే అది నేరుగా స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపింది. 2026 అక్టోబర్ 7వ తేదీ ఇంట్రాడే ట్రేడింగ్‌లో అగ్ర నిర్మాణ సంస్థ షేర్లు కొంచెం డ్రాప్ అయ్యాయి. ఎలాంటి ముందస్తు సంకేతాలు లేకుండా వెలువడిన ఈ వార్తతో సంస్థ షేర్లు ఏకంగా 8 శాతం నుండి 9 శాతం వరకు పడిపోయాయి. అయితే ఈ పరిణామాలపై స్పందించిన సంస్థ యాజమాన్యం.. తమ దినసరి వ్యాపార కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం లేదని.. చట్టపరమైన విచారణకు అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నామని స్పష్టం చేసింది.

ఈ పరిణామాలు చోటుచేసుకున్న సమయం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రఖ్యాత హిందీ దర్శకుడి నేతృత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పురాణేతిహాసం సినిమా విడుదల కావడానికి సరిగ్గా ఒక్క నెల సమయం మాత్రమే ఉంది. ఇలాంటి కీలకమైన తరుణంలో నిర్మాణ సంస్థపై ఐటీ సోదాలు జరగడం, అది కూడా సినిమా విడుదలకు కొద్ది రోజులు ముందు రావడం పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఈ పరిణామాలు ఎలాంటి ప్రభావం చూపుతాయనేది ఆసక్తికరంగా మారింది.

మొత్తానికి అంతర్జాతీయ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్, యానిమేషన్ - నిర్మాణ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బడా సంస్థ ఎదుర్కొంటున్న ఈ తాజా ఐటీ విచారణ సర్వత్రా చర్చనీయాంశమైంది. విదేశీ మారకద్రవ్య నిబంధనలు, సరిహద్దు లావాదేవీల పారదర్శకత ఎంత ముఖ్యమో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంద‌నే చ‌ర్చ సాగుతోంది. ఏది ఏమైనా సినిమా విడుదల సమయానికి ఈ లీగల్ - ప‌న్ను సంబంధిత చిక్కులు తొలగిపోయి, సినిమా ప్రమోషన్స్ కు ఎలాంటి అడ్డంకులు లేకుండా సాగాలని అభిమానులు ఆశిస్తున్నారు. దేశం గ‌ర్వించ‌ద‌గ్గ‌ సినిమా తీస్తుంటే ఈ స‌మ‌యంలో ఇలాంటి ఐటీ చిక్కులా అని కూడా కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు.