14 సార్లు చెంప దెబ్బ తిన్న నటి
నాగ్ ఒకసారి చెంప దెబ్బ కొట్టాడు. కానీ ఆ షాట్ అంతగా వర్కవుట్ కాలేదు. ఇలా అయితే కుదరదు.. రియల్ గానే చెంప దెబ్బ కొట్టాలని నాగార్జునను ఇషా కొప్పికర్ ఒప్పించింది.
By: Sivaji Kontham | 30 July 2025 8:48 PM ISTఒకసారి కాదు రెండు సార్లు కాదు.. ఏకంగా 14సార్లు చెంప దెబ్బలు తిన్నానని చెప్పింది ఈ నటి. దానికి కారణం షాట్ పర్ఫెక్షన్.. అయితే ఆ సన్నివేశంలో అన్నిసార్లు దెబ్బలు కొట్టిన ఆ హీరో ఎవరో తెలుసా? కింగ్ నాగార్జున. చెంప దెబ్బలు తిన్న నటి- ఇషా కొప్పికర్. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన `చంద్రలేఖ` సినిమా కోసం చెంప దెబ్బ తినే సన్నివేశాన్ని చేయాల్సి వచ్చింది.
నాగ్ ఒకసారి చెంప దెబ్బ కొట్టాడు. కానీ ఆ షాట్ అంతగా వర్కవుట్ కాలేదు. ఇలా అయితే కుదరదు.. రియల్ గానే చెంప దెబ్బ కొట్టాలని నాగార్జునను ఇషా కొప్పికర్ ఒప్పించింది. అయినా నాగ్ మొదట సంకోచించాడు. కానీ సన్నివేశం పండాలంటే తప్పదు! అంటూ నాగార్జునను కన్విన్స్ చేసింది కొప్పికర్. ఆ తర్వాత కూడా పద్నాలుగు సార్ల ప్రయత్నించాల్సి వచ్చింది. చివరికి ఒక షాట్ ఓకే అయింది. చెంప దెబ్బ సీన్ బాగానే పండింది.
నారీ నారీ నడుమ...
ఇరువురు భామల నడుమ నలిగిపోయే కుర్రాడిగా నాగార్జున ఈ చిత్రంలో అద్భుతంగా నటించారు. ఇషా కొప్పికర్, రమ్యకృష్ణల నటనకు కూడా మంచి పేరొచ్చింది. సినిమా ఆశించినంతగా ఆడకపోయినా ఆ తర్వాత బుల్లితెరపై ప్రేక్షకులు బాగానే ఆదరించారు.
రమ్యకృష్ణతో పోటాపోటీగా..
తాజా ఇంటర్వ్యూలో ఇషా కొప్పికర్ నాటి సంగతుల్ని గుర్తు చేసుకుంది. చెంప దెబ్బ కొట్టేందుకు నాగార్జున చాలా సంకోచించారని కూడా ఇషా చెప్పింది. మొదటి సారి చెంప దెబ్బ పడగానే దానికి ఇషా పెద్దగా స్పందించలేదట. మొత్తానికి పద్నాలుగు సార్లు ప్రయత్నిస్తే కానీ ఓకే కాలేదు. చంద్రలేఖలో రమ్యకృష్ణ, ఇషా ఒకరితో ఒకరు పోటీపడి నటించారు. ఈ సినిమాలో ఆస్పత్రి సన్నివేశంలో ఇషా కొప్పికర్ ఎమోషనల్ పెర్ఫామెన్స్ ఆకట్టుకుంటుంది.
సౌత్ సినిమాదే హవా:
ప్రస్తుతం దక్షిణాది సినిమా హవా గురించి కూడా ఇషా తాజా ఇంటర్వ్యూలో ఒక రేంజులో పొగిడేసింది. నేడు ప్రపంచవ్యాప్తంగా దక్షిణాదికి గుర్తింపు దక్కిందని, అప్పట్లో తాను ఎక్కడ నటిస్తున్నానో కూడా ఎవరికీ తెలిసేది కాదని కూడా తెలిపింది. ఇప్పుడు సౌత్ సినిమాల్ని బాలీవుడ్ లో రీమేక్ చేస్తుండటం చూస్తుంటే సౌత్ డామినేషన్ ని అంచనా వేయొచ్చని కూడా పేర్కొంది.
