మెట్ గాలా ఈవెంట్లో మామిడి పండు మెరుపులు.. అంబానీ కుమార్తె సెంటిమెంట్!
వేసవిలో మామిడి పండు రుచులు చూడని వారు లేరు. అలాంటి మామిడి పండు ఇప్పుడు మెట్ గాలా -2026 ఫ్యాషన్ ఈవెంట్లో ప్రధాన ఆకర్షణగా మారింది.
By: Sivaji Kontham | 5 May 2026 3:19 PM ISTవేసవిలో మామిడి పండు రుచులు చూడని వారు లేరు. అలాంటి మామిడి పండు ఇప్పుడు మెట్ గాలా -2026 ఫ్యాషన్ ఈవెంట్లో ప్రధాన ఆకర్షణగా మారింది. ఇది ఎంపిక చేసుకున్న డిజైన్‌లో ఇమిడిపోయి ఆ దుస్తులు ధరించిన వ్యక్తికి ప్రత్యేకతను ఆపాదించింది. ఇంతకీ మెట్ గాలా ఈవెంట్లో మ్యాంగ్ యాక్సెసరీని ధరించిన ఆ యువతి ఎవరు? అంటే.. ప్రపంచ కుభేరుడు ముఖేష్ అంబానీ కుమార్తె ఈషా అంబానీ. పూర్తి వివరాల్లోకి వెళితే..
సాధారణంగా వేసవి కాలం వచ్చిందంటే చాలు అందరికీ గుర్తుకు వచ్చేది మామిడి పండు రుచి. అయితే 2026 మెట్ గాలా ఫ్యాషన్ ఈవెంట్‌లో ఈ మామిడి పండు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికపై ఒక కళాకృతిగా మారి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రపంచ కుభేరుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ కుమార్తె ఈషా అంబానీ ఈ మెట్ గాలా వేడుకలో తన వస్త్రధారణతో ప్రపంచ దృష్టిని ఆకర్షించడమే కాకుండా.. భారతీయ సంస్కృతిని.. వ్యక్తిగత సెంటిమెంట్లను మేళవించి ఒక కొత్త ఒరవడిని సృష్టించారు. ఈషా ధరించిన దుస్తుల్లో దాగి ఉన్న మామిడి పండు యాక్సెసరీ ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
ఈషా అంబానీ తన చేతిలో పట్టుకున్న ఆ మామిడి పండు నిజమైన పండు కాదు. అది ప్రముఖ కళాకారుడు సుబోధ్ గుప్త రూపొందించిన 20 ఏళ్ల నాటి ఒక అరుదైన శిల్పం (స్కల్ప్చర్). కేవలం ఫ్యాషన్‌ను ప్రదర్శించడమే కాకుండా.. భారతీయ కళాకారుల ప్రతిభను అంతర్జాతీయ వేదికపై గౌరవించడం ఈషా లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రఖ్యాత డిజైనర్ గౌరవ్ గుప్తా రూపొందించిన అద్భుతమైన చేనేత చీర శిల్పకళా శైలిలో ఉన్న కేప్ తనకు ఒక రాచరికపు రూపాన్ని అందించాయి. ఈ వస్త్రధారణ ఆధునికతకు.. భారతీయ చేనేత కళకు నిలువుటద్దంగా నిలిచింది.
ఈషా ధరించిన బ్లౌజ్ కేవలం అలంకరణకు మాత్రమే పరిమితం కాలేదు.. దాని నిండా ఎన్నో భావోద్వేగపూరితమైన అంశాలు ఉన్నాయి. తన తల్లి నీతా అంబానీకి సంబంధించిన మధుర జ్ఞాపకాలను ఈ బ్లౌజ్ డిజైన్‌లో పొందుపరిచినట్లు ఈషా వెల్లడించారు. తల్లిపై ఉన్న ప్రేమాభిమానాలను ప్రతిబింబించేలా ఈ బ్లౌజ్ రూపొందించడం విశేషం. గ్లోబల్ రెడ్ కార్పెట్‌పై నడుస్తున్నప్పుడు కూడా మన మూలాలను.. అమ్మ జ్ఞాపకాలను వెంట తీసుకెళ్లడం ఈషా వ్యక్తిత్వానికి అద్దం పడుతోంది.
వస్త్రధారణలో వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సెంటిమెంట్లను జోడించడం ఈషా అంబానీ లుక్‌కు మరో ప్రత్యేకతను తెచ్చింది. తన పిల్లలు పుట్టినప్పుడు బహుమతులుగా అందిన కొన్ని అరుదైన వస్తువుల భాగాలను కూడా ఈ బ్లౌజ్ డిజైన్‌లో చేర్చారు. ఒక తల్లిగా తన అనుభూతులను.. కుటుంబ బంధాలను ఇలా ఫ్యాషన్ రూపంలో ప్రపంచానికి చూపించడం అందరినీ ఆకట్టుకుంది. దీనివల్ల తను ధరించిన డ్రెస్ కేవలం ఒక దుస్తుల జతగా కాకుండా.. ఒక జ్ఞాపకాల అరలా మారిపోయింది.
మెట్ గాలా 2026 వేదికపై ఈషా అంబానీ ప్రదర్శించిన ఫ్యాషన్ ఒక సంపూర్ణ కళాఖండం అని చెప్పవచ్చు. భారతీయ వారసత్వం, కళలు, సంప్రదాయాలను మేళవిస్తూనే.. వ్యక్తిగత భావోద్వేగాలను వస్త్రాలపై అద్భుతంగా ఆవిష్కరించారు. సంప్రదాయం, ఆధునికత మధ్య సమతుల్యతను పాటిస్తూ ఈషా చేసిన ఈ ప్రయోగం.. ఫ్యాషన్ ప్రపంచంలో భారతీయత గొప్పతనాన్ని మరోసారి చాటిచెప్పింది. కేవలం ధనిక కుటుంబానికి చెందిన యువతిగానే కాకుండా.. కళను ప్రేమించే మనసున్న వ్యక్తిగా ఈషా అంబానీ తన అస్తిత్వాన్ని చాటుకున్నారు. ఈషా అంబానీ తల్లిగారు నీతా అంబానీ కూడా ఫ్యాషన్ సెన్స్ పరంగా ప్రపంచం దృష్టిని నిరంతరం ఆకర్షిస్తూనే ఉన్నారు.
