Begin typing your search above and press return to search.

మాల ఒక్కటే కాదు.. 'ఇరుముడి'లో మూడు ముళ్లు!

‘ఇరుముడి’ని అయ్యప్ప మాల నేపథ్యంలో వచ్చే సినిమా అనుకుని ఒక్క కోణంలో చూడొద్దని దర్శకుడు శివ నిర్వాణ చెబుతున్నారు.

By:  M Prashanth   |   19 Aug 2026 9:26 AM IST
మాల ఒక్కటే కాదు.. ఇరుముడిలో మూడు ముళ్లు!
X

‘ఇరుముడి’ని అయ్యప్ప మాల నేపథ్యంలో వచ్చే సినిమా అనుకుని ఒక్క కోణంలో చూడొద్దని దర్శకుడు శివ నిర్వాణ చెబుతున్నారు. సినిమాలో మాల దీక్ష, ఫ్యామిలీ ఎమోషన్, క్రైమ్ యాంగిల్.. ఇలా మూడు లేయర్స్ ఉంటాయన్నారు. తండ్రి కూతురు బంధం, అయ్యప్ప భక్తుడిగా హీరో, మధ్యలో వచ్చే క్రైమ్ పాయింట్‌ను కలిపేలా కథ ఉంటుందని చెప్పారు. అందుకే ‘ఇరుముడి’ అనే టైటిల్ పెట్టామని తెలిపారు. ఇది అయ్యప్ప స్వామి కథ కాదని, మాల బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా అని క్లారిటీ ఇచ్చారు.




రవితేజను మాత్రం ఇప్పటివరకు చూడని విధంగా చూపించే అవకాశం ఈ కథ ఇచ్చిందని శివ అంటున్నారు. కథ మొదట అనుకున్నప్పుడు హీరోగా ఎవరినీ ఫిక్స్ చేసుకోలేదని, రవితేజకు చెప్పిన తర్వాత మాత్రం ఆయన గడ్డం, లుక్, ఆ పాత్రకు బాగా సెట్ అయ్యాయని అనిపించిందన్నారు. మాలలో ఉన్నప్పుడు హీరో ఎలా ఉంటాడు, మాల లేకపోయినప్పుడు ఎలా ఉంటాడు అన్న తేడాను కూడా స్క్రీన్‌ప్లేలో ఉపయోగించుకున్నట్లు చెప్పారు. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’లాంటి సినిమాల తర్వాత ఇలాంటి క్రైమ్ యాంగిల్ ఉన్న కథ చేయడానికి కారణం కూడా గుర్తుండిపోయే కథలు చేయాలనే తన కోరికేనన్నారు.




అయ్యప్ప మాల విషయాల్లో తప్పులు ఉండకూడదనే ఉద్దేశంతో శివ స్వయంగా మాల కూడా వేసుకున్నట్లు తెలిపారు. గతంలో హను రాఘవపూడితో కలిసి శబరిమల వెళ్లిన అనుభవం కూడా ఉపయోగపడిందన్నారు. భజనలు, మంగళహారతులు, రుద్రాక్షలు వేసుకునే విధానం వరకు జాగ్రత్తగా చూసుకున్నామని చెప్పారు. ‘మాలికాపురం’తో వచ్చిన పోలికలను కూడా పెద్దగా పట్టించుకోలేదని, ట్రైలర్ తర్వాత తమ సినిమా ఏంటో ప్రేక్షకులకు క్లారిటీ వచ్చిందన్నారు.

‘మల్లెపూల పల్లకి’ పాట వెనుక కూడా ఇదే జాగ్రత్త ఉందట. సీలేరు ప్రాంతంలో అయ్యప్ప భక్తులు ఎక్కువగా పాడుకునే పాట ఏదని తెలుసుకుంటే ఈ పాట పేరు వచ్చిందన్నారు. దాదాపు 15 ఏళ్లుగా పడిపూజల్లో వినిపిస్తున్న పాట కావడంతో కొత్త సింగర్‌తో కాకుండా, ఒరిజినల్‌గా పాడిన డప్పు శ్రీనుతోనే మళ్లీ రికార్డ్ చేశామని చెప్పారు. ఇప్పుడు ఆయన వయసు 60 ఏళ్లు అయినా అదే గొంతు ఉండాలని టీమ్ నిర్ణయించుకుందన్నారు. పాట విడుదలైన రెండు రోజుల్లోనే 9 మిలియన్ వ్యూస్ దాటిందని కూడా తెలిపారు.

విజువల్స్ కోసం సాధారణంగా వెళ్లే లొకేషన్స్ కాకుండా మారేడుమిల్లి దాటి సీలేరు వరకు వెళ్లామని శివ చెప్పారు. ఆంధ్ర ఒడిశా బోర్డర్‌లోని కొండలు, అడవులు కథకు బాగా ఉపయోగపడ్డాయన్నారు. సినిమాటోగ్రాఫర్ విష్ణు శర్మ తన స్పీడ్‌కు తగ్గట్టుగా పని చేసి మంచి విజువల్స్ ఇచ్చాడని చెప్పారు. బేబీ నక్షత్రను ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూసి ఎంపిక చేశామని, ‘మనెమ్మ’ పాత్రకు కావాల్సిన నేటివిటీ ఆమెలో కనిపించిందన్నారు. గురుస్వామిగా సాయికుమార్ లుక్ కూడా పాత్రకు బాగా కుదిరిందని తెలిపారు.

ఇక షూటింగ్ సమయంలోనే మాంటేజ్ షాట్స్ తీసుకోవడం తనకు ‘నిన్ను కోరి’ నుంచి ఉన్న అలవాటని శివ చెప్పారు. దాంతో ఊరు, ప్రాంతం కూడా కథలో భాగంలా కనిపిస్తుందన్నారు. సీలేరులో దాదాపు 250 మందితో షూటింగ్ చేసినప్పుడు మైత్రి మూవీ మేకర్స్ నుంచి పూర్తి సపోర్ట్ దొరికిందని గుర్తుచేశారు. ఇక రామ్ చరణ్ సినిమాలో కనిపిస్తారనే సోషల్ మీడియా టాక్స్ మాత్రం నిజం కాదని అన్నారు. చరణ్ అయ్యప్ప భక్తుడు కావడంతో అభిమానులు అలా ఊహించి ఉండొచ్చని, కానీ సినిమాలో ఆయన కనిపించరని క్లారిటీ ఇచ్చారు. ఆగస్టు 21న వస్తున్న ‘ఇరుముడి’పై తాము పెట్టుకున్న నమ్మకాన్ని ప్రేక్షకులు కూడా థియేటర్‌లో ఫీల్ అవుతారని శివ అంటున్నారు.