ప్రయోగమే.. కానీ రవితేజ సేఫ్ రూట్
రవితేజ కెరీర్ మొత్తం చూస్తే రెగ్యులర్ మాస్ సినిమాల మధ్య అప్పుడప్పుడు పూర్తిగా రూట్ మార్చిన సందర్భాలు ఉన్నాయి.
By: M Prashanth | 18 Aug 2026 10:29 AM ISTరవితేజ కెరీర్ మొత్తం చూస్తే రెగ్యులర్ మాస్ సినిమాల మధ్య అప్పుడప్పుడు పూర్తిగా రూట్ మార్చిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి వాటిలో ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్’ ముందుగా గుర్తొస్తుంది. వరుస ప్రేమ జ్ఞాపకాలతో నెమ్మదిగా సాగే ఆ సినిమాలో రవితేజ నుంచి అప్పటివరకు ప్రేక్షకులు చూసిన ఎనర్జీ చాలా తక్కువ. తర్వాత ‘నేనింతే’లో సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం తిరిగే అసిస్టెంట్ డైరెక్టర్‌గా కనిపించాడు. ఆ సినిమా కమర్షియల్‌గా పెద్ద రేంజ్‌కు వెళ్లకపోయినా రవితేజ నటనకు నంది అవార్డు వచ్చింది.
‘శంభో శివ శంభో’లో కూడా ముగ్గురు స్నేహితుల కథలో ఒకడిగా ఉండిపోయాడు. అక్కడ హీరోయిజం కంటే స్నేహం కోసం వాళ్లు కోల్పోయేది ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ‘డిస్కో రాజా’తో సైన్స్ ఫిక్షన్ కూడా ట్రై చేశాడు. మంచులో గడ్డకట్టిన వ్యక్తిని తిరిగి బతికించే ప్రయోగం చుట్టూ కథ నడిచింది. ‘టైగర్ నాగేశ్వరరావు’ కోసం 1970ల స్టువర్ట్‌పురం నేపథ్యంలోని నిజ జీవిత దొంగ పాత్రలోకి వెళ్లాడు. అంటే కొత్త జానర్ లేదా వేరే క్యారెక్టర్ వస్తే రవితేజ పూర్తిగా వెనక్కి తగ్గిన హీరో కాదు.
అయితే ఆయన చేసిన ప్రయోగాల్లో ‘రాజా ది గ్రేట్’ లెక్క కొంచెం వేరు. చూపులేని హీరో అనే పాయింట్ తీసుకున్నా అనిల్ రావిపూడి దాన్ని సీరియస్ డ్రామాగా మార్చలేదు. కామెడీ, ఫైట్లు, రవితేజ ఎనర్జీ అన్నీ అలాగే ఉంచాడు. సినిమా కూడా కమర్షియల్‌గా వర్కౌట్ అయింది. ఒక కొత్త క్యారెక్టర్‌ను రవితేజ ఇమేజ్‌కు సరిపోయే ప్యాకేజీలో పెడితే ప్రేక్షకులు తీసుకుంటారనే ఉదాహరణ అది.
ఇప్పుడు ‘ఇరుముడి’ కూడా దాదాపు ఆ మధ్య దారిలోనే కనిపిస్తోంది. రవితేజ ఇందులో తాగుడు అలవాటు, గతంలో హింసాత్మక స్వభావం ఉన్న తండ్రిగా కనిపిస్తున్నాడు. కూతురితో ఉన్న బంధమే కథకు మెయిన్. మధ్యలో అయ్యప్ప దీక్ష ఆయన జీవితంలో మార్పు తీసుకొస్తుంది. ట్రైలర్‌లో యువతుల మరణాల చుట్టూ మిస్టరీ కూడా చూపించారు. అంటే భక్తి సినిమా కాదు, పూర్తిగా తండ్రీకూతుళ్ల ఎమోషనల్ డ్రామా కూడా కాదు.
మరోవైపు రవితేజ నుంచి ప్రేక్షకులు ఆశించే యాక్షన్‌ను కూడా శివ నిర్వాణ తీసేయలేదు. యాక్షన్ సన్నివేశాలు గట్టిగానే ఉన్నట్లు టీమ్ ముందే క్లారిటీ ఇచ్చింది. పాటల్లో ‘మల్లెపూల పల్లకి’లాంటి తెలిసిన అయ్యప్ప టచ్ ఉంది. దర్శకుడు మాత్రం చివరి నలభై నిమిషాలు చాలా ఇంటెన్స్‌గా ఉంటాయని చెబుతున్నాడు. ఇలా ఫ్యామిలీ, మిస్టరీ, భక్తి, యాక్షన్ అన్నీ కలిపి తీసుకెళ్తున్నారు.
అందుకే ‘ఇరుముడి’ని రవితేజ కెరీర్‌లో మరో పూర్తి ప్రయోగం అనడం కష్టం. అదే సమయంలో రెగ్యులర్ మాస్ సినిమా అని కూడా చెప్పలేం. నా ఆటోగ్రాఫ్ లా తన ఇమేజ్‌ను పూర్తిగా పక్కన పెట్టకుండా, రాజా ది గ్రేట్ తరహాలో కొత్త పాయింట్‌కు కమర్షియల్ టచ్ జోడించిన ప్రయత్నంలాగా అనిపిస్తోంది. ఈ మిక్స్ అన్ని పర్ఫెక్ట్ గా కుదిరితే రవితేజకు మంచి హిట్ దొరికినట్లే.
