ఓటీటీలోను 'ఇరుముడి' హవా.. జాబితాలో రాజా నంబర్-1
By: Sivaji Kontham | 30 Sept 2026 7:53 PM ISTమాస్ మహారాజా రవితేజ నటించిన `ఇరుముడి` చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా దాదాపు 250కోట్ల వసూళ్లను సాధించింది. రవితేజ కెరీర్ ఉత్తమ సినిమాల్లో ఇది ఒకటిగా నిలిచింది. కేవలం పెద్ద తెరపైనే కాదు.. ఇప్పుడు చిన్న తెరపైనా ఇరుముడి హవా కొనసాగుతోందనేది ఒక రిపోర్ట్. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ నాన్-ఇంగ్లీష్ సినిమాల చార్ట్‌లో మొదటి స్థానాన్ని దక్కించుకోవడం ఒక సంచలనం. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన తర్వాత ఓటీటీలోనూ తన జోరును కొనసాగిస్తోంది. ఇదే సమయంలో విడుదలైన తమిళ చిత్రం `మోధ రాతిరి` రెండో స్థానంలో నిలిచింది.
సెప్టెంబర్ 21 నుండి 27 మధ్య జరిగిన వ్యూస్ ఆధారంగా ఈ సినిమాలు టాప్-10 జాబితాలో మొదటి రెండు స్థానాలను కైవసం చేసుకున్నాయి. రవితేజ `ఇరుముడి` చిత్రం 34 లక్షల వ్యూస్ .. 81 లక్షల వ్యూయింగ్ అవర్స్‌ను సొంతం చేసుకుంది. అలాగే రిషికాంత్ నటించిన `మోధ రాతిరి` చిత్రం 29 లక్షల వ్యూస్, 69 లక్షల వ్యూయింగ్ అవర్స్‌తో రెండో స్థానంలో నిలిచింది.
`ఇరుముడి` చిత్రంలో రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్, సాయి కుమార్, నక్షత్ర తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. థియేట్రికల్ రన్‌లో అద్భుతమైన వసూళ్లు సాధించిన ఈ సినిమా, ఒక మద్యపాన వ్యసనపరుడైన తండ్రి అయ్యప్ప దీక్ష పూనాక ఏం జరుగుతుందో.. అలాగే తన గ్రామంలో జరిగే అన్యాయాలను ఎదుర్కొనే వాడిగా అతడి మొండితనం ఎలాంటిదో సినిమాలో చూపించారు. కూతురి సెంటిమెంట్ ఆద్యంతం రక్తి కట్టించింది.
ఈ చిత్రంలో బాలికలపై అదృశ్యంగా జరుగుతున్న అఘాయత్యాల వంటి సున్నితమైన అంశాన్ని స్పృశించారు. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 244.97 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. గత కొన్ని చిత్రాల పరాజయాల తర్వాత రవితేజ కెరీర్‌కు ఈ సినిమా భారీ విజయాన్ని అందించింది.
తన వయసుకు, తన లుక్కుకు తగ్గ పాత్రను ఎంచుకుంటే ఫలితం ఎలా ఉంటుందో మాస్ రాజా ఈ చిత్రంతో తెలుసుకోగలిగారు. ఇకపై కూడా ఇలాగే క్వాలిటీగా ఆలోచించి మంచి స్క్రిప్టులు ఎంపిక చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. లేకపోతే మునుపటి ఫలితాలనే ఎదుర్కోవాల్సి వస్తుందని సినీ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
