రూ.200 కోట్లు వచ్చినా.. నాలుగు వారాలకే ఓటీటీనా!
‘ఇరుముడి’ ఇప్పుడు నాలుగో వారంలో కూడా థియేటర్లలో బాగానే నడుస్తోంది. నాలుగో శనివారం కూడా కలెక్షన్స్ పెరగడం, ఇండియాలో వెయ్యికి పైగా షోలు కొనసాగడం హైలెట్.
By: M Prashanth | 13 Sept 2026 9:45 AM IST‘ఇరుముడి’ ఇప్పుడు నాలుగో వారంలో కూడా థియేటర్లలో బాగానే నడుస్తోంది. నాలుగో శనివారం కూడా కలెక్షన్స్ పెరగడం, ఇండియాలో వెయ్యికి పైగా షోలు కొనసాగడం హైలెట్. ఇలాంటి టైమ్‌లోనే సెప్టెంబర్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందనే టాక్ వచ్చింది. హిట్ సినిమా ఇంకా థియేటర్లలో డబ్బు తెస్తుంటే, ఓటీటీని ఎందుకు ఇంత త్వరగా తీసుకురావాలి అనే సందేహం హాట్ టాపిక్ గా మారుతోంది.
ఇది ఒక్క ‘ఇరుముడి’ సినిమా సమస్య కాదు. టాలీవుడ్‌లో నాలుగు వారాల ఓటీటీ విండో చాలా కాలంగా నడుస్తోంది. సినిమాను ముందుగానే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌కు అమ్మేటప్పుడు స్ట్రీమింగ్ టైమ్‌లైన్ కూడా డీల్‌లో భాగమవుతోంది. సినిమా రిలీజ్ తర్వాత ఫ్లాప్ అయితే నిర్మాతకు ఆ డీల్ అడ్వాంటేజ్ గా ఉంటుంది. కానీ ఊహించని బ్లాక్‌బస్టర్ వస్తే అదే నాలుగు వారాల గ్యాప్ థియేటర్లకు చిన్నదిగా అనిపిస్తుంది. హిట్ వచ్చిన తర్వాత మాత్రమే విండో మార్చడం అంత సులభం కాదు.
ఈ ఏడాది మొదట్లోనే దక్షిణాది ఎగ్జిబిటర్లు ఎనిమిది వారాల ఓటీటీ విండో కావాలని డిమాండ్ చేశారు. పెద్ద సినిమా అయినా, చిన్న సినిమా అయినా కనీసం 56 రోజులు థియేటర్లకే ఇవ్వాలని వాదించారు. దీనికి నిర్మాతల నుంచి వెంటనే అంగీకారం రాలేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ నిర్మాతల సంఘాలు కలిసి కొత్త వేదిక ఏర్పాటు చేసి, తమతో చర్చించకుండా ఒకే రూల్ పెట్టొద్దని కూడా చెప్పాయి. డిజిటల్ రైట్స్ నుంచి వచ్చే డబ్బు చాలా సినిమాలకు బడ్జెట్ రికవరీలో కీలకంగా ఉండటమే దీనికి అసలు కారణం.
ఇరుముడి విషయానికి వస్తే.. ఆగస్టు 21న విడుదలైన సినిమా నాలుగో వారానికి వచ్చేసరికి కూడా కొత్త రిలీజుల మధ్య స్ట్రాంగ్ గా నిలబడుతోంది. సెప్టెంబర్ 12న నాలుగో శనివారం ఇండియాలో రూ.2.25 కోట్ల నెట్ వచ్చినట్లు ట్రాకింగ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. 1,200కు పైగా షోలు కూడా కొనసాగాయి. అంటే థియేట్రికల్ డిమాండ్ పూర్తిగా తగ్గకముందే డిజిటల్ విండో దగ్గరకు వచ్చేసింది.
అయితే సెప్టెంబర్ 18 తేదీపై ఇంకా మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన లేదు. మంచి థియేట్రికల్ రన్ కారణంగా ఓటీటీని కొద్ది రోజులు వెనక్కి జరపాలనే చర్చ జరుగుతోందని కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఓటీటీ రిలీజ్ డేట్ ముందే ఫిక్స్ అయి ఉంటే, హిట్ వచ్చిన తర్వాత దాన్ని వెంటనే మార్చడం సాధ్యం కాకపోవచ్చు. ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రక్రమ అదే రోజు స్ట్రీమింగ్ మొదలైతే, రూ.200 కోట్లకు పైగా వసూలు చేసి నాలుగో వారంలోనూ ఆడుతున్న సినిమాకూ నాలుగు వారాల విండో మారలేదని తేలుతుంది. వాయిదా పడితే మాత్రం హిట్ సినిమాలకు ముందుగా ఫిక్స్ చేసిన ఓటీటీ తేదీలను కూడా మార్చుకునే అవకాశం ఉందనే కొత్త ఉదాహరణ ‘ఇరుముడి’ అవుతుంది.
