Begin typing your search above and press return to search.

ఇరుముడి.. ఈ సినిమాకు ప్లస్ అవుతుందా?

అందుకే ‘ఇరుముడి’కి వచ్చిన రెస్పాన్స్ ఈ చిన్న సినిమాకు కూడా కొంత ఉపయోగపడుతుందా అనే క్యూరియాసిటి మొదలైంది.

By:  M Prashanth   |   29 Aug 2026 11:20 AM IST
ఇరుముడి.. ఈ సినిమాకు ప్లస్ అవుతుందా?
X

‘ఇరుముడి’ థియేటర్లలో బాగా ఆడుతున్న టైమ్‌లోనే మరో డివైన్ థ్రిల్లర్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లపూడి తెరకెక్కించిన ‘మహేంద్రగిరి వారాహి’ సెప్టెంబర్ 11న వస్తోంది. రెండు సినిమాల కథలు ఒకటి కావు. కానీ దేవుడి అంశాన్ని థ్రిల్లర్ కథలో కలపడం మాత్రం రెండింటిలో ఉంది. అందుకే ‘ఇరుముడి’కి వచ్చిన రెస్పాన్స్ ఈ చిన్న సినిమాకు కూడా కొంత ఉపయోగపడుతుందా అనే క్యూరియాసిటి మొదలైంది.

‘ఇరుముడి’లో అయ్యప్ప దీక్షను ఫ్యామిలీ ఎమోషన్, క్రైమ్ థ్రిల్లర్‌తో కలిపారు. మొదటి వారం తర్వాత కూడా సినిమా నిలబడింది. ట్రేడ్ ట్రాకింగ్ లెక్కల ప్రకారం 8వ రోజుకే ఇండియా నెట్ వంద కోట్ల మార్క్ దాటింది. అంటే భక్తి టచ్ ఉన్న సినిమా అంటే పాత తరహా కథే కావాలనే లెక్క ఇప్పుడు లేదు. ఆ అంశం కమర్షియల్ కథలో సెట్ అయితే ప్రేక్షకులు తీసుకుంటున్నారని ఇరుముడి నిరూపించింది.

‘మహేంద్రగిరి వారాహి’ మాత్రం మిస్టరీ, అడ్వెంచర్ తరహాలో ఉన్నట్లు తెలుస్తోంది. ట్రైలర్‌లో వారాహి దేవి, మహేంద్రగిరి ప్రాంతం, పాత రహస్యాలు, వరుసగా జరిగే సంఘటనలు కనిపించాయి. సుమంత్ ఒక రహస్యాన్ని వెతికే పాత్రలో ఉన్నాడు. సుమంత్ కూడా ఈ కథతో చాలా కాలం పాటు ట్రావెల్ అయినట్లు ట్రైలర్ ఈవెంట్‌లో చెప్పాడు.

ఈ సినిమాకు ‘ఇరుముడి’ హిట్ సెంటిమెంట్ వలన కలెక్షన్స్ తీసుకొస్తుందని చెప్పలేం. కానీ ప్రేక్షకుడికి ఇలాంటివి కనెక్ట్ అయితే మౌత్ టాక్ ద్వారా హిట్టిస్తారని చెప్పవచ్చు. ముఖ్యంగా ట్రైలర్ చూసినప్పుడు ఇది భక్తి సినిమా అని పక్కన పెట్టకుండా, థ్రిల్లర్‌గా కూడా చూడొచ్చనే ఫీల్ రావడానికి రీసెంట్ సక్సెస్ లు ఉపయోగపడతాయి. ‘కార్తికేయ 2’ సమయంలో కూడా పురాణాల అంశాన్ని అడ్వెంచర్‌తో కలిపిన కథకు మంచి రీచ్ వచ్చింది.

ఇక్కడ సుమంత్, దర్శకుడు సంతోష్ జాగర్లపూడి కాంబినేషన్‌కు మరో పాత కనెక్షన్ ఉంది. వీరిద్దరూ 2018లో ‘సుబ్రహ్మణ్యపురం’ చేశారు. ఆ సినిమాలో కూడా ఆలయం, వరుస మరణాలు, దేవుడిని నమ్మని హీరో అనే సెటప్ ఉంది. ఇప్పుడు అదే కాంబో మరోసారి దైవం చుట్టూ మిస్టరీ కథతో వస్తోంది. అయితే ఈసారి వారాహి దేవి, రాజవంశ రహస్యం, అడ్వెంచర్‌ను పెద్ద స్థాయిలో చూపిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా, ఐశ్వర్య రాజేష్ కీలక పాత్రలో కనిపించనుంది.

ఇక ‘మహేంద్రగిరి వారాహి’కి ఇప్పుడు అసలు అవసరం ట్రైలర్‌లో చూపించిన మిస్టరీ థియేటర్‌లో కూడా పట్టుకోవడమే. ‘ఇరుముడి’ వల్ల డివైన్ థ్రిల్లర్ అనే జోన్‌కు ప్రస్తుతం ఒక మంచి టైమింగ్ దొరికింది. పైగా రెండు సినిమాల మధ్య మూడు వారాల గ్యాప్ కూడా లేదు. అదే ప్రేక్షకుల్లో కొంతమందిని ఈ సినిమా వైపు తిప్పగలిగితే, సుమంత్‌కు చాలా రోజుల తర్వాత థియేటర్ దగ్గర మంచి ఓపెనింగ్ దొరికే ఛాన్స్ ఉంటుంది.