Begin typing your search above and press return to search.

36 గంటల్లోనే హిట్ ట్రాక్‌లోకి ‘ఇరుముడి’

రవితేజకు ఒక సినిమా హిట్ కావడం కంటే ఈసారి అది ఎంత త్వరగా సేఫ్ జోన్‌లోకి వెళ్తుందనేది కూడా ముఖ్యమే.

By:  M Prashanth   |   22 Aug 2026 8:41 PM IST
36 గంటల్లోనే హిట్ ట్రాక్‌లోకి ‘ఇరుముడి’
X

రవితేజకు ఒక సినిమా హిట్ కావడం కంటే ఈసారి అది ఎంత త్వరగా సేఫ్ జోన్‌లోకి వెళ్తుందనేది కూడా ముఖ్యమే. ఎందుకంటే ‘ధమాకా’ తర్వాత ఆయన సోలో సినిమాల్లో వరుసగా ఆశించిన ఫలితాలు రాలేదు. ‘టైగర్ నాగేశ్వరరావు’, ‘ఈగల్’, ‘మిస్టర్ బచ్చన్’, ‘మాస్ జాతర’ ఇలా సినిమాలు మారినా బాక్సాఫీస్ దగ్గర ఎదురుచూపు మాత్రం కొనసాగింది. అలాంటి టైమ్‌లో ‘ఇరుముడి’ మొదటి రోజు నుంచే లెక్క మార్చేసింది.

మేకర్స్ చెబుతున్న లెక్క ప్రకారం ‘ఇరుముడి’ ఒకటిన్నర రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. అంటే మొదటి వీకెండ్ కూడా పూర్తికాకముందే సినిమా పెట్టుబడి రికవరీకి సంబంధించిన కీలక మార్క్‌ను దాటిందని టీమ్ చెబుతోంది. మొదటి రోజే సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.24.20 కోట్ల గ్రాస్ సాధించినట్లు బాక్సాఫీస్ రిపోర్ట్స్ వచ్చాయి. ఇందులో ఇండియా గ్రాస్ రూ.17.20 కోట్లు కాగా, ఓవర్సీస్ నుంచి రూ.7 కోట్లు వచ్చినట్లు ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి.

రవితేజ కెరీర్‌లో సోలో హీరోగా ఇదే బెస్ట్ ఓపెనింగ్ కావడం మరో ప్లస్. గతంలో ‘క్రాక్’, ‘ధమాకా’ మొదటి రోజు దాదాపు రూ.10 కోట్ల రేంజ్‌లో ఓపెన్ కాగా, ‘ఇరుముడి’ వాటిని దాటేసింది. రిలీజ్‌కు ముందు పాటలు, ట్రైలర్‌తో వచ్చిన బజ్ ఓపెనింగ్స్ వరకు తీసుకొచ్చింది. అక్కడి నుంచి సినిమాకు వచ్చిన మంచి టాక్ రెండో రోజు కూడా ఉపయోగపడుతోంది.

ఇక్కడ రవితేజ చేసిన మార్పు కూడా మాట్లాడుకోవాలి. ఆయన నుంచి సాధారణంగా ఆశించే కామెడీ, వరుస ఫైట్లు, కమర్షియల్ సీన్స్ మీద ఈసారి శివ నిర్వాణ ఎక్కువగా ఆధారపడలేదు. తండ్రి కూతురు ఎమోషన్‌ను ముందు పెట్టి కథను నడిపించారు. రవితేజ నటనతో పాటు క్లైమాక్స్, ఎమోషనల్ సీన్స్‌కు మొదటి రోజు నుంచే మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే రవితేజ తన రెగ్యులర్ జోన్‌లోకి వెళ్లడం వల్లే ఈ ఫలితం వచ్చిందని చెప్పడం కూడా కరెక్ట్ కాదు.

ముఖ్యంగా ఈ హిట్ రవితేజకు సరైన సమయంలో వచ్చింది. ఒకప్పుడు ఆయన సినిమాలకు మినిమమ్ గ్యారెంటీ మార్కెట్ ఉండేది. వరుస ఫలితాలతో ఆ లెక్క కొంత దెబ్బతింది. ఇప్పుడు ‘ఇరుముడి’ మొదటి రోజే కెరీర్ బెస్ట్ సోలో ఓపెనింగ్ తీసుకురావడం, ఆ వెంటనే బ్రేక్ ఈవెన్ ప్రకటన రావడం తర్వాతి సినిమాలకు కూడా ఉపయోగపడే విషయమే. ఇంకా శని, ఆదివారాలు పూర్తిగా మిగిలే ఉన్నాయి. కాబట్టి లెక్క ఇంకా ఏ స్థాయిలో వెళుతుందో చూడాలి.