ఇరుముడి లెక్క.. 3 రోజుల్లోనే రవితేజ కెరీర్ బెస్ట్ రికార్డ్
రవితేజకు ‘ఇరుముడి’ చాలా రోజుల తర్వాత బాక్సాఫీస్ దగ్గర పూర్తి స్థాయి రిలీఫ్ ఇచ్చిన సినిమా అని చెప్పవచ్చు.
By: M Prashanth | 24 Aug 2026 11:23 AM ISTరవితేజకు ‘ఇరుముడి’ చాలా రోజుల తర్వాత బాక్సాఫీస్ దగ్గర పూర్తి స్థాయి రిలీఫ్ ఇచ్చిన సినిమా అని చెప్పవచ్చు. మొదటి రోజు నుంచే వచ్చిన మంచి టాక్ వీకెండ్ మొత్తం అలాగే కొనసాగింది. మల్టీప్లెక్స్‌ల నుంచి బి, సి సెంటర్ల వరకు షోలు బాగా నడవడంతో కొన్ని చోట్ల అదనపు థియేటర్లు, షోలు కూడా పెంచాల్సి వచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు రవితేజ రెగ్యులర్ మాస్ ప్రేక్షకులు కూడా సినిమాకు వస్తుండటం కలిసొచ్చింది.
వీకెండ్ పూర్తయ్యాక కూడా టికెట్ సేల్స్ తగ్గకుండా ఉండటం ఇంకో ప్లస్. సోమవారం గంటకు 15 వేలకుపైగా టికెట్లు అమ్ముడైనట్లు బుక్‌మైషో లెక్కలు చూపించాయి. ఇక ముందున్న వర్కింగ్ డేస్‌లో ఈ హోల్డ్ ఎంత వరకు కొనసాగుతుందో చూడాలి. అయితే మొదటి మూడు రోజులకే వచ్చిన నంబర్లు మాత్రం ‘ఇరుముడి’ని రవితేజ కెరీర్‌లో పెద్ద హిట్ల లిస్టులోకి తీసుకెళ్లేశాయి.
3 రోజుల్లోనే సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.80 కోట్లకు పైగా గ్రాస్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. రవితేజ కెరీర్‌లో తొలి వీకెండ్ పరంగా ఇది బెస్ట్ నెంబర్. గత సినిమాలతో పోలిస్తే ఓపెనింగ్ మాత్రమే కాదు, రెండో రోజు నుంచి కూడా డ్రాప్ లేకుండా వెళ్లడం ఈ రన్‌కు పెద్ద ప్లస్ అయ్యింది. ఓవర్సీస్‌లో కూడా ‘ఇరుముడి’ రవితేజకు కొత్త మార్క్ ఇచ్చింది. నార్త్ అమెరికాలో మిలియన్ డాలర్ గ్రాస్ దాటిన తొలి రవితేజ సినిమాగా నిలిచింది.
ఆయన సినిమాలకు అక్కడ ఇప్పటివరకు ఒక లిమిట్ ఉండేది. ఈసారి మాత్రం ఫ్యామిలీ ఎమోషన్, క్రైమ్ డ్రామా టచ్ రెండూ అక్కడి ప్రేక్షకులకు కూడా బాగా కనెక్ట్ అయ్యాయి. ఇక బిజినెస్ పరంగా కూడా సినిమా చాలా త్వరగా సేఫ్ అయిపోయింది. రిలీజ్ అయిన రెండో రోజుకే బ్రేక్ ఈవెన్ మార్క్ దాటినట్లు టీమ్ చెబుతోంది. దీంతో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు వీకెండ్ పూర్తయ్యేలోపే ప్రాఫిట్ జోన్ మొదలైంది.
రవితేజ గత కొంతకాలంగా వరుసగా సినిమాలు చేస్తున్నా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన రిజల్ట్ మాత్రం దొరకలేదు. కొన్ని సినిమాలకు ఓపెనింగ్స్ వచ్చినా ఆ తర్వాత నిలబడలేకపోయాయి. అలాంటి టైమ్‌లో ‘ఇరుముడి’కి మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ రావడం ఆయనకు బాగా కలిసొచ్చింది. పైగా ఈసారి అభిమానుల వరకే సినిమా ఆగలేదు. రెగ్యులర్ మూవీ ఆడియన్స్ కూడా రావడంతో రవితేజ కెరీర్‌లో చాలా రోజుల తర్వాత అన్ని సెంటర్లలో ఒకేసారి మంచి రన్ కనిపిస్తోంది.
సినిమా పని చేయడానికి ఒక్క మాస్ ఎలిమెంట్ మాత్రమే కారణం కాలేదు. అయ్యప్ప దీక్ష నేపథ్యం, కుటుంబ భావోద్వేగాలు, మధ్యలో వచ్చే క్రైమ్ ట్రాక్ కలిసి కథను వేరేలా నడిపించాయి. శివ నిర్వాణ కూడా రవితేజను రెగ్యులర్ ఎనర్జీతోనే కాకుండా ఎమోషనల్ సీన్స్‌లో ఎక్కువగా ఉపయోగించారు. అదే ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా థియేటర్లకు తీసుకొస్తోంది.
