Begin typing your search above and press return to search.

కాళకేయుల్లాంటి అమెరికాపై పోరుకు ఇరాన్ బాహుబలి అవతారం

2015లో రిలీజ్ అయిన `బాహుబలి: ది బిగినింగ్` చిత్రంలో కాళకేయుల సైన్యంతో అమరేంద్ర బాహుబలి (ప్రభాస్) పోరాడే ఘట్టం ఎంతటి ప్రజాదరణ పొందిందో తెలిసిందే.

By:  Srikanth Kontham   |   28 Sept 2026 5:13 PM IST
కాళకేయుల్లాంటి అమెరికాపై పోరుకు ఇరాన్ బాహుబలి అవతారం
X

హైదరాబాద్‌లోని ఇరాన్ కాన్సులేట్ సోషల్ మీడియా వేదికగా చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా.. ముఖ్యంగా టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ (UNGA)లో ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ చేసిన ప్రసంగాన్ని ప్రతిబింబించేలా ఇరాన్ దౌత్య కార్యాలయం రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన విజువల్ వండర్ `బాహుబలి` చిత్రంలోని శక్తివంతమైన యుద్ధ సన్నివేశాన్ని `ఎక్స్` వేదికగా పంచుకుంది. ఈ పరిణామం సినీ, రాజకీయ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది.

2015లో రిలీజ్ అయిన `బాహుబలి: ది బిగినింగ్` చిత్రంలో కాళకేయుల సైన్యంతో అమరేంద్ర బాహుబలి (ప్రభాస్) పోరాడే ఘట్టం ఎంతటి ప్రజాదరణ పొందిందో తెలిసిందే. అత్యంత ప్రమాదకరమైన శత్రు సైన్యాన్ని చూసి భయపడకుండా, ధైర్యంతో ఎదురొడ్డి నిలిచే ఆ దృశ్యాన్ని ఇరాన్ దౌత్య కార్యాలయం తమ దౌత్య సందేశానికి ఎంచుకుంది. `మేము ఎన్నటికీ తలవంచము. మోకాళ్లపై నిలబడము` అంటూ అధ్యక్షుడు పెజెష్కియాన్ చేసిన వ్యాఖ్యలకు యుద్ధ సన్నివేశాన్ని ముడిపెడుతూ ఎడిట్ వీడియోను పోస్ట్ చేసింది.

న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి 81వ సర్వప్రతినిధి సభలో ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ప్రసంగిస్తూ.. అమెరికా , పాశ్చాత్య దేశాల నుంచి వస్తున్న ఆంక్షలు, బెదిరింపులకు ఇరాన్ ఎప్పటికీ లొంగదని స్పష్టం చేశారు. బాహ్య ఒత్తిళ్లు తమ దేశ ప్రజల మనోధైర్యాన్ని , పట్టుదలను మరింత పెంచుతాయే తప్ప, తమను బలవంతంగా లొంగదీసుకోలేవని తేల్చి చెప్పారు. ఈ వ్యాఖ్యల నేపథ్యాన్ని సులభంగా, ప్రభావవంతంగా వివరించేందుకు ఇరాన్ దౌత్య వర్గాలు `బాహుబలి`లోని పోరాట ఘట్టాన్ని ఎంచుకోవడం విశేషం.

అంతర్జాతీయ దౌత్యం, భౌగోళిక రాజకీయాల్లో టాలీవుడ్ సినిమా రెఫరెన్స్‌ను ఉపయోగించడంపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇరాన్ కాన్సులేట్ చేసిన `బాహుబలి ఎడిట్` వీడియో సామాజిక మాధ్యమాల్లో క్షణాల్లో వైరల్‌గా మారింది. అంతర్జాతీయ సంబంధాల ప్రకటనలకు భారతీయ సినిమాలను వాడటం చాలా వినూత్నంగా ఉందంటూ నెటిజన్లు వ్యాఖ్యానించగా.. మరికొందరు ఇరాన్ దౌత్య కార్యాలయం సోషల్ మీడియా టీమ్ క్రియేటివిటీ వేరే లెవెల్ అని కామెంట్లు చేశారు.

ఇటీవలి కాలంలో అమెరికా-ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి వేదికగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా పెజెష్కియాన్ ఈ ప్రసంగం చేశారు. సాధారణంగా దౌత్య సంబంధాల ప్రకటనలు తీవ్రమైన పదజాలం .. అధికారిక ప్రకటనలకే పరిమితమవుతాయి. అయితే పాప్ కల్చర్, ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన `బాహుబలి` లాంటి భారతీయ దృశ్యకావ్యాన్ని తమ వైఖరిని చాటిచెప్పడానికి ఉపయోగించడం ద్వారా ఇరాన్ కాన్సులేట్ అందరి దృష్టినీ ఆకర్షించింది.

`బాహుబలి` రెండు భాగాలు భారతీయ సినీ చరిత్రలో సరికొత్త రికార్డులను సృష్టించిన విషయం తెలిసిందే. భారతీయ సరిహద్దులు దాటి అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న చిత్రం ఇప్పుడు గ్లోబల్ డిప్లమసీలోనూ చర్చనీయాంశంగా మారడం విశేషం. రాజమౌళి సృష్టించిన అమరేంద్ర బాహుబలి పాత్ర ధైర్యం, తెగువ ప్రపంచ దేశాల దౌత్యానికి కూడా ఉదాహరణగా నిలవడం టాలీవుడ్ క్రేజ్ మరోసారి అంతర్జాతీయ వేదికపై చాటి చెబుతోంది.