నెగెటివిటీపై తీవ్రంగా కలత చెందిన డిజిటల్ ప్రిన్సెస్
డేటా -డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్లు వెండితెరపై అడుగుపెట్టడం ఒక కొత్త ట్రెండ్‌గా మారింది.
By: Sivaji Kontham | 5 Aug 2026 9:00 PM ISTడేటా -డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్లు వెండితెరపై అడుగుపెట్టడం ఒక కొత్త ట్రెండ్‌గా మారింది. లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్న డిజిటల్ తారలు సినిమాలో నటించడం వల్ల ప్రాజెక్ట్‌లకు తక్షణ ప్రచారం దక్కుతుందనేది నిజమే అయినా... ఆ ఫాలోయింగ్ థియేటర్లలో టికెట్లు తెగే మంత్రంగా మారుతుందా? లేదా? అనే అంశంపై తీవ్రమైన విశ్లేషణ మొదలైంది. సోషల్ మీడియాలో వచ్చే విమర్శలు, ట్రోలింగ్‌ను తట్టుకుంటూ ముందుకు సాగడం ఒక ఎత్తైతే, నటన ద్వారా ప్రేక్షకులను మెప్పించడం మరొక ప్రధాన సవాలుగా నిలుస్తోంది.
ఇటీవల నటుడు రాఘవ్ జుయల్, ప్రముఖ కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎమ్ సోషల్ మీడియాలో వచ్చే ప్రతికూలతలపై స్పందిస్తూ ``కుచ్ తో లోగ్ కహేంగే, లోగో కా కామ్ హై కెహ్నా`` అంటూ స్పష్టం చేశారు. నెగెటివిటీని పట్టించుకోకుండా తమ పనిపై మాత్రమే దృష్టి పెడతామని చెప్పిన విధానం ప్రతికూలతలను ఎదుర్కొనే నైజానికి అద్దం పడుతోంది. అయితే సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉన్నా అది బాక్సాఫీస్ విజయానికి గ్యారెంటీ కాదని ఇటీవలి పరిణామాలు రుజువు చేస్తున్నాయి.
ఇన్‌స్టాలో 34లక్షల మంది పైగా ఫాలోవర్లు ఉన్న నిహారిక ఎన్ఎమ్ కథానాయికగా నటించిన `భాయ్ తేరా స్టార్ హై` చిత్రం మొదటి రోజు పాతిక లక్షల స్వల్ప వసూళ్లను మాత్రమే సాధించింది. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో ఫ్రీగా చూసే కంటెంట్‌కి ఉత్సాహం చూపే నెటిజన్లు, థియేటర్‌కి వచ్చి టికెట్ కొని సినిమా చూడటానికి కేవలం ఫాలోయింగ్ ఒక్కటే సరిపోదని ఈ ఫలితం స్పష్టం చేసింది. డిజిటల్ పాపులారిటీ వల్ల సినిమాకి ఆరంభంలో కొంత పబ్లిసిటీ లభించినా థియేటర్ రన్ అనేది పూర్తిగా నటన, కథాబలంతో పాటు ఇంకా చాలా చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది.
అదే సమయంలో డిజిటల్ మీడియా నుండి వచ్చి నటన ద్వారా నిరూపించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. క్రియేటర్ ధర్నా దుర్గా ఓటీటీ చిత్రం `మా బహెన్`లో కనబరిచిన నటనకు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. సోషల్ మీడియా ఇమేజ్‌ను పక్కన పెట్టి.. పాత్రకు తగ్గట్టుగా ప్రాణం పోస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ఆమె నిరూపించారు. అలాగే 20 మిలియన్ల కంటే ఎక్కువ ఫాలోవర్లు ఉన్న భువన్ బామ్ `కుకూ కీ కుండలి` చిత్రంతో వెండితెరకు పరిచయం అవుతుండగా... ఎల్విష్ యాదవ్ కూడా టైగర్ ష్రాఫ్‌తో కలిసి నటించేందుకు సిద్ధమవుతున్నారు.
ముగింపుగా... సోషల్ మీడియా నెట్‌వర్కింగ్ క్రియేటర్లకు సినీ పరిశ్రమ తలుపులు సులువుగా తెరుచుకునేలా తోడ్పడవచ్చు కానీ... పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి మాత్రం నిజమైన ప్రతిభ, స్క్రీన్ ప్రెజెన్స్.. నటన మాత్రమే ప్రామాణికం. ట్రోలింగ్‌ను దాటుకుని రావడం ఎంత ముఖ్యమో.. కంటెంట్ క్రియేటర్ అనే ముద్ర నుంచి బయటపడి నిజమైన నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడం అంతకంటే ప్రధానం. నటనలోని నాణ్యత, బలమైన కథనం ఉన్నప్పుడే డిజిటల్ స్టార్ల సినీ ప్రయాణం సుదీర్ఘంగా సాగుతుంది.
