జెన్యూన్ సెలబ్రిటీల ఇమేజ్ కింగే ఛాన్సే లేదు!
సామాజిక మాధ్యమ ప్రపంచంలో ఫాలోవర్ల నెంబర్ అనేది అంకె మాత్రమే కాదు. అదొక సెలబ్రిటీ బ్రాండ్ వ్యాల్యూ, మార్కెట్ లో క్రేజ్‌ను నిర్ణయించే శక్తివంతమైన సాధనం కూడా.
By: Srikanth Kontham | 8 May 2026 4:00 PM ISTసామాజిక మాధ్యమ ప్రపంచంలో ఫాలోవర్ల నెంబర్ అనేది అంకె మాత్రమే కాదు. అదొక సెలబ్రిటీ బ్రాండ్ వ్యాల్యూ, మార్కెట్ లో క్రేజ్‌ను నిర్ణయించే శక్తివంతమైన సాధనం కూడా. అందుకే ఇన్‌స్టాగ్రామ్ చేపట్టిన భారీ ప్రక్షాళన గ్లోబల్ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. బాట్లు , ఇన్‌యాక్టివ్ అకౌంట్లు , స్పామ్ ఖాతాలను తొలగించడం వల్ల ఫాలోవర్ల సంఖ్య తగ్గడం సహజమే. అయితే రాత్రికి రాత్రే మిలియన్ల కొద్దీ అకౌంట్లు మాయమవ్వడం సెలబ్రిటీల డిజిటల్ టీమ్స్‌ను కలవరపెడుతోంది. ఈ క్లీనింగ్ వల్ల ఫాలోవర్ల సంఖ్య భారీగా తగ్గుతుంది. అలాగే సెలబ్రిటీల ఎంగేజ్‌మెంట్ రేటు పై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది.
సాధారణంగా బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ఒప్పందాలు ఫాలోవర్ల సంఖ్య ఆధారంగానే జరుగుతుంటాయి. అయితే ఫాలోవర్లలో ఎక్కువ శాతం ఫేక్ అకౌంట్లు ఉన్నాయని తేలితే? సదరు సెలబ్రిటీల విశ్వసనీయత దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే ఇన్‌స్టాగ్రామ్ తీసుకున్న కఠిన చర్య నిజమైన అభిమానులకు -బాట్ అకౌంట్లకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టం చేస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమలో రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి అగ్ర హీరోలకు సైతం ఈ ఫాలోవర్ల కోత తప్పలేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 23 ఏళ్ల సక్సెస్ పుల్ కెరీర్ ని సెలబ్రేట్ చేసుకుంటోన్న నేపథ్యంలో తగ్గుదల కనిపించడం శోచనీయం.
అలాగే రామ్ చరణ్ గ్లోబల్ ఇమేజ్ పెరుగుతోన్న సమయంలో ఇన్‌స్టాగ్రామ్ చేసిన క్లీనింగ్ ప్రాసెస్ తో ఆయన పేరు మీద ఉన్న కొన్ని వేల అకౌంట్లు తొలగించబడ్డాయి. అయితే ఈ తగ్గుదల కేవలం సంఖ్యాప రమైన దేనని వారికున్న అసలైన క్రేజ్‌కు దీనితో సంబంధం లేదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిజమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌కు బాట్ అకౌంట్లు అదనపు హంగులు మాత్రమే తప్ప అవే బలం కావు. శ్రద్ధా కపూర్ అత్యధికంగా ఫాలోవర్లను కోల్పోవడం వెనుక ఉన్న కారణాలను విశ్లేషిస్తే? పాపులారిటీ ఎక్కువగా ఉన్న ఖాతాలనే బాట్లు ఎక్కువగా టార్గెట్ చేస్తాయని అర్థమవుతోంది.
సమంత, రష్మిక మందన్న సహా చాలా మంది సెలబ్రిటీలు లక్షల్లో ఫాలోవర్లను కోల్పోవడం వారి సోషల్ మీడియా వ్యూహాల్లో మార్పులకు దారి తీయోచ్చు. ఫాలోవర్ల సంఖ్యను పెంచుకోవడం కంటే ఉన్న ఫాలోవర్లతో ఎంత నాణ్యమైన సంబంధాన్ని కొనసాగిస్తున్నారనేదే ఇప్పుడు అత్యంత కీలకం. భవిష్యత్తులో ఇన్‌స్టాగ్రామ్ మరిన్ని కఠినమైన అల్గారిథమ్ మార్పులను తీసుకొచ్చే అవకాశం లేకపోలేదు. ఇన్‌స్టాగ్రామ్ చేపట్టిన ప్రక్షాళన డిజిటల్ ప్రపంచంలో అవసరమైన మార్పు. సెలబ్రిటీలు మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను కోల్పోయినా? మిగిలి ఉన్నవారంతా నిజమైన వ్యక్తులే కావడం సానుకూల అంశం. నెంబర్ల గారడీ కంటే? నిజమైన ప్రజాదరణకే విలువ ఉంటుందని ఈ పరిణామం మరోసారి నిరూపిస్తోంది. సాంకేతికత మారుతోన్న కొద్ది ఇలాంటి క్లీనింగ్ సహజమే. వీటిని స్వీకరించి ముందుకు సాగడమే ఏకైక మార్గమని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.
