Begin typing your search above and press return to search.

ది కేర‌ళ స్టోరి 2: 8 కోట్ల హిందూ అమ్మాయిల‌ను ఏమార్చ‌డ‌మే మిష‌న్

కానీ భార‌త‌దేశాన్ని అస్థిర‌ప‌ర‌చ‌డానికి పాకిస్తాన్ ఎన్నుకునే కుట్ర‌ల కోణాల‌ను ఇంకా పూర్తిగా వంద‌శాతం సినిమాలుగా తెర‌కెక్కించ‌లేద‌ని ప్ర‌జ‌లు భావిస్తున్నారు.

By:  Sivaji Kontham   |   31 Jan 2026 9:49 AM IST
ది కేర‌ళ స్టోరి 2: 8 కోట్ల హిందూ అమ్మాయిల‌ను ఏమార్చ‌డ‌మే మిష‌న్
X

దాయాది పాకిస్తాన్ ఉగ్ర కుట్ర‌ల‌పై చాలా సినిమాలొచ్చాయి. కానీ భార‌త‌దేశాన్ని అస్థిర‌ప‌ర‌చ‌డానికి పాకిస్తాన్ ఎన్నుకునే కుట్ర‌ల కోణాల‌ను ఇంకా పూర్తిగా వంద‌శాతం సినిమాలుగా తెర‌కెక్కించ‌లేద‌ని ప్ర‌జ‌లు భావిస్తున్నారు. భార‌త‌దేశం నుంచి ప్ర‌తియేటా వేలాది మంది అమ్మాయిల మిస్సింగ్ కేసుల వెన‌క కుట్ర కోణాల గురించి చాలా క‌థ‌లు వినిపిస్తూనే ఉన్నాయి. అలాంటి వాటిలో కేర‌ళ నుంచి వంద‌లాదిగా మిస్స‌యిన మ‌గువ‌ల గురించి `ది కేర‌ళ స్టోరి 1` సినిమాలో చూపించే ప్ర‌య‌త్నం చేసారు. ప్రేమ పేరుతో ముస‌ల్మాన్ ఉగ్ర‌వాదులు హిందూ అమ్మాయిల‌తో మ‌త‌మార్పిడుల‌కు పాల్ప‌డ‌టం, వారిని దేశం దాటించ‌డం వంటి ఘోర కృత్యాల‌కు పాల్ప‌డ్డార‌ని కేర‌ళ స్టోరి సినిమాలో చూపించారు.

ఇప్పుడు మేక‌ర్స్ `బియాండ్ ది కేరళ స్టోరీ` అనే ట్యాగ్ లైన్ తో `ది కేరళ స్టోరీ 2` సినిమాని రూపొందించి విడుద‌ల‌కు సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమా క‌థాంశాన్ని అనేక‌ వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించినట్లు చిత్రబృందం పేర్కొంది. ఇది మొద‌టి భాగానికి కొన‌సాగింపు. ఇప్పుడు కాన్వాసు మ‌రింత పెద్ద‌ది. దేశ‌వ్యాప్తంగా మ‌త‌మార్పిడుల వెన‌క ఉన్న కుట్ర కోణాన్ని తెర‌పైకి తెస్తున్న‌ట్టు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు వెల్ల‌డించారు. కేవలం కేరళకే పరిమితం కాకుండా, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన మత మార్పిడి ఉదంతాలను ఈ రెండో భాగంలో చూపించ‌నున్నారు.

టీజర్‌లో ముగ్గురు మహిళలు వారికి ఎదురైన వెతనల‌ను, కుట్ర కోణాన్ని వివ‌రిస్తున్నారు. ఈ పాత్రలు కూడా నిజ జీవిత కథల ఆధారంగా తీర్చిదిద్దినవేనని మేకర్స్ తెలిపారు. కేరళకు చెందిన ఐఏఎస్ ఆస్పిరెంట్..సురేఖ నాయర్, మధ్యప్రదేశ్‌కు చెందిన జావెలిన్ త్రో ప్లేయర్ నేహా సంత్, రాజస్థాన్‌కు చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ దివ్య పలివాల్ .. ఈ ముగ్గురూ త‌మ గోడు వెల్ల‌బోసుకున్నారు. ఈ ముగ్గురు మహిళలు తమ కలలను కోల్పోయి, మత మార్పిడి ట్రాప్‌లో ఎలా చిక్కుకున్నారు? దానిని ఎలా ఎదిరించారు అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం. దాదాపు 8 కోట్ల మంది భార‌తీయ అమ్మాయిల‌ను ఏమార్చి వారితో మ‌త‌మార్పిడులు చేయించాల‌నే కుట్ర కోణం వెన‌క ఏం జ‌రుగుతోందో తెర‌పై వివ‌రించ‌బోతున్నారు. భార‌త‌దేశంలో ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌ను నాశ‌నం చేయాల‌నే కుట్ర‌కోణం దాగి ఉన్న‌ట్టు కూడా టీజ‌ర్ లో సంభాష‌ణ‌లు చెబుతున్నాయి. అయితే అన్ని కుట్ర‌ల‌ను ఎదురిస్తామ‌నే ధైర్యం ధీమాను క‌న‌బ‌రిచే సంభాష‌ణ ఉద్రేకం క‌లిగిస్తోంది.

ఇదిలా ఉంటే `ది కేర‌ళ స్టోరి` చిత్రం 2023లో విడుద‌లైన‌ప్పుడు చాలా వివాదాలు చెల‌రేగాయి. ఈ సినిమాలో వాస్త‌విక‌త కంటే ఎగ్జాగ‌రేష‌న్ ఎక్కువ‌గా ఉంద‌ని విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. కోర్టులో చివ‌రికి వివాదం ప‌రిష్కృత‌మైంది. దాదాపు 32వేల మంది మ‌హిళ‌లు మిస్స‌య్యార‌ని ది కేర‌ళ స్టోరి సినిమాలో చూపించిన‌ట్టు మేక‌ర్స్ ప్ర‌చారం చేసారు. చివ‌రికి అన్ని వేల మంది ఎలా మిస్స‌య్యారు? అనేదానికి ఆధారాలను కోర్టుకు చూపించ‌లేక‌పోవ‌డంతో , ఇది కేవ‌లం ముగ్గురు మ‌హిళ‌ల క‌థ అంటూ డిస్ క్లైమర్ ఇచ్చారు.

ఈ రెండో భాగం కూడా `ఇన్‌స్పైర్డ్ బై ట్రూ ఈవెంట్స్` అని చెబుతున్నా కానీ, ఇందులో చూపించే అంశాలు ఎంతవరకు వాస్తవమో... ఎంతవరకు కల్పితమో అనేది సినిమా విడుదలయ్యాక మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్ర‌స్తుతానికి విమర్శకులు మాత్రం దీనిని ఒక వైపు ఉండే ప్రొప‌గండా కథగా అభివర్ణిస్తున్నారు.

`ది కేర‌ళ స్టోరి` మొదటి భాగానికి సుదీప్తో సేన్ దర్శకత్వం వహించగా, ఈ రెండో భాగానికి కామాఖ్య‌ నారాయ‌ణ సింగ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. విపుల్ షా పర్యవేక్షణలో ఒక టీమ్ స్క్రిప్టును హ్యాండిల్ చేసింద‌ని స‌మాచారం. ది కేర‌ళ స్టోరి 1 నిర్మాత విపుల్ అమృత్ లాల్ షా క్రియేటివ్ హెడ్ గా ఉన్నారు. 27 ఫిబ్ర‌వ‌రి 2026న ఈ సినిమా విడుద‌ల కానుంది. అదితి భాటియా, ఉల్కా గుప్తా, రిత్విక పలై ఈ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు.