ఝడిపించడం.. గగుర్పాటుకు గురి చేయడం.. రికార్డులే రికార్డులు!
హారర్ సినిమాల ప్రేమికులకు దడ పుట్టించే హాలీవుడ్ సిరీస్ ఇన్సిడియస్ పరిచయం అవసరం లేదు.
By: Sivaji Kontham | 20 Aug 2026 8:00 PM ISTహారర్ సినిమాల ప్రేమికులకు దడ పుట్టించే హాలీవుడ్ సిరీస్ ఇన్సిడియస్ పరిచయం అవసరం లేదు. థియేటర్లలో ఆడియెన్ ని భయాందోళనలకు గురిచేసే ఈ ఫ్రాంచైజీ నుండి విడుదల కానున్న నూతన చిత్రం `ఇన్సిడియస్: అవుట్ ఆఫ్ ది ఫర్దర్`. ఈ సినిమా థియేట్రికల్ విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలను నెలకొల్పుతోంది. ముందస్తు అంచనాల ప్రకారం.. ఈ చిత్రం హారర్ ఫ్రాంచైజీ చరిత్రలోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించి సరికొత్త రికార్డులను సృష్టించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
గ్లోబల్ బాక్సాఫీస్ ప్రాథమిక అంచనాల ప్రకారం.. ఈ చిత్రం అమెరికా డొమెస్టిక్ మార్కెట్‌లో మొదటి వీకెండ్‌లోనే 26 మిలియన్ డాలర్ల నుండి 34 మిలియన్ డాలర్ల వరకు వసూలు చేసే అవకాశం ఉంది. 2023లో విడుదలైన `ఇన్సిడియస్: ది రెడ్ డోర్` చిత్రం తొలి వారంలో 33 మిలియన్ డాలర్లు వసూలు చేయగా.. ప్రస్తుత మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ దానితో సమానంగా కొనసాగుతున్నాయి. ఒకవేళ అంచనాలు గరిష్ఠ స్థాయిని తాకితే.. ఇది ఫ్రాంచైజీ చరిత్రలోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలవడమే కాకుండా.. ఆగస్టు 2026 నాటి అతిపెద్ద రిలీజ్‌గా రికార్డు సృష్టిస్తుంది.
ఈ హారర్ చిత్రం ప్రేక్షకులను అత్యంత అజ్ఞాతమైన- ఆధ్యాత్మిక ప్రపంచమైన `ది ఫర్దర్`లోకి మరింత డీప్‌గా తీసుకువెళుతుంది. ముగ్గురు అపరిచిత వ్యక్తులు ఒక ప్రశాంతమైన సబర్బన్ పరిసరాలపై దాడి చేసి ఒక కొత్త కుటుంబాన్ని బలవంతంగా ఆస్ట్రల్ ప్లేన్ (సూక్ష్మ శరీరం ద్వారా ప్రయాణించే లోకం) లోకి నెట్టివేస్తారు. అక్కడ ఆ కుటుంబానికి ఒక భయానక నిజం తెలుస్తుంది. అదేమిటంటే `ది ఫర్దర్` లోకం క్రమంగా నిజ ప్రపంచంలోకి చొచ్చుకురావడం ప్రారంభిస్తుంది.
ఈ కథ జెమ్మ అనే ఒక యంగ్ మదర్ చుట్టూ తిరుగుతుంది. ఆమె అనుకోకుండా తాను `ది ఫర్దర్` లోకంలోకి ప్రయాణించగల శక్తి (ఆస్ట్రల్ ప్రొజెక్షన్)ని కలిగి ఉన్నానని గుర్తిస్తుంది. అయితే ఆమె శక్తితో పాటు ఒక ప్రమాదకరమైన పర్యవసానం కూడా ముడిపడి ఉంటుంది. జెమ్మా ఆ భయానక సూక్ష్మ లోకం నుండి దుష్టశక్తులను, ఆత్మలను పొరపాటున నిజ ప్రపంచంలోకి తీసుకురాగలదని గ్రహించడంతో కథ అత్యంత భయానక మలుపులు తిరుగుతుంది.
జాకబ్ చేజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఆయనతో పాటు డేవిడ్ లెస్లీ జాన్సన్-మెక్‌గోల్డ్రిక్ స్క్రీన్‌ప్లే అందించారు. ఈ చిత్రంలో లిన్ షే, బ్రాండన్ పెరియా, ఐలాండ్ ఆస్టిన్, లారా గోర్డాన్, అమేలియా ఈవ్, సామ్ స్ప్రూయెల్ మేసీ రిచర్డ్‌సన్-సెలర్స్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ గగుర్పాటుకు గురి చేసే హారర్ చిత్రం 21 ఆగస్టు 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
