Begin typing your search above and press return to search.

ఓటీటీ రంగాన్ని ఏలుతున్న కామెడీ, రియాలిటీ షోలు

డిజిటల్ వినోద ప్రపంచంలో ప్రేక్షకుల అభిరుచులు వేగంగా మారుతున్నాయి. భార‌త‌దేశంలో ఇది ఇంకా వేగంగా ఉంది.

By:  Sivaji Kontham   |   7 Aug 2026 4:00 AM IST
ఓటీటీ రంగాన్ని ఏలుతున్న కామెడీ, రియాలిటీ షోలు
X

డిజిటల్ వినోద ప్రపంచంలో ప్రేక్షకుల అభిరుచులు వేగంగా మారుతున్నాయి. భార‌త‌దేశంలో ఇది ఇంకా వేగంగా ఉంది. జూలై 27 నుండి ఆగస్టు 2 మధ్య కాలానికి సంబంధించిన ఓటీటీ వీక్షకుల డేటా ప్రకారం..డిజిటల్ ఆడియన్స్ అత్యధికంగా కామెడీ - రియాలిటీ ఆధారిత కార్యక్రమాల వైపే మొగ్గు చూపారు. సమయ్ రైనా రూపొందించిన డిజిటల్ కామెడీ షో `ఇండియాస్ గాట్ లేటెంట్ సీజన్ 2` అత్యంత ప్రజాదరణ పొంది దేశంలోనే అత్యధికంగా వీక్షించిన ఓటీటీ షోగా అగ్రస్థానంలో నిలిచింది.

తాజా క‌థ‌నాల ప్ర‌కారం.. కనీసం 30 నిమిషాల పాటు వీక్షించిన ఆధారంగా `ఇండియాస్ గాట్ లేటెంట్ సీజన్ 2` ఏకంగా 86ల‌క్ష‌ల‌ వ్యూయర్ షిప్‌ను సాధించి మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. రెండవ స్థానంలో బుల్లితెర పాపులర్ షో `తారక్ మెహతా కా ఊల్తా చష్మా` 49ల‌క్ష‌ల‌ వీక్షకులతో నిలవగా, విక్రమ్ మాస్సే- వేదిక పింటో- మహిమా మక్వానా నటించిన `ముసాఫిర్ కేఫ్` 48ల‌క్ష‌ల‌ వ్యూస్‌తో తదుపరి స్థానాన్ని దక్కించుకుంది.

ఈ వారం రియాలిటీ షోల విభాగంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. బుల్లితెరపై పాపులర్ అయిన `ఖత్రోన్ కే ఖిలాడీ 15` (38 ల‌క్ష‌ల‌ వ్యూస్)ను వెనక్కి నెట్టి, `లాక్ అప్: సచ్ యా సజా` 42 ల‌క్ష‌ల వ్యూయర్ షిప్‌తో అత్యధికంగా చూసిన రియాలిటీ కాంపిటీషన్ షోగా అవతరించింది. అలాగే `ఆదర్శ్ బాల్ విద్యాలయ` 40ల‌క్ష‌ల‌ వీక్షకులతో ఐదవ స్థానంలో నిలిచి తన సత్తా చాటుకుంది.

మరోవైపు టీవీ సీరియళ్లు, సరికొత్త డిజిటల్ సిరీస్‌లు కూడా ఆడియన్స్‌ను బాగానే ఆకట్టుకున్నాయి. రూపాళీ గంగూలీ నటిస్తున్న పాపులర్ డ్రామా `అనుపమ` 32ల‌క్ష‌ల‌ వ్యూస్‌తో ఏడో స్థానంలో నిలవగా.. ఊహించని రీతిలో `ఠుక్రా కే మేరా ప్యార్ సీజన్ 2` 31ల‌క్ష‌ల‌ వ్యూయర్ షిప్‌ సాధించి ఈ వారంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

అంతర్జాతీయ కంటెంట్ - స్టాండప్ కామెడీ కార్యక్రమాలు కూడా భారతీయ ప్రేక్షకులలో తమ స్థానాన్ని నిలబెట్టుకున్నాయి. గ్లోబల్ పాపులర్ ఫ్రాంచైజీ `హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 3` 30ల‌క్ష‌ల‌ వ్యూస్ సాధించగా, `లాఫ్టర్ షెఫ్స్ సీజన్ 3` 29ల‌క్ష‌ల వ్యూస్‌తో టాప్ 10 జాబితాను పూర్తి చేసింది. టీవీ సీరియ‌ళ్లు, అంతర్జాతీయ సిరీస్‌లతో పోలిస్తే డిజిటల్-ఫస్ట్ డిజైన్ చేసిన కామెడీ- రియాలిటీ షోలకే ప్రేక్షకులు ఎక్కువ ఓటు వేస్తున్నారని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.