Begin typing your search above and press return to search.

1000 కోట్ల క్ల‌బ్‌లో చేరిన హీరోలు ఎవ‌రు?

భార‌తీయ సినిమా ఒక‌ప్పుడు వంద కోట్ల క్ల‌బ్‌లో చేర‌డం అంటేనే గ‌గ‌నం అనే వారు.

By:  Ravindar Gorantla   |   28 March 2026 4:00 AM IST
1000 కోట్ల క్ల‌బ్‌లో చేరిన హీరోలు ఎవ‌రు?
X

భార‌తీయ సినిమా ఒక‌ప్పుడు వంద కోట్ల క్ల‌బ్‌లో చేర‌డం అంటేనే గ‌గ‌నం అనే వారు. కానీ దాన్ని కూడా అవ‌లీల‌గా దాటేసి వందల‌ కోట్ల వ‌సూళ్ల‌ని రాబ‌డుతూ మ‌న సినిమాలు ప్ర‌పంచ వ్యాప్తంగా రికార్డుల్ని సృష్టిస్తున్నాయి. పాన్ ఇండియా సినిమాల ప‌రంప‌ర మొద‌లైన ద‌గ్గ‌రి నుంచి రూ.500 కోట్లు ఓ టార్గెట్‌గా ఉండేది. ఆ త‌రువాత అది కాస్తా రూ.1000 కోట్ల క్ల‌బ్ టార్గెట్‌గా మారింది. దీన్ని కూడా భారీ సినిమాలు అవ‌లీల‌గా దాటేస్తుండ‌టంతో ఇప్ప‌డు అంద‌రి దృష్టి రూ.2000 కోట్ల క్ల‌బ్ సినిమాల‌పై ప‌డింది.

ఇండియాలో కానీ, ఇండియాతో క‌లిపి ప్ర‌పంచ వ్యాప్తంగా కానీ రూ.1000 కోట్ల టార్గెట్‌ని రీచ్ అయిన సినిమాలు ఎన్ని?..1000 కోట్ల క్ల‌బ్‌లో చేరిన స్టార్ హీరోలు ఎవ‌రు? అన్నది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. పైకి కాకి లెక్క‌లు ఎన్ని చెప్పినా ప‌ర్‌ఫెక్ట్ ఫిగ‌ర్స్‌తో త‌మ క్రేజీ సినిమాల‌తో రూ.1000 కోట్ల క్ల‌బ్‌లో చేరిన హీరోలు ఎవ‌రు? ఒక్కొక్క‌రి ఖాతాలో ఎన్ని రూ.1000 కోట్ల సినిమాలున్నాయ‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. రీసెంట్‌గా విడుద‌లై 'ధురంధ‌ర్‌' మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి ప‌బ్లిసిటీ లేకుండానే కేవ‌లం మౌత్ టాక్‌తో రూ.1000 కోట్ల మార్కుని దాటేయ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేసింది.

ఇక ఈ మూవీ విడుద‌లైన మూడు నెల‌ల్లోనూ దీని సీక్వెల్ 'ధురంధ‌ర్ 2' విడుద‌లై త‌క్కువ రోజుల్లోనే రూ.1130 కోట్ల‌కు పైనే వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌డం ట్రేడ్ వ‌ర్గాల‌తో పాటు ఫిల్మ్ స‌ర్కిల్స్‌ని షాక్‌కు గురి చేస్తోంది. దీంతో రూ.1000 కోట్ల క్ల‌బ్ లో చేరిన సినిమాలు, హీరోలు ఎవ‌రు? అనే చ‌ర్చ మొద‌లైంది. ఈ క్ల‌బ్‌లో చేరిన మొట్ట‌మొద‌టి సినిమా 'బాహుబ‌లి 2'. ప్ర‌భాస్ హీరోగా న‌టించిన ఈ మూవీ ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.1,810 కోట్లు రాబ‌ట్టి మొట్ట‌మొద‌టి స్థానంలో నిలిచింది. అంతే కాకుండా ఈ జాబితాలో ప్ర‌భాస్ రెండు రూ.1000 కోట్ల క్ల‌బ్‌లో చేరిన సినిమాల‌తో ఫ‌స్ట్ ప్లేస్‌లో నిలిచారు.

ప్ర‌భాస్ న‌టించిన 'క‌ల్కి' మూవీ 2024, జూన్ 27న విడుద‌లై భారీ హైప్‌తో, అబ్బుర‌ప‌రిచే కంటెంట్‌తో ప్ర‌పంచ‌ వ్యాప్తంగా రూ.1042 కోట్ల‌ని రాబ‌ట్టి రూ.1000 కోట్ల క్ల‌బ్‌లో చేరింది. ఆ త‌రువాత ప్లేస్‌ని షారుక్ ఖాన్ సొంతం చేసుకున్నాడు. సిద్ధార్ధ్ ఆనంద్ డైరెక్ట్ 2023లో చేసిన 'ప‌ఠాన్‌' రూ.1050 కోట్లు రాబ‌ట్టింది. ఇక ఇదే ఏడాది సెప్టెంబ‌ర్‌లో విడుద‌లైన 'జ‌వాన్‌' రూ.1148 కోట్లు రాబ‌ట్టింది.మూడ‌వ స్థానంలో ర‌ణవీర్ సింగ్ నిలిచాడు. బ్యాక్ టు బ్యాక్ మూడు నెల‌ల వ్య‌వ‌ధిలోనే రెండు వెయ్యి కోట్ల క్ల‌బ్‌లో చేరిన సినిమాల‌తో రణ్‌వీర్ సింగ్ మూడ‌వ స్థానంలో నిలిచాడు. ర‌ణ్ వీర్ న‌టించిన 'ధురంధ‌ర్' సైలెంట్‌గా విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద రూ.1350 కోట్లు రాబ‌ట్టింది. ఇక రీసెంట్‌గా విడుద‌లైన 'ధురంధ‌ర్ 2' రికార్డు స్థాయి స్పీడుతో అత్యంత త‌క్కువ రోజుల్లోనే రూ.1133 కోట్లు రాబ‌ట్టింది.

నాలుగ‌వ స్థానంలో ఆమీర్‌ఖాన్ 'దంగ‌ల్‌' మూవీతో నిలిచాడు. వ‌సూళ్ల ప‌రంగా రూ.1968 కోట్ల‌తో ఈ సినిమా ఫ‌స్ట్ ప్లేస్‌ని ఆక్ర‌మించినా రూ.1000 కోట్ల క్ల‌బ్‌లో చేరిన హీరోల జాబితాలో మాత్రం నాలుగ‌వ‌ స్థానాన్ని ద‌క్కించుకున్నారు. ఐద‌వ స్థానంలో 'కేజీఎఫ్ చాప్ట‌ర్ 2' తో య‌ష్ నిల‌వ‌గా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమాతో ఆర‌వ స్థానంలో నిల‌వ‌డం గ‌మ‌నార్హం. ఈ ఇద్ద‌రు హీరోలు ఒక్కో సినిమాతో రూ.1000 కోట్ల క్ల‌బ్ లో నిలిచారు. రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ మ‌ల్టీస్టార‌ర్ ఆర్ఆర్ఆర్ రూ.1300 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టినా సోలో హీరోలుగా మాత్రం వీరి ఖాతాలో ఒక్క రూ.1000 కోట్ల సినిమా లేక‌పోవ‌డంతో రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ఈ క్ల‌బ్‌లో ఇప్ప‌టికీ స్థానాన్ని ద‌క్కించుకోలేక‌పోతున్నారు. 'పెద్ది'తో చర‌ణ్‌, 'డ్రాగ‌న్‌'తో ఎన్టీఆర్ ఈ క్ల‌బ్‌లో చేర‌డం ఖాయం.