Begin typing your search above and press return to search.

కామన్వెల్త్ చరిత్రలోనే 15 ప‌త‌కాలు గెలిచిన లెజెండ‌రీ అథ్లెట్‌ బ‌యోపిక్!

ఈ బయోపిక్‌కు సంబంధించిన స్క్రిప్ట్ (కథా చర్చల) పనులలో జస్పాల్ రాణా స్వయంగా భాగస్వామి అయ్యారు.

By:  Sivaji Kontham   |   12 Jun 2026 11:30 PM IST
కామన్వెల్త్ చరిత్రలోనే 15 ప‌త‌కాలు గెలిచిన లెజెండ‌రీ అథ్లెట్‌ బ‌యోపిక్!
X

భారతదేశానికి ఎన్నో అంతర్జాతీయ పతకాలను అందించి, దేశ కీర్తిని దశదిశలా చాటిన లెజెండరీ షూటర్ -ద్రోణాచార్య అవార్డు గ్రహీత జస్పాల్ రాణా అద్భుతమైన జీవిత కథ త్వరలోనే వెండితెరపై ఆవిష్కృతం కానుంది. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ రాయ్ కపూర్ ఫిల్మ్స్ ఈ ప్రతిష్టాత్మక బయోపిక్ ను అధికారికంగా ప్రకటించింది. ఒక షూటర్‌గా పతకాల వేటలో ఆయన సాధించిన రికార్డులు.. ఆ తర్వాత ఒక అసాధారణమైన కోచ్‌గా మారి ఒలింపిక్ పతక విజేత మను భాకర్ వంటి నెక్స్ట్ జ‌న‌రేషన్ ఛాంపియన్లను తీర్చిదిద్దిన తీరును ఈ చిత్రంలో ప్రధానంగా చూపించబోతున్నారు.

ఈ బయోపిక్‌కు సంబంధించిన స్క్రిప్ట్ (కథా చర్చల) పనులలో జస్పాల్ రాణా స్వయంగా భాగస్వామి అయ్యారు. రాయ్ కపూర్ ఫిల్మ్స్ ప్రతినిధులు ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. జస్పాల్ రాణా అద్భుతమైన ప్రయాణాన్ని వెండితెరపైకి తీసుకురావడానికి మేము ఆయనతో కలిసి చాలా కాలంగా స్క్రిప్ట్ డెవలప్‌మెంట్ పనులపై పనిచేశాము. ఈ కథా చర్చల సమయంలో తన విద్యార్థుల సామర్థ్యాన్ని వెలికితీయడానికి భారత క్రీడల భవిష్యత్తును మార్చడానికి ఆయన చూపించిన అంకితభావం మమ్మల్ని ఎంతగానో కదిలించింది! అని పేర్కొన్నారు. క్రీడాకారుడిగా ఆయన జీవితంలోని ఒడిదుడుకులు... షూటింగ్ రేంజ్‌లో ఆయన ప్రదర్శించిన క్రమశిక్షణ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

కేవలం ఒక క్రీడాకారుడిగానే కాకుండా జస్పాల్ రాణాలోని విలక్షణమైన వ్యక్తిత్వాన్ని.. ఆయన హాస్య చతురతను కూడా ఈ బయోపిక్‌లో స్పృశించబోతున్నారు. ఎంతటి క్లిష్ట పరిస్థితిలోనైనా తనదైన జోకులు, చమత్కారాలతో చుట్టూ ఉన్నవారిని నవ్వించే గొప్ప గుణం జ‌స్పాల్‌కు ఉండేదని చిత్ర బృందం గుర్తుచేసుకుంది. షూటింగ్ రేంజ్ వెనుక ఉన్న ఒక సాధారణ మనిషి భావోద్వేగాలు, కోచ్‌గా ఆయన విద్యార్థులతో కొన‌సాగించిన‌ అనుబంధం.. జీవితం పట్ల ఆయనకున్న సానుకూల దృక్పథాన్ని సినిమాలో వినోదాత్మకంగా.. స్ఫూర్తిమంతంగా మలచడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

నిజ జీవిత వీరుల కథలను సినిమాలుగా మలచడంలో రాయ్ కపూర్ ఫిల్మ్స్ సంస్థకు బాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు ఉంది. కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలోనే 15 పతకాలతో అత్యంత విజయవంతమైన భారతీయ అథ్లెట్‌గా నిలిచిన రాణా బయోపిక్.. కేవలం ఒక స్పోర్ట్స్ డ్రామాగానే కాకుండా దేశంలోని లక్షలాది మంది యువ అథ్లెట్లకు ఒక గొప్ప గైడ్‌లా ఉపయోగపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. పట్టుదల ఉంటే ఎలాంటి శారీరక, మానసిక ఇబ్బందులనైనా అధిగమించి దేశానికి కీర్తి తీసుకురావచ్చనే సందేశాన్ని ఈ చిత్రం ద్వారా బలంగా చెప్పబోతున్నారు.

ప్రస్తుతం ఈ బయోపిక్‌కు సంబంధించిన స్క్రిప్ట్ తుది దశకు చేరుకుందని... త్వరలోనే ఈ చిత్రంలో జస్పాల్ రాణా పాత్రను పోషించనున్న‌ నటీనటులు, దర్శకుడి వివరాలను అధికారికంగా వెల్లడిస్తామని నిర్మాణ సంస్థ స్పష్టం చేసింది. భారత షూటింగ్ రంగానికి ఒక దిక్సూచిగా నిలిచిన ఒక లెజెండ్ కథను వెండితెరపై చూడటానికి ఇటు క్రీడా అభిమానులు, అటు సినిమా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.