క్రియేటర్లు కథ చెప్పే విధానాన్ని OTT ఎలా మార్చివేసింది?
సాంప్రదాయ టెలివిజన్ సీరియల్స్, సిరీస్‌లలో ఉండే రకరకాల నిబంధనలు, ప్రకటనల ఒత్తిడి వంటి పరిమితులను ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ మోడల్స్ పూర్తిగా అధిగమించాయి.
By: Sivaji Kontham | 10 Oct 2026 6:00 AM ISTభారతీయ వినోద రంగంలో ఓటీటీ (OTT) ల ప్రవేశం కథలు చెప్పే విధానాన్ని పూర్తిగా మార్చివేసిందా? అంటే అవుననే అంగీకరిస్తున్నారు విశ్లేషకులు. ఒకప్పుడు సాంప్రదాయ టెలివిజన్ సీరియల్స్‌లో కనిపించే సాధారణ కుటుంబ గాథలు, సుదీర్ఘ డ్రామాల స్థానంలో ఇప్పుడు సరికొత్త-వాస్తవిక దృక్కోణాలతో కూడిన కథలు వస్తున్నాయి. ఈ డిజిటల్ వేదికల ద్వారా క్రియేటర్లు ఎలాంటి సాంప్రదాయ టీవీ ఆంక్షలు లేకుండా తమ సృజనాత్మకతను స్వేచ్ఛగా ప్రదర్శించడానికి అవకాశం ఏర్పడింది.
సాంప్రదాయ టెలివిజన్ సీరియల్స్, సిరీస్‌లలో ఉండే రకరకాల నిబంధనలు, ప్రకటనల ఒత్తిడి వంటి పరిమితులను ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ మోడల్స్ పూర్తిగా అధిగమించాయి. దీనివల్ల దర్శకులు, రచయితలు ఎలాంటి రాజీ పడకుండా తాము అనుకున్న కథాంశాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురాగలుగుతున్నారు. బో*ల్డ్ సబ్జెక్ట్‌లు, విభిన్నమైన జోనర్‌లతో కూడిన కంటెంట్‌ను ప్రేక్షకులు నేరుగా తమ డివైజ్‌లలో వీక్షించే సౌలభ్యం లభించింది.
ఈ సరికొత్త మాధ్యమంలో రచయితలు పరిమిత ఎపిసోడ్‌ల నిర్మాణాన్ని ఎంచుకుంటున్నారు. దీనిద్వారా పాత్రల చిత్రణ చాలా బలంగా, సంక్లిష్టంగా రూపుదిద్దుకోవడానికి ఆస్కారం ఏర్పడింది. ప్రతి పాత్రకు ఒక స్పష్టమైన ఆర్క్ ఇస్తూ, కథలో అనవసరమైన సాగదీత లేకుండా నేరుగా అసలు విషయానికి ప్రాధాన్యతనిస్తున్నారు.
ఇక ప్రాంతీయ సినిమా విషయానికి వస్తే.. మల్టీలింగ్వల్ డబ్స్ రాకతో మన ప్రాంతీయ చిత్రాలు కూడా ఉత్తర భారతదేశంలోని పట్టణ ప్రాంతాలను సులభంగా జయించగలుగుతున్నాయి. భాషా భేదాలను చెరిపేస్తూ దేశవ్యాప్తంగా కంటెంట్‌కు ఆదరణ లభిస్తుండటంతో సినిమా రంగానికి సరికొత్త సరిహద్దులు ఏర్పడ్డాయి.
మొత్తంగా ఓటీటీలు భారతీయ వినోద పరిశ్రమకు ఒక నూతన ఉత్తేజాన్ని ఇచ్చాయి. సాంప్రదాయ కథా కథన శైలిని దాటి గ్రిట్టి డ్రామాలు, వినూత్న ప్రయోగాలతో కూడిన కంటెంట్ ప్రేక్షకులకు అందుబాటులోకి రావడంతో డిజిటల్ వినోద రంగం మునుపెన్నడూ లేని విధంగా దూసుకుపోతోంది.
డిజిటల్ స్థాయిని శిఖరానికి చేర్చిన సిరీస్‌లు:
ఇటీవలి కాలంలో ఓటీటీ వేదికగా విడుదలైన కొన్ని సిరీస్‌లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా పంచాయత్, గుల్లక్, కోహ్రా, ది ఫ్యామిలీ మ్యాన్, ఆస్పిరెంట్స్, మామ్లా లీగల్ హై, అసుర్ 2, ఫర్జీ, పాతాళ్ లోక్.... పీరియడ్ క్రైమ్ డ్రామాగా వచ్చిన `మట్కా కింగ్` వంటి టాప్ సిరీస్‌లు విశేషమైన ఆదరణ పొందాయి. ఈ సిరీస్ లు కేవలం వినోదాన్ని పంచడమే కాకుండా... విభిన్న కథాంశాలతో ప్రేక్షకులను కట్టిపడేశాయి. గ్రామీణ నేపథ్య భావోద్వేగాల నుంచి క్లిష్టమైన నేర పరిశోధనల వరకు.. మధ్యతరగతి కుటుంబ జీవన శైలి నుంచి రాజకీయ కుట్రల వరకు ప్రతి ఒక్కటి ప్రేక్షకుల హృదయాలను తాకాయి.
ఈ సిరీస్‌ల కథన శైలిలో క్రియేటర్లు ఎన్నో కొత్త పద్ధతులను ఆవిష్కరించారు. సంప్రదాయ టెలివిజన్ సీరియళ్లలా సాగదీయకుండా.. పాత్రల స్వభావాన్ని లోతుగా ఆవిష్కరించేలా పరిమిత ఎపిసోడ్‌ల విధానాన్ని ఎంచుకున్నారు. నేర పరిశోధన థ్రిల్లర్లలో కేవలం నేరస్థులను పట్టుకోవడంపైనే కాకుండా... దర్యాప్తు అధికారుల వ్యక్తిగత జీవితాలు, మానసిక సంఘర్షణలను కూడా వాస్తవికంగా జోడించి సరికొత్త అనుభూతిని పంచారు. అలాగే వర్క్‌ప్లేస్ కామెడీలు .. లీగల్ డ్రామాలలో సెన్సిబుల్ హ్యూమర్‌ను చొప్పిస్తూ... సామాజిక అంశాలను కూడా ఎంతో సున్నితంగా, వినోదాత్మకంగా తెరకెక్కించి డిజిటల్ కంటెంట్ స్థాయిని కొత్త శిఖరాలకు చేర్చారు.
