Begin typing your search above and press return to search.

ఆ థియేటర్ లో ఇండియన్ మూవీస్ బంద్.. ఎక్కడ? ఎందుకు?

ఓవర్సీస్ లో ఇండియన్ సినిమాలు ఇప్పటికే పెద్ద ఎత్తున వసూళ్లు రాబట్టాయి.. రాబడుతున్నాయి.. రాబట్టనున్నాయి కూడా! కానీ తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది.

By:  M Prashanth   |   3 Oct 2025 5:02 PM IST
ఆ థియేటర్ లో ఇండియన్ మూవీస్ బంద్.. ఎక్కడ? ఎందుకు?
X

భారతీయ సినీ ఇండస్ట్రీకి చెందిన అనేక సినిమాలు.. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతాయన్న విషయం తెలిసిందే. కొన్నేళ్లుగా ఇది జరుగుతూనే ఉంది. ఓవర్సీస్ లో ఇండియన్ సినిమాలు ఇప్పటికే పెద్ద ఎత్తున వసూళ్లు రాబట్టాయి.. రాబడుతున్నాయి.. రాబట్టనున్నాయి కూడా! కానీ తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది.

ఇండియన్ సినిమాలు ఎక్కువగా రిలీజ్ అయ్యే కెనడాలోని ఓ థియేటర్ లో భారతీయ చిత్రాల స్క్రీనింగ్ ను నిలిపివేశారు. ఎప్పుడు భారతీయ సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఆ సమయంలో దాడులు జరుగుతున్నాయని థియేటర్ వర్గాలు తెలిపాయి. అందుకే ప్రదర్శనను నిలిపివేశామని చెప్పాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కెనడాలోని ఓక్‌ విల్లే ప్రాంతంలో ఫిల్మ్‌.కా అనే థియేటర్ ఉంది. అక్కడ తరచూ ఎక్కువ భారతీయ సినిమాలు ప్రదర్శితమవుతుంటాయి. అయితే గత వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు దాడులు జరిగాయి. సెప్టెంబర్ 25వ మొదటిసారి థియేటర్ వద్ద దాడి ఘటన జరిగింది.

ఆ రోజు ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు థియేటర్ కు నిప్పంటించేందుకు ట్రై చేశారు. వెంటనే గమనించి సిబ్బంది.. మంటలను ఆర్పివేశారు. అప్రమత్తంగా ఉండడం వల్ల పెద్దగా నష్టం జరగలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అది జరిగిన వారానికి అంటే నిన్న.. మళ్లీ అదే థియేటర్ లో మరో దాడి ఘటన జరిగింది.

తెల్లవారుజామున మరో గుర్తు తెలియని వ్యక్తి.. థియేటర్ ఎంట్రెన్స్ వద్ద కాల్పులు జరిపాడు. దీంతో రంగంలో దిగిన పోలీసులు.. విచారణ జరుపుతున్నారు. అయితే వరుస దాడి ఘటనల వల్ల భారతీయ సినిమాల ప్రదర్శనను నిలిపివేస్తున్నట్లు థియేటర్ యాజమాన్యం వెల్లడించింది. ఓజీ, కాంతార ప్రీక్వెల్ సినిమాలను కూడా వేయడం లేదని చెప్పింది.

అయితే చాలా మంది ఆ రెండు చిత్రాల గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు గుర్తించామని, కానీ తమ నిర్ణయం కలిగించే అసౌకర్యం, నిరాశకు హృదయపూర్వకంగా చింతిస్తున్నామని థియేటర్ యాజమాన్యం పేర్కొంది. అదే సమయంలో వరుస దాడుల వెనుక ఖలిస్థానీ ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు థియేటర్‌ యాజమాన్యం అనుమానిస్తోంది. ఇటీవల కెనడాలోని భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తామని బెదిరించిన ఖలీస్థాన్ ఉగ్రవాదులు.. ఇప్పుడు దాడులు చేస్తున్నారేమోనని అంటోంది!