Begin typing your search above and press return to search.

రిలీజ్ డైల‌మా: కొన్నిటికి అంతే అదంతే.. మోక్షం రాదు!

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో కొన్ని సినిమాలు అంగరంగ వైభవంగా ప్రారంభమై.. చిత్రీకరణ పూర్తి చేసుకున్నా రకరకాల కారణాల వల్ల దశాబ్ద కాలంగా విడుదల కాకుండా పెండింగ్‌లోనే ఉండిపోతున్నాయి.

By:  Sivaji Kontham   |   23 Aug 2026 8:00 AM IST
రిలీజ్ డైల‌మా: కొన్నిటికి అంతే అదంతే.. మోక్షం రాదు!
X

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో కొన్ని సినిమాలు అంగరంగ వైభవంగా ప్రారంభమై.. చిత్రీకరణ పూర్తి చేసుకున్నా రకరకాల కారణాల వల్ల దశాబ్ద కాలంగా విడుదల కాకుండా పెండింగ్‌లోనే ఉండిపోతున్నాయి. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ , మాలీవుడ్‌లలో నిర్మించిన ఇలాంటి చిత్రాలు బడ్జెట్ కొరత.. ద‌ర్శ‌క‌నిర్మాతల మధ్య వివాదాలు.. డిస్ట్రిబ్యూటర్లు దొరక్కపోవడం లేదా సృజనాత్మక విభేదాల వల్ల థియేటర్లు లేదా ఓటీటీలలోకి అడుగుపెట్టలేకపోతున్నాయి. ప్రముఖ నటులు, భారీ బడ్జెట్ .. అత్యుత్తమ సాంకేతిక నిపుణులు ఉన్నా చిత్రీకరణ పూర్తయినా విడుదల భాగ్యానికి నోచుకోక `అన్-రిలీజ్డ్` ప్రాజెక్టులుగా మిగిలిపోతుండటం సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

తమిళంలో కమల్ హాసన్ క్రేజీ అంబిషియస్ ప్రాజెక్ట్ `మరుదనాయగం` లేదా విక్రమ్ నటించిన `ధ్రువ నక్షత్రం`, బాలీవుడ్‌లో అమీర్ ఖాన్ నిర్మించిన `ప్రీతమ్ ప్యారే`..అలాగే తెలుగు, మలయాళ పరిశ్రమలలో ఏళ్లకు పైగా ల్యాబ్‌లకే పరిమితమైన పలు ప్రాజెక్టులు ఇందుకు ఉత్తమ ఉదాహరణలు. షూటింగ్ పూర్తయిన తర్వాత రీ-షూట్లు చేయాల్సి రావడం, సెన్సార్ చిక్కులు లేదా డిజిటల్ రైట్స్ ఆశించిన ధరకు అమ్ముడుపోకపోవడం వల్ల ఈ సినిమాలు చిక్కుల్లో పడుతున్నాయి. విడుదల మార్గం సుగమం కాక ఒక తరం మారినా ఈ అసంపూర్ణ లేదా నిలిచిపోయిన చిత్రాల కథలు తెరపై కంటే తెర వెనుక జరిగిన పరిణామాల ద్వారానే సినీ ప్రియులలో ఎప్పుడూ చర్చనీయాంశంగా నిలుస్తున్నాయి.

సినిమా విజయంలో .. ప్రచారంలో టైటిల్ ఎంపిక చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ప్రేక్షకులను సులువుగా ఆకట్టుకునేలా .. వారిలో కుతూహలాన్ని పెంచేలా శీర్షిక ఉండటం అత్యంత అవసరం. అయితే ప్రస్తుతం బాలీవుడ్‌లో సరైన టైటిల్ బజ్ లేకపోవడం లేదా ఆకట్టుకునేలా క్యాచీగా నిలవకపోవడం కూడా కొన్ని చిత్రాలు డిమాండ్ ని ద‌క్కించుకోకపోవడానికి కారణమవుతోంది. టైటిల్ పవర్ మాత్రమే కాకుండా.. నాణ్యమైన కంటెంట్ ఉన్నా ఓటీటీ, థియేట్రికల్ కొనుగోలుదారులు లభించక చాలా హిందీ సినిమాలు పెండింగ్‌లోనే ఉండిపోతున్నాయి.

ప్రస్తుతం ఈ విధమైన మార్కెట్ సవాళ్లను ఎదుర్కొంటున్న చిత్రాల జాబితాలో అగ్ర కథానాయకుల ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. సల్మాన్ ఖాన్ నటించిన `మాతృభూమి` ఏప్రిల్ 2026 విడుదల తేదీని దాటిపోగా.. ఇంకా సెన్సార్ బోర్డు వరకు చేరలేదు. అలాగే ఒముంగ్ కుమార్ దర్శకత్వంలో హర్షవర్ధన్ రాణే నటించిన `శిలా`, తాప్సీ పన్ను `గాంధారి`.. అమీర్ ఖాన్ నిర్మించిన `ప్రీతమ్ ప్యారే` చిత్రాలు సృజనాత్మక విభేదాలు.. రీ-షూట్లు లేదా బడ్జెట్ కొరత వల్ల సంవత్సరాలుగా ల్యాబ్‌లకే పరిమితమయ్యాయి. అభయ్ వర్మ నటించిన `లైకే లైకా`, `జెసి (జాకబ్ కార్డోసో)` వంటి యంగ్ జెనరేషన్ చిత్రాలు కూడా షూటింగ్ పూర్తయినా డిజిటల్ లేదా థియేట్రికల్ బయ్యర్లు దొరకక ఇబ్బంది పడుతున్నాయి.

అంతేకాకుండా పంకజ్ త్రిపాఠి నటించిన `పారివారిక్ మనోరంజన్`, అర్జున్ రాంపాల్ `బ్లైండ్ గేమ్` వంటి చిత్రాలు పూర్తయి దశాబ్దాలు గడుస్తున్నా సరైన విడుదల మార్గం లభించక నలిగిపోతున్నాయి. ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసే హిందీ చిత్ర పరిశ్రమలో... ఇలాంటి చిత్రాలు ఆర్థిక లోటుపాట్లు - డిస్ట్రిబ్యూటర్లు లేకపోవడం వల్ల తీవ్ర మార్కెట్ సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. సినిమాలకు సరైన ప్రమోషన్... ఆకట్టుకునే టైటిల్.. పక్కా విడుదల ప్రణాళిక ఎంత అవసరమో ఈ ప్రస్తుత పరిస్థితి స్పష్టం చేస్తోంది.