సినిమా కథా రచయితల హక్కులకు భరోసా!
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రచయితల పక్షాన నిలబడి వారి హక్కుల కోసం పోరాడే రక్షణ కవచంగా `స్క్రీన్‌రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా` (SWA) వ్యవహరిస్తోంది.
By: Srikanth Kontham | 17 Jun 2026 9:04 PM ISTసినిమా విజయానికి బలమైన పునాది కథే. దర్శకుడు, నటీనటులు ఆ కథకు వెండితెరపై రూపం ఇస్తే దానికి ప్రాణం పోసేది మాత్రం తెరవెనుక ఉండి కలం కదిపే రచయితలే. అయితే గ్లామర్ ప్రపంచంగా పిలవబడే చిత్ర పరిశ్రమలో ఈ కథా రచయితలకు దక్కాల్సిన గుర్తింపు, గౌరవం మాత్రమే కాకుండా, వారి కష్టార్జితమైన పారితోషికాలు కూడా సకాలంలో అందకపోవడం చాలా కాలంగా పెద్ద సమస్యగా మారుతోంది. కథను నమ్ముకుని పరిశ్రమలోకి వచ్చే ఎందరో ప్రతిభావంతులు సరైన సమయంలో డబ్బులు అందక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రచయితల పక్షాన నిలబడి వారి హక్కుల కోసం పోరాడే రక్షణ కవచంగా `స్క్రీన్‌రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా` (SWA) వ్యవహరిస్తోంది. పరిశ్రమలో పెద్ద ప్రొడక్షన్ హౌస్‌లు లేదా పవర్‌ఫుల్ వ్యక్తులతో ఒంటరిగా పోరాడలేని సాధారణ, వర్ధమాన రచయితలకు ఈ సంస్థ పెద్ద భరోసాగా నిలుస్తోంది. తమకు జరిగిన అన్యాయాలపై రావలసిన బాకీలపై రచయితలు ఇచ్చే ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించడంలో ఈ అసోసియేషన్ కీలక పాత్ర పోషిస్తోంది.
ఇటీవల కాలంలో ఈ అసోసియేషన్ సాధించిన పెద్ద విజయం పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. వివిధ ప్రాజెక్టులకు సంబంధించి రచయితలకు రావాల్సిన 60 లక్షల రూపాయల పెండింగ్ బకాయిలను రికవరీ చేయడంలో `సా` విజయవంతమైంది. ఈ భారీ మొత్తం ఒక సంఖ్య మాత్రమే కాదు. తెరవెనుక శ్రమించే ఎందరో క్రియేటర్ల కష్టానికి దక్కిన ప్రతిఫలం. పెద్ద పెద్ద సంస్థల నుండి కూడా న్యాయబద్ధంగా రావాల్సిన నిధులను రాబట్టడం ద్వారా అసోసియేషన్ ఉనికిని అవసరాన్ని చాటుకుంది.
అయితే ఈ వివాదాల పరిష్కారానికి అసోసియేషన్ అనుసరించిన విధానం మరింత ప్రశంసనీయం. కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బును వృధా చేసుకోకుండా, చాలా వరకూ కేసులను కోర్టు వెలుపల మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించడం విశేషం. నిర్మాతలతో, నిర్మాణ సంస్థలతో సంప్రదింపులు జరిపి పరస్పర అంగీకారంతో బకాయిలను క్లియర్ చేయించడం వల్ల అటు రచయితల సమయం ఆదా అవుతుంది. పరిశ్రమలో సత్సంబంధాలు దెబ్బతినకుండా చూసుకోవడం సాధ్యమైంది.
ఈ పరిణామం కేవలం ఆర్థిక విజయంగానే కాదు. పరిశ్రమలో రచయితల హక్కులపై కొత్త చైతన్యాన్ని తీసు కొచ్చింది. లీగల్ కాంట్రాక్టుల ప్రాధాన్యతను, వాటిని పక్కాగా అమలు చేయాల్సిన అవసరాన్ని ఇది గుర్తు చేస్తోంది. కేవలం నమ్మకం మీదో లేదా మౌఖిక ఒప్పందాల పైనో ఆధారపడకుండా ప్రతి రచయితా తమ హక్కులను చట్టబద్ధంగా రక్షించుకోవాలనే స్పృహ పెరుగుతోంది. ఇది భవిష్యత్తులో సినిమా రంగంలో మరింత పారదర్శకతకు దారి తీస్తుంది.
కథా రచయితలకు రావాల్సిన బకాయిలు రికవరీ కావడం శుభపరిణామమే. అయినా అసలు ఇలాంటి బకాయిలు పేరుకుపోకుండా ఉండే ఒక శాశ్వత వ్యవస్థ పరిశ్రమలో ఏర్పాటు కావాలి. సినిమా రంగం ఎంత కార్పొరేట్ దిశగా అడుగులు వేస్తున్నా? సృజనాత్మకతను అందించే మేధో సంపత్తికి సరైన గౌరవం, ఆన్-టైమ్ పేమెంట్లు లభించినప్పుడే నిజమైన సినిమా అభివృద్ధి సాధ్యమవుతుంది. సంఘటితంగా పోరాడితే ఏ హక్కునైనా సాధించుకోవచ్చని ఈ ఘటన నిరూపించింది.
