Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా తర్వాత కొత్త టార్గెట్.. పాన్-ఫ్యూచర్ ప్లానింగ్!

ఒకప్పుడు ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీలో పెద్ద సినిమా అంటే భారీ బడ్జెట్, స్టార్ హీరో, గ్రాండ్ సెట్లు ఉంటే సరిపోయేది.

By:  Sravani Lakshmi Srungarapu   |   18 July 2026 11:14 AM IST
పాన్ ఇండియా తర్వాత కొత్త టార్గెట్.. పాన్-ఫ్యూచర్ ప్లానింగ్!
X

ఒకప్పుడు ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీలో పెద్ద సినిమా అంటే భారీ బడ్జెట్, స్టార్ హీరో, గ్రాండ్ సెట్లు ఉంటే సరిపోయేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ప్రేక్షకుల అభిరుచి మాత్రమే కాదు, నిర్మాణ సంస్థల వ్యూహాలు కూడా పూర్తిగా కొత్త దిశగా వెళ్తున్నాయి. వందల కోట్ల బడ్జెట్‌తో ఒక సినిమా తీయడం కంటే... ఐదేళ్లు, పదేళ్లు ముందే స్ట్రాట‌జీలు రెడీ చేసుకుని వరుస ప్రాజెక్టులను లైన్ లో పెట్ట‌డంపైనే ప్రముఖ నిర్మాణ సంస్థలు దృష్టి పెడుతున్నాయి. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ హోంబ‌ళే ఫిల్మ్స్ ఇప్ప‌టికే రాబోయే ప‌దేళ్ల‌కు సంబంధించిన ప్రాజెక్టుల‌ను లైన్ లో పెట్ట‌గా, హోంబళే ఫిల్మ్స్ తర్వాత ఇదే తరహా లాంగ్‌టర్మ్ స్ట్రాటజీని అనుసరించే బ్యానర్లు ఏవి? అనే ప్రశ్న ఇండ‌స్ట్రీలో వినిపిస్తోంది.

తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పటికే ఒకేసారి పలువురు స్టార్ హీరోలతో భారీ సినిమాల‌ను నిర్మిస్తోంది. కేవలం ఒక సినిమా మీద ఆధారపడకుండా, వేర్వేరు భాషల్లో మార్కెట్‌ను విస్తరించే ప్రయత్నం చేస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కూడా భారీ స్థాయిలో ప్రాజెక్టులు ప్రకటిస్తూ, ఫ్యూచ‌ర్ లైన‌ప్ ను మ‌రింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కూడా యంగ్ హీరోలతో పాటు స్టార్ హీరోల సినిమాలను బ్యాలెన్డ్స్‌గా ప్లాన్ చేస్తూ రిస్క్‌ను విభజించే విధానాన్ని అనుసరిస్తోంది.

కన్నడలో కేవలం హోంబళే మాత్రమే కాదు, కేవీఎన్ ప్రొడక్షన్స్ కూడా పాన్ ఇండియా ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది. తమిళంలో సన్ పిక్చర్స్, లైకా ప్రొడక్షన్స్ వంటి సంస్థలు ఒకేసారి పలువురు స్టార్ హీరోలతో సినిమాలు రూపొందిస్తూ దీర్ఘకాలిక బిజినెస్ స్ట్రాట‌జీల‌ను అమలు చేస్తున్నాయి. హిందీలో యష్ రాజ్ ఫిల్మ్స్, మ‌డాక్ ఫిల్మ్స్ వంటి సంస్థలు ఫ్రాంచైజీలు, సినిమాటిక్ యూనివర్స్‌లతో ముందుకు సాగుతున్నాయి. ఇకపై స‌క్సెస్ ను డిసైడ్ చేసేది సినిమా బ‌డ్జెట్ కాద‌ని, ఆ సినిమా వెనుక ఉన్న ప్లానింగ్, రిలీజ్ స్ట్రాటజీ, కంటెంట్ సెలెక్ష‌న్, మార్కెట్ విస్తరణ, ఆడియ‌న్స్ తో లాంగ్ ర‌న్ బాండింగ్ ను కొనసాగించే సామర్థ్యమే కీలకంగా మారుతోంద‌ని స్ప‌ష్ట‌మ‌వుతుంది.

గతంలో కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు భారీ అంచనాల మధ్య రిలీజై ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయాయి. అదే సమయంలో తక్కువ ఖర్చుతో రూపొందిన కొన్ని సినిమాలు సరైన ప్లానింగ్, స్ట్రాంగ్ ప్ర‌మోష‌న్స్, మంచి రిలీజ్ టైమ్ తో అద్భుత స‌క్సెస్‌లు సాధించాయి. దీంతో నిర్మాతలు కూడా ఎంత ఖర్చు పెట్టాం? అనే ఆలోచన కంటే ఎలా ప్లాన్ చేశాం? అనే అంశానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.

రాబోయే రోజుల్లో ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీలో పోటీ హీరోల మధ్య మాత్రమే కాదు, నిర్మాణ సంస్థల వ్యూహాల మధ్య కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆడియ‌న్స్ కు నచ్చే కథలను ఎంచుకోవడం, సరైన డైరెక్ట‌ర్ల‌తో మంచి భాగస్వామ్యాలు ఏర్పాటు చేయడం, ఫ్యూచ‌ర్ ప్రాజెక్టులను ముందుగానే ప్లాన్ చేయడం... ఇవే స‌క్సెస్‌ఫుల్ బ్యానర్లను మిగతావారి నుంచి ప్రత్యేకంగా నిలబెట్టే ప్రధాన కారణాలుగా మారుతున్నాయి.