Begin typing your search above and press return to search.

ఇండియన్ ఫిల్మ్ 'బడ్జెట్'.. ఇక కామన్ అవ్వనుందా?

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బడ్జెట్ల పరిమాణం రోజురోజుకూ కొత్త స్థాయికి చేరుతోంది. ఒకప్పుడు రూ.100 కోట్ల బడ్జెట్ అంటేనే భారీ సినిమా అనే భావన ఉండేది.

By:  M Prashanth   |   22 Dec 2025 2:00 AM IST
ఇండియన్ ఫిల్మ్ బడ్జెట్.. ఇక కామన్ అవ్వనుందా?
X

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బడ్జెట్ల పరిమాణం రోజురోజుకూ కొత్త స్థాయికి చేరుతోంది. ఒకప్పుడు రూ.100 కోట్ల బడ్జెట్ అంటేనే భారీ సినిమా అనే భావన ఉండేది. కానీ కాలం మారింది. ప్రేక్షకుల అంచనాలు పెరిగాయి. సాంకేతికత విస్తరించింది. అంతర్జాతీయ మార్కెట్‌ దృష్టిలో పెట్టుకుని సినిమాలు రూపొందుతున్నాయి. ఫలితంగా ఇప్పుడు రూ.500 కోట్ల బడ్జెట్ సినిమాలు సాధారణంగా మారుతున్నాయి.

ఇకపై రూ.1000 కోట్ల బడ్జెట్ కూడా కామన్ అయ్యే రోజులు దగ్గరపడుతున్నాయన్న చర్చ ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో జరుగుతోంది. తాజాగా ఈ మార్పును స్పష్టంగా చూపిస్తున్న ఉదాహరణలుగా రెండు భారీ ప్రాజెక్టులు నిలుస్తున్నాయి. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ వారణాసి సుమారు రూ.1300 కోట్ల వ్యయంతో రూపొందుతోందన్న అంచనాలు ఉన్నాయి.

ఆ సినిమా విజువల్ ఎఫెక్ట్స్, భారీ సెట్లు, అంతర్జాతీయ టెక్నీషియన్లతో రూపొందుతుండటంతో బడ్జెట్ భారీగా పెరిగినట్లు సమాచారం. ఇప్పటికే హాలీవుడ్ స్థాయి టెక్నాలజీని భారతీయ సినిమాల్లో వినియోగించడం సాధారణంగా మారింది. మరోవైపు బాలీవుడ్‌ లో రూపొందుతున్న రామాయణ సినిమా కూడా బడ్జెట్ పరంగా చరిత్ర సృష్టించనుందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.

రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఆ ప్రాజెక్ట్‌ కు కలిపి దాదాపు రూ.4000 కోట్ల వరకు ఖర్చవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఆ విషయాన్ని నమిత్ మల్హోత్రా రివీల్ చేశారు. భారతీయ పురాణ గాథలను అంతర్జాతీయ స్థాయిలో చూపించాలనే లక్ష్యంతో సినిమాను ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. భారీ తారాగణం, అత్యాధునిక వీఎఫ్‌ఎక్స్‌, విదేశీ లొకేషన్లు, సుదీర్ఘ షూటింగ్ షెడ్యూళ్లు భారీ వ్యయానికి కారణాలు!

నిజానికి బాలీవుడ్ తో పాటు టాలీవుడ్, కోలీవుడ్, కన్నడ, మలయాళ పరిశ్రమలు కూడా పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాల వైపు అడుగులు వేస్తున్నాయి. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌, కల్కి వంటి సినిమాల విజయం తర్వాత నిర్మాతల్లో ధైర్యం పెరిగింది. భారీ బడ్జెట్ పెట్టినా సరే, కంటెంట్ బాగుంటే ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు సాధించవచ్చన్న నమ్మకం బలపడింది.

ఇక ఓటీటీ, డిజిటల్ హక్కులు, శాటిలైట్ హక్కులు, మ్యూజిక్ రైట్స్, ఓవర్సీస్ మార్కెట్ లాంటి అనేక ఆదాయ మార్గాలు ఉండటంతో పెట్టుబడులు పెట్టేందుకు నిర్మాతలు ముందుకు వస్తున్నారు. అంతేకాదు, ప్రేక్షకులు కూడా భారీ విజువల్స్, గ్రాండ్ ప్రెజెంటేషన్ ఉన్న సినిమాలను పెద్ద తెరపై చూడాలని కోరుకుంటున్నారు. ఈ డిమాండ్ కూడా బడ్జెట్ల పెరుగుదలకు కారణమవుతోంది.

మొత్తంగా చూస్తే, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ కొత్త యుగంలోకి అడుగుపెడుతోంది. రూ.100 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు వచ్చిన ప్రయాణం ఇప్పుడు రూ.1000 కోట్ల దిశగా సాగుతోంది. రాబోయే రోజుల్లో మరిన్ని భారీ ప్రాజెక్టులు రూపొందే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే బడ్జెట్ ఎంత పెద్దదైనా, చివరకు ప్రేక్షకుల ఆదరణే సినిమా విజయాన్ని నిర్ణయిస్తుందనే చెప్పాలి.