సెన్సార్ బోర్డ్ ఇబ్బందుల్లో సినిమాలు!
స్వేచ్ఛా ప్రకటనకు, బాధ్యతాయుతమైన నియంత్రణకు మధ్య ఉన్న సన్నని గీతను దాటడం వల్ల అనేక చిత్రాలు విడుదల సమస్యలను ఎదుర్కొంటున్నాయి.
By: Srikanth Kontham | 9 July 2026 5:00 PM ISTచలనచిత్ర పరిశ్రమకు సెన్సార్ బోర్డు నిబంధనలు సవాలుగా మారుతున్నాయి. స్వేచ్ఛా ప్రకటనకు, బాధ్యతాయుతమైన నియంత్రణకు మధ్య ఉన్న సన్నని గీతను దాటడం వల్ల అనేక చిత్రాలు విడుదల సమస్యలను ఎదుర్కొంటున్నాయి. `సత్లూజ్` వంటి చిత్రం నాలుగేళ్ల పాటు సుదీర్ఘ న్యాయపోరాటం చేసినా, చివరకు ఓటిటి వేదికపై విడుదలైన వెంటనే తొలగించాల్సిన పరిస్థితి రావడం చిత్రనిర్మాతలలో ఆందోళన కలిగిస్తోంది. ఇది ఒక సినిమాకే పరిమితం కాలేదు. మొత్తం పరిశ్రమలోని సెన్సార్ విధానంపైనే ప్రశ్నలను లేవనెత్తుతోంది.
సల్మాన్ ఖాన్ నటించిన `మాతృభూమి` ..ఇటీవలి కాలంలో వివాదాల్లో చిక్కుకున్న `జననాయగన్` వంటి చిత్రాలు సెన్సార్ క్లియరెన్స్ లేక వాయిదా పడుతోన్న సంగతి తెలిసిందే. సినిమా నిర్మాణం వెనుక కోట్లాది రూపాయల పెట్టుబడితో పాటు వేలాది మంది కళాకారుల శ్రమ ఉంటుంది. సెన్సార్ బోర్డు కఠినమైన కత్తెరలు .. అభ్యంతరాల వల్ల విడుదల నిలిచిపోతే ఆ నష్టం ఆర్థికపరమైనదే కాదు. దర్శకుడి సృజనాత్మకతకు కూడా పెద్ద దెబ్బ. కథలోని లోతును ..వాస్తవాలను ఆవిష్కరించే ప్రయత్నంలో బోర్డు విధించే నిబంధనలు అడ్డుగోడలుగా మారుతున్నాయనే వాదన ఇండస్ట్రీ వైపు నుంచి వినిపిస్తోంది.
కొన్ని సందర్భాల్లో చిత్రంలోని రాజకీయ లేదా సామాజిక అంశాలు సున్నితమైనవిగా పరిగణించబడటం వల్ల సెన్సార్ బోర్డు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. అయితే ఈ జాగ్రత్తలు ఒక్కోసారి అతిగా మారి సినిమా మూల కథనే దెబ్బతీసే అవకాశం ఉందంటున్నారు. సత్లూజ్ ఉదంతం చూస్తే ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లకు కూడా సెన్సార్ నిబంధనలు వర్తింపజేయడం వాటిని ఆకస్మికంగా తొలగించడం వంటి నిర్ణయాలు నిర్మాతల ధైర్యాన్ని సన్నగిల్లేలా చేస్తున్నాయి. ఇది సృజనాత్మక స్వేచ్ఛను హరించడమేనని పలువురు సినీ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రేక్షకులు ఇప్పుడు ఎంతో పరిణతి చెందారు. ఏది చూడాలి? ఏది చూడకూడదనే? స్పష్టమైన అవగాహనతో ఉంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో బోర్డు పాతబడిన నిబంధనలను ఆధునీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు. వివాదాస్పద అంశాలను నిషేధించడం కంటే వాటిని కళాత్మక దృష్టితో ఎలా చూపించాలో? చర్చించడం ఉత్తమమైన మార్గంగా పేర్కొంటున్నారు. లేకపోతే భవిష్యత్తులో మరిన్ని సినిమాలు ఆర్థిక కష్టాల్లో చిక్కుకుని విడుదల నోచుకోని పరిస్థితి తలెత్తవచ్చు.
సెన్సార్ బోర్డు పారదర్శకత కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఒక సన్నివేశాన్ని ఎందుకు తొలగించాలో ? ఎందుకు ఒక సినిమాను నిలిపివేయాలో? దర్శక, నిర్మాతలకు స్పష్టమైన కారణాలు తెలియజేయడం ముఖ్యం.
కళా స్వేచ్ఛను గౌరవిస్తూనే, సమాజ హితాన్ని కోరే విధంగా సెన్సార్ విధానాలు ఉండాలి. చట్టపరమైన చిక్కుల వల్ల సినిమాలు వాయిదా పడటం వల్ల జరిగే నష్టాన్ని నివారించడానికి పరిశ్రమ, ప్రభుత్వం , సెన్సార్ బోర్డు మధ్య బలమైన చర్చ జరగాలని పరిశ్రమ భావిస్తోంది. భారతీయ సినిమా ప్రపంచ స్థాయికి ఎదగాలంటే? ఇలాంటి అడ్డంకులను అధిగమించడం తప్పనిసరి.
