ట్రెండ్‌గా మారుతున్న జాంబీ సినిమాలు!
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు చిత్ర పరిశ్రమలో ఎప్పటికప్పుడు కొత్త జోనర్స్ తెరపైకి వస్తున్నాయి.
By: Srikanth Kontham | 19 Aug 2026 5:00 AM ISTటాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు చిత్ర పరిశ్రమలో ఎప్పటికప్పుడు కొత్త జోనర్స్ తెరపైకి వస్తున్నాయి. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచడానికి దర్శకులు విభిన్నమైన కాన్సెప్ట్‌లతో ప్రయోగాలు చేస్తున్నారు. ఆ కోవలోనే కొన్ని సంవత్సరాల క్రితం టాలీవుడ్‌లో ప్రశాంత్ వర్మ అద్భుతమైన సృజనాత్మకతతో తెరకెక్కించిన `జాంబీ రెడ్డి` సినిమాతో హర్రర్-కామెడీ జాంబీ కాన్సెప్ట్ అధికారికంగా పరిచయమైంది. తెలుగు ప్రేక్షకులకు పూర్తిగా కొత్తనైన జానర్‌ను దర్శకుడు అత్యంత వినోదాత్మకంగా మలచడంతో ఈ ప్రయోగం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది.
`జాంబీ రెడ్డి` సృష్టించిన ట్రెండ్ ఒక చిత్రంతో ఆగిపోకుండా ఇండియన్ స్క్రీన్ మీద సరికొత్త ట్రెండ్‌గా వేగంగా మారుతోంది. భయంతో పాటు కడుపుబ్బా నవించే కామెడీని మిక్స్ చేసి తెరకెక్కించే జాంబీ జోనర్‌పై నేటి యువ ప్రేక్షకులు మంచి ఆసక్తి చూపిస్తున్నారు. హాలీవుడ్ సినిమాలకు మాత్రమే పరిమితం అనుకున్న జాంబీ కాన్సెప్ట్‌ను భారతీయ నైటివిటీకి తగ్గట్టుగా మార్చి తెరపై ఆవిష్కరిస్తుండటంతో మేకర్స్‌కు కూడా కొత్త అవకాశాలు కలుగుతున్నాయి.
ఈ విజయవంతమైన బాటలోనే ఇప్పుడు మరిన్ని భారీ ప్రాజెక్ట్‌లు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమ వుతున్నాయి. `జాంబీ రెడ్డి` చిత్రానికి సీక్వెల్‌గా రాబోతున్న `జాంబీ రెడ్డి 2`పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా.. ఈసారి మరింత విస్తృతమైన గ్రాఫిక్స్ .. వినోదంతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగం కంటే రెండవ భాగం మరింత వైవిధ్యంగా ఉంటుందని ప్రేక్షకులను సీట్లలో కూర్చోబెట్టేలా అదిరిపోయే హర్రర్-కామెడీ ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది.
ఇక బాలీవుడ్‌లోనూ జాంబీ జోనర్ జోరు భారీగా పెరిగింది. స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం `ప్రళయ్` కూడా ఇదే కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ స్థాయి టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కుతున్న చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. రణ్‌వీర్ సింగ్ లాంటి స్టార్ హీరో ఈ జోనర్‌లో నటిస్తుండటంతో సినిమాపై జాతీయ స్థాయిలో భారీ హైప్ క్రియేట్ అవుతుంది.
మరోవైపు కోలీవుడ్‌లోనూ ఈ ట్రెండ్ జోరుగా కొనసాగుతోంది. ప్రభుదేవా .. నవ్వుల రారాజు వడివేలు ప్రధాన తారాగణంగా తెరకెక్కుతున్న `బ్యాంగ్ బ్యాంగ్` సినిమా కూడా జాంబీ కామెడీ నేపథ్యంలోనే రూపొందుతోంది. ఇద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న హర్రర్-కామెడీ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులకు అంతులేని నవ్వులను పంచడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఒకరికొకరు పూర్తిగా భిన్నమైన శైలి కలిగిన ఇద్దరు దిగ్గజాలు జాంబీలతో చేసే అల్లరి థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయించడం పక్కా.
మొత్తంగా ప్రశాంత్ వర్మ విత్తిన జాంబీ రెడ్డి చిన్న మొక్క నేడు ఇండియన్ సినిమా పరిశ్రమలో పెద్ద వృక్షలా ఎదిగుతోందన్నది కాదనలేని నిజం. రొటీన్ లవ్‌స్టోరీలు, యాక్షన్ చిత్రాలకే పరిమితం కాకుండా ఇలాంటి ప్రయోగాత్మక జాంబీ కాన్సెప్ట్‌లను ప్రేక్షకులు ఆదరిస్తుండటం శుభపరిణామం. రాబోయే రోజుల్లో భారతీయ తెరపై జాంబీ సినిమాల జోరు మరింత పెరిగి మరిన్ని అద్భుతమైన చిత్రాలు వచ్చే అవకాశం ఉంది.
