Begin typing your search above and press return to search.

పాత రికార్డులపై గురిపెట్టిన టాలీవుడ్ పార్ట్-2 చిత్రాలు!

బాక్సాఫీస్ వద్ద పాత రికార్డులను బద్దలు కొట్టడమే లక్ష్యంగా మోస్ట్ అవేటెడ్ పార్ట్-2 చిత్రాలు సరికొత్త హంగులతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి.

By:  Srikanth Kontham   |   26 Jun 2026 12:00 PM IST
పాత రికార్డులపై గురిపెట్టిన టాలీవుడ్ పార్ట్-2 చిత్రాలు!
X

ఇండియన్ సినిమా మార్కెట్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఫ్రాంచైజీల హవా నడుస్తోంది. ఒకప్పుడు కథ ముగిసిపోయాక దానికి కొనసాగింపుగా మరో సినిమా తీయడం చాలా అరుదుగా జరిగేది. కానీ ఇప్పుడు టాలీవుడ్ మేకర్స్ ఓ అడుగు ముందుకేసి మొదటి భాగంతో క్రియేట్ అయిన బ్రాండ్ ఇమేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు భారీ సీక్వెల్స్ - తదుపరి భాగాలను ప్లాన్ చేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద పాత రికార్డులను బద్దలు కొట్టడమే లక్ష్యంగా మోస్ట్ అవేటెడ్ పార్ట్-2 చిత్రాలు సరికొత్త హంగులతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి. ఈ సరికొత్త ట్రెండ్ ఇండస్ట్రీ బిజినెస్ రేంజ్‌ను మరో మెట్టు ఎక్కించింది.

ఈ సీక్వెల్స్ రేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన `పుష్ప 2: ది రూల్` సృష్టించిన బాక్సాఫీస్ సునామీ కళ్లముందే ఉంది. 1600 కోట్లకు పైగా అంతర్జాతీయ వసూళ్లను సాధించి, నేషనల్ అవార్డులతో పాటు ఎన్నో ప్రశంసలు దక్కించుకున్న చిత్రం టాలీవుడ్ సీక్వెల్స్ పవర్‌ను ప్రపంచానికి చాటి చెప్పింది. పుష్పరాజ్ గ్లోబల్ రైజ్ - అతని రూలింగ్ స్టైల్ నార్త్ నుంచి జపాన్ వరకు ప్రేక్షకులను ఊపేసింది. ఈ చిత్ర ఘనవిజయంతో టాలీవుడ్‌లో రాబోయే ఇతర భారీ ఫ్రాంచైజీ చిత్రాలపై అంచనాలు - ట్రేడ్ బిజినెస్ వాల్యూ స్కై-హై రేంజ్‌కి చేరుకున్నాయి.

ఇదే ఊపుతో టాలీవుడ్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి వస్తున్న `జై హనుమాన్` చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. `హను-మాన్` సాధించిన అనూహ్యమైన బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత పార్ట్-2 ప్రాజెక్ట్‌ను మరింత లార్జర్ స్కేల్‌లో ప్లాన్ చేశారు. ఇందులో లీడ్ రోల్ లో `కాంతార` ఫేమ్ రిషబ్ శెట్టిని రంగంలోకి దించడం, రానా దగ్గుబాటి వంటి క్రేజీ స్టార్స్ తోడవ్వడం సీక్వెల్‌కు నేషనల్ వైడ్‌గా విపరీతమైన హైప్ తెచ్చిపెట్టింది. పౌరాణిక అంశాలకు మోడరన్ విఎఫ్ఎక్స్ జోడించి సరికొత్త విజువల్ వండర్‌గా దీనిని తీర్చిదిద్దుతున్నారు.

అలాగే నార్త్ ఇండియా మార్కెట్‌ను సైతం షేక్ చేయడానికి సిద్ధమవుతున్న మరో క్రేజీ సీక్వెల్ `కార్తికేయ 3`. నిఖిల్-చందు మొండేటి కాంబినేషన్‌లో వచ్చిన పార్ట్-2 హిందీ బెల్ట్‌లో ఎలాంటి మిరాకిల్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఆ సెంటిమెంట్ - మిస్టరీ అడ్వెంచర్ ఎలిమెంట్స్ మరింత స్ట్రాంగ్‌గా ఉండేలా `కార్తికేయ 3` స్క్రిప్ట్‌ను డిజైన్ చేస్తున్నారు. కమర్షియల్ హంగుల కోసమే కాకుండా కంటెంట్‌ను నమ్ముకుని వస్తున్న ఇలాంటి చిత్రాలు హిందీ సౌత్ బెల్ట్ ప్రేక్షకులకు పక్కా థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను ప్రామిస్ చేస్తున్నాయి.

ఒక సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ రావడం అనేది బిజినెస్ పరంగా సేఫ్ జోన్. మొదటి భాగానికి వచ్చిన క్రేజ్ వల్ల థియేట్రికల్ ఓపెనింగ్స్ రికార్డ్ స్థాయిలో రావడం ఖాయం. అటు డిజిటల్, శాటిలైట్ , ఆడియో రైట్స్ కూడా భారీ ధరలకు అమ్ముడవుతాయి. అయితే దీని వెనుక అంతే రిస్క్ కూడా ఉంది. మొదటి భాగంతో పోల్చితే పార్ట్-2 లో యాక్షన్, డ్రామా , మేకింగ్ వాల్యూస్ డబుల్ ఉండాలి. చిన్న తేడా వచ్చినా ప్రేక్షకుల అంచనాలు అందుకోవడం కష్టంగా మారుతుంది. అందుకే ప్రొడ్యూసర్లు బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు.

టాలీవుడ్‌లో నడుస్తున్న ఈ సీక్వెల్స్ సీజన్ కలెక్షన్ల కోసమే కాకుండా తెలుగు సినిమా పరిధిని మరింత విస్తృతం చేయడానికి ఉపయోగపడుతోంది. రాబోయే రోజుల్లో `సలార్ 2` , `క‌ల్కి 2`, ‘దేవర 2’ వంటి భారీ చిత్రాలు కూడా లైన్‌లో ఉన్నాయి. పాత రికార్డులను తిరగరాస్తూ బాక్సాఫీస్ వద్ద సరికొత్త మైలురాళ్లను నెలకొల్పడానికి మేకర్స్ చూపుతున్న కసి టాలీవుడ్ స్థాయిని గ్లోబల్ లెవెల్‌కు తీసుకెళ్తోంది. ఫ్రాంచైజీల రూపంలో వస్తున్న ఈ మోస్ట్ అవేటెడ్ పార్ట్-2 చిత్రాలు థియేటర్లలో ఏ రేంజ్ విధ్వంసం సృష్టిస్తాయో చూడాలి.