భారతీయ సినిమా హాలీవుడ్‌తో ఆ గ్యాప్‌ని పూడుస్తోంది: ప్రియాంక చోప్రా
ఈ సందర్భంగా పరిశ్రమలో వచ్చిన మార్పును వివరిస్తూ `అబ్సెషన్` అనే లో-బడ్జెట్ హారర్ ఫిల్మ్ సాధించిన విజయాన్ని ప్రియాంక ఉదాహరణగా చూపారు.
By: Sivaji Kontham | 26 Jun 2026 4:00 AM IST``భారతీయ సినిమా ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందలేదు. కానీ ఇప్పుడు హాలీవుడ్‌తో గ్యాప్‌ని పూడుస్తోంది`` అని అన్నారు ప్రియాంక చోప్రా. అంతర్జాతీయ వేదికలపై నిరంతరం భారతీయ సినిమా ఖ్యాతిని చాటుతున్న ప్రియాంక చోప్రా.. ఇటీవల ఫ్రాన్స్‌లో జరిగిన ప్రతిష్టాత్మక `కేన్స్ లయన్స్` కాన్ఫరెన్స్‌లో ప్రసంగిస్తూ, వినోద పరిశ్రమలో వస్తున్న విప్లవాత్మక మార్పులపై స్పందించారు.
ఒకప్పుడు హాలీవుడ్‌తో పోలిస్తే భారతీయ సినిమాకు అంతర్జాతీయంగా గుర్తింపు తక్కువగా ఉండేదని.. కానీ ఇప్పుడు ఆ గ్యాప్‌ను మన సినిమాలు విజయవంతంగా అధిగమిస్తున్నాయని పీసీ పేర్కొన్నారు. సాంకేతికత, డిజిటల్ వేదికలు పెరిగాయి గనుక బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా కేవలం ప్రతిభ, సరికొత్త ఆలోచనలు ఉన్న క్రియేటర్లకు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన అవకాశాలు లభిస్తున్నాయని అన్నారు.
ఈ సందర్భంగా పరిశ్రమలో వచ్చిన మార్పును వివరిస్తూ `అబ్సెషన్` అనే లో-బడ్జెట్ హారర్ ఫిల్మ్ సాధించిన విజయాన్ని ప్రియాంక ఉదాహరణగా చూపారు. ఎవరికైనా ఒక మంచి ఆలోచన వస్తే దానిని చిత్రీకరించి యూట్యూబ్ లో పెడితే అది `అబ్సెషన్` రేంజులో గ్లోబల్ గా సక్సెసవ్వొచ్చు.. వినోదరంగంలో ఇది ఒక సువర్ణావకాశం.. ఎందుకంటే ఇక్కడ మీ ఆలోచనలే మీ పెట్టుబడి!! అని పీసీ వ్యాఖ్యానించారు. ఒకప్పుడు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టాలంటే ఇండస్ట్రీ కనెక్షన్లు, స్టూడియోల చుట్టూ తిరగడం లేదా నెట్‌వర్కింగ్ అవసరమయ్యేదని... కానీ నేడు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు చిన్న స్వతంత్ర ప్రాజెక్టులను సైతం అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తున్నాయని ప్రియాంక వివరించారు.
సినిమా పరిశ్రమలో ఎలాంటి గాడ్‌ఫాదర్ లేదా రోడ్‌మ్యాప్ లేకుండా అడుగుపెట్టడం ఎంత కష్టమో ప్రియాంకకు బాగా తెలుసు. మా తల్లిదండ్రులు ఇద్దరూ డాక్టర్లు.. కాబట్టి మా కుటుంబంలో ఎవరికీ సినిమాల్లో ఎలా ముందుకు వెళ్లాలో తెలియదు అని ఆమె తన గతాన్ని గుర్తుచేసుకున్నారు. తను కెరీర్ ప్రారంభించిన రోజుల్లో సినిమా రంగం చాలా పరిమితంగా కొత్తవారికి అంత సులభంగా అందుబాటులో లేని విధంగా ఉండేదని చెప్పారు. అలాగే భారతీయ సినిమాలు ఇంగ్లీష్ భాషలో ఉండవు కాబట్టి (అవి హిందీ, తెలుగు, మరాఠీ లేదా మరేదైనా కావచ్చు).. అవి హాలీవుడ్ చిత్రాల తరహాలో గ్లోబల్ గుర్తింపును ఎప్పటికీ సాధించలేవని కెరీర్ ఆరంభంలో తనతో చాలామంది అన్నారని.. కానీ నేటి గ్లోబల్ ఆడియన్స్ ఆ అంచనాలను తలకిందులు చేస్తూ విభిన్న సంస్కృతుల చిత్రాలను ఆదరిస్తున్నారని వ్యాఖ్యానించారు.
హాలీవుడ్ కెరీర్‌లో వైవిధ్యం లేదు!
అయితే తన హాలీవుడ్ కెరీర్‌పై ప్రియాంకా చోప్రా కొంత అసంతృప్తిని... నిజాయితీగా మాట్లాడారు. తాను బాలీవుడ్‌లో సాధించిన విజయాలతో పోలిస్తే హాలీవుడ్‌లో సాధించాల్సింది ఇంకా చాలా ఉందని అభిప్రాయపడ్డారు. హిందీ చిత్రసీమలో ఉత్తమమైన దర్శకనిర్మాతలు, నటులతో కలిసి పని చేసాను. వెరైటీ జానర్లలో ప్రయత్నించాను. కానీ అమెరికాలో నా ఇంగ్లీష్ ప్రాజెక్టుల విషయానికి వస్తే నేను ఆ స్థాయిలో వైవిధ్యాన్ని ఇంకా చూపించలేకపోయాను! అని ప్రియాంక ఓపెన్‌గా చెప్పారు.
ప్రస్తుతం తన హాలీవుడ్ కెరీర్‌లో ఎదుగుదల, పునరాగమనం పై దృష్టి పెట్టినట్లు ప్రియాంక తెలిపారు. ఇప్పటికే సిటాడెల్, హెడ్స్ ఆఫ్ స్టేట్ వంటి అంతర్జాతీయ ప్రాజెక్టుల ద్వారా గ్లోబల్ ఆడియన్స్‌కు దగ్గరైన పీసీ ఇకపై హాలీవుడ్ లోనూ మరింత వైవిధ్యమైన కథలు, పాత్రలు చేయాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు.
అలాగే పేరెంట్ అయ్యాక జీవితం మారిందని.. ఇటీవల కథలను చాలా ఆలోచించి ఎంచుకుంటున్నానని తెలిపారు. నా వర్కింగ్ లైఫ్ - పర్సనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేసుకునేందుకు ట్రావెలింగ్‌ను కూడా తగ్గించుకున్నాను! అని ప్రియాంక వెల్లడించారు. భవిష్యత్తు కేవలం బలమైన ఆలోచనలు, ప్రతిభ ఉన్న క్రియేటర్లదేనని పీసీ ఈ సందర్భంగా సందేశమిచ్చారు. ప్రియాంక చోప్రా ప్రస్తుతం రాజమౌళి- మహేష్ కాంబినేషన్ లోని `వారణాసి` చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను హాలీవుడ్ రేంజులో ప్రపంచ దేశాలలో విడుదల చేసేందుకు దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.
