Begin typing your search above and press return to search.

అభిమానంలో కాలం తెచ్చిన మార్పు!

ఒకప్పటి తరం చూపించిన నిశ్శబ్దమైన, నిస్వార్థమైన ఆరాధనా భావానికి నేటి ఆధునిక యువత చూపిస్తున్న సోషల్ మీడియా డిజిటల్ క్రేజ్‌కు మధ్య స్పష్టమైన వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి.

By:  Srikanth Kontham   |   4 Sept 2026 4:00 PM IST
అభిమానంలో కాలం తెచ్చిన మార్పు!
X

భారతీయ చిత్రసీమలో కథానాయకులపై ప్రేక్షకులకు ఉండే అభిమానం ఎప్పటికీ చెరిగిపోని ఓ అద్భుతమైన భావోద్వేగం. అయితే కాలంతో పాటు సమాజంలో వచ్చిన సాంకేతిక .. సాంస్కృతిక మార్పులు హీరోలపై ఉండే అభిమాన స్వరూపాన్ని కూడా గణనీయంగా మార్చేస్తున్నాయి. ఒకప్పటి తరం చూపించిన నిశ్శబ్దమైన, నిస్వార్థమైన ఆరాధనా భావానికి నేటి ఆధునిక యువత చూపిస్తున్న సోషల్ మీడియా డిజిటల్ క్రేజ్‌కు మధ్య స్పష్టమైన వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి.

గతంలో కథానాయకుడిపై అభిమానం అనేది పవిత్రమైన ఆరాధనగా క‌నిపించేది. సినిమా విడుదలైన రోజున థియేటర్ల వద్ద కటౌట్లకు పాలాభిషేకాలు చేయడం, పూలదండలు వేయడం, బ్యానర్లు కట్టడం వంటి ప్రత్యక్ష వేడుకలకే పరిమితమయ్యేది. అభిమానులు తమ అభిమాన కథానాయకుడి చిత్రాన్ని చూడటానికి మైళ్ల దూరం నడిచి వెళ్లడానికి .. రోజుల తరబడి నిద్రలేకుండా వేచి ఉండటానికి కూడా వెనుకాడేవారు కాదు. ఆ అభిమానంలో ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేని స్వచ్ఛమైన భావోద్వేగం, వ్యక్తిగత అనుబంధం కొట్టొచ్చినట్లు కనిపించేవి.

నేటి జెన్-జీ ..డిజిటల్ యుగంలో అభిమానం స్వరూపం పూర్తిగా సోషల్ మీడియా చుట్టూ తిరుగుతోంది. ఇప్పటి యువత అభిమానాన్ని చూపించడానికి ఎక్స్ (ట్విట్టర్), ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లను వేదికగా చేసుకుంటున్నారు. ట్రెండింగ్ సాధించడం, వ్యూస్ , లైక్స్ పెంచడం, హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్స్ నడపడం ద్వారా తమ హీరో పవర్ ఏంటో చూపించాలని తాపత్రయపడుతున్నారు. క్లబ్‌లు, సంఘాల కంటే కూడా డిజిటల్ ఫ్యాన్ పేజీలు, ఆన్‌లైన్ ఆర్మీలే నేడు అభిమానానికి ప్రధాన కేంద్రాలుగా మారాయి.

గతంలో ఫ్యాన్ వార్స్ లేదా అభిమానుల మధ్య ఘర్షణలు కేవలం సినిమా థియేటర్ల ఆవరణకే పరిమితమై చాలా అరుదుగా జరిగేవి. కానీ నేటి ఆన్‌లైన్ యుగంలో ఈ పోటీ సరికొత్త రూపం దాల్చింది. డిజిటల్ వేదికలపై కామెంట్ సెక్షన్లలో ఒకరినొకరు ట్రోల్ చేసుకోవడం, వ్యక్తిగత విమర్శలు చేసుకోవడం, బాక్సాఫీస్ రికార్డుల పేరుతో నిరంతరం వాదించుకోవడం సర్వసాధారణమైంది. అభిమానం పేరుతో జరుగుతున్న సైబర్ వార్స్ ఒక్కోసారి తీవ్ర స్థాయికి చేరి ఆరోగ్యకరమైన సినిమా వాతావరణాన్ని దెబ్బతీస్తున్నాయి.

ఒకప్పుడు అభిమానులకు కథానాయకుడి గురించి సమాచారం దొరకడమే కష్టంగా ఉండేది. పోస్టర్లు, పత్రికలు లేదా అరుదుగా వచ్చే ఇంటర్వ్యూల ద్వారానే సమాచారం తెలిసేది. దానివల్ల హీరోల చుట్టూ ఒకరకమైన మాయాజాలం ఉండేది. కానీ నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా పుణ్యమా? అని హీరోల వ్యక్తిగత జీవితం, వర్కౌట్లు, ప్రయాణాలు, షూటింగ్ అప్‌డేట్స్ అన్నీ నిమిషాల్లో అందుబాటులోకి వస్తున్నాయి. ఈ విపరీతమైన సమాచార లభ్యత వల్ల హీరోలకు, అభిమానులకు మధ్య దూరం తగ్గి క్లోజ్‌నెస్‌ పెరిగినప్పటికీ నాటి మాయాజాలం.. నిరీక్షణలోని మజా కొంత వరకు తగ్గిందనే చెప్పాలి.

కాలం మారినా? మాధ్యమాలు మారినా ? హీరోలపై అభిమానులకు ఉండే ప్రేమ మాత్రం మారలేదు. నిన్నటి తరం అభిమానం భౌతిక రూపంలో,సంప్రదాయబద్ధంగా సాగితే.. నేటి తరం అభిమానం డిజిటల్ రూపంలో, గ్లోబల్ రీచ్ సాధించేలా సాగుతోంది. సాంకేతికత అందిస్తున్న సౌకర్యాలను వాడుకుంటూనే ఆన్‌లైన్ ట్రోలింగ్‌కు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన రీతిలో సినిమాను, కథానాయకులను ఆస్వాదించినప్పుడే అభిమానానికి నిజమైన సార్థకత చేకూరుతుందన్న‌ది కాద‌న‌లేని నిజం.