Begin typing your search above and press return to search.

రూ.1000 కోట్ల క్లబ్.. నెక్స్ట్ ఎంట్రీ ఏ సినిమాదో?

ఒకప్పుడు అరుదుగా కనిపించిన రూ.1000 కోట్ల వసూళ్ల మార్క్‌ ఇప్పుడు ప్రతి ఏడాది ఒకటి రెండు సినిమాలు దాటేస్తుండడంతో అది ఓ ట్రెండ్‌ గా మారుతోంది.

By:  M Prashanth   |   29 Dec 2025 11:12 AM IST
రూ.1000 కోట్ల క్లబ్.. నెక్స్ట్ ఎంట్రీ ఏ సినిమాదో?
X

ఇండియన్ బాక్సాఫీస్‌ ఇప్పుడు కొత్త స్థాయికి చేరుతోందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. ఒకప్పుడు అరుదుగా కనిపించిన రూ.1000 కోట్ల వసూళ్ల మార్క్‌ ఇప్పుడు ప్రతి ఏడాది ఒకటి రెండు సినిమాలు దాటేస్తుండడంతో అది ఓ ట్రెండ్‌ గా మారుతోంది. గ్లోబల్‌ బాక్సాఫీస్‌ లో ఇండియన్‌ సినిమాలకు పెరుగుతున్న ఆదరణకు అది క్లియర్ ఎగ్జాంపుల్ గా నిలుస్తోంది.

భారీ బడ్జెట్‌, పాన్‌ ఇండియా రేంజ్ రిలీజ్, స్ట్రాంగ్ కంటెంట్ ఉంటే రూ.1000 కోట్ల క్లబ్‌ ఇక అసాధ్యం కాదని వివిధ సినిమాలు నిరూపిస్తూనే ఉన్నాయి. 2017లో అమీర్ ఖాన్ దంగల్‌, ప్రభాస్ బాహుబలి 2 సినిమాలతో ఆ ట్రెండ్‌ మొదలైంది. ఆ తర్వాత కొన్నేళ్ల గ్యాప్‌ వచ్చినా.. మళ్లీ రీస్టార్ట్ అయింది.

2022లో కేజీఎఫ్‌ 2, ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలు మరోసారి ఇండియన్‌ బాక్సాఫీస్‌ సత్తా ఏంటో ప్రపంచానికి చూపించాయి. భారీ యాక్షన్‌, భావోద్వేగాలు, రిపీట్‌ వాల్యూ ఉన్న కంటెంట్‌ ఉంటే ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తుతారని ఆ రెండు సినిమాలు రుజువు చేశాయి. భారీ వసూళ్లు సాధించి ఓ రేంజ్ లో అదరగొట్టాయి.

2023లో షారుఖ్ ఖాన్‌ పఠాన్‌, జవాన్‌ చిత్రాలు బాలీవుడ్‌ కు కొత్త ఊపిరి పోశాయి. రెండూ రూ.1000 కోట్ల మార్క్‌ దాటి బ్లాక్‌ బస్టర్లుగా నిలిచాయి. 2024లో ఆ జాబితాలోకి ప్రభాస్‌ కల్కి 2898 ఏడీ, అల్లు అర్జున్‌ పుష్ప 2 చేరాయి. 2025లో అయితే ఊహించని విధంగా ధురంధర్‌ ఈ క్లబ్‌ లో చేరి అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఇప్పుడు అందరి దృష్టి 2026పై పడింది. వచ్చే ఏడాదిలో ఏఏ సినిమాలు రూ.1000 కోట్ల క్లబ్‌ లోకి ఎంట్రీ ఇస్తాయోనని అంతా డిస్కస్ చేసుకుంటున్నారు. ఆ రేసులో ఫస్ట్ ఉన్న మూవీ స్పిరిట్‌. ప్రభాస్‌ - సందీప్‌ రెడ్డి వంగా కాంబినేషన్‌ కావడంతో అన్ని భాషల్లో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కంటెంట్‌ స్ట్రాంగ్ గా ఉంటే, మాస్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటే ఈ సినిమా రికార్డులు తిరగరాయడం ఖాయమనే అభిప్రాయం వినిపిస్తోంది.

స్పిరిట్ తర్వాత స్ట్రాంగ్ కంటెండర్‌ గా బాలీవుడ్ నుంచి రామాయణ పార్ట్‌ వన్‌ నిలుస్తోంది. పురాణ కథలకు దేశవ్యాప్తంగా, విదేశాల్లోనూ విశేష ప్రేక్షకాదరణ ఉంది. విజువల్స్‌, స్టోరీ సరిగ్గా కుదిరితే ఇండియాతోపాటు ఓవర్సీస్‌ మార్కెట్లలోనూ సినిమా ప్రభంజనం సృష్టించే అవకాశముంది. ఇప్పటికే మూవీపై ఆడియన్స్ లో ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి.

స్పిరిట్, రామాయణతోపాటు టైగర్ వర్సెస్ పఠాన్‌ మూవీ కూడా ఈ లిస్ట్‌ లో కీలకంగా ఉంది.

బాలీవుడ్‌ స్టార్ హీరోలు సల్మాన్‌ ఖాన్‌, షారుఖ్‌ ఖాన్‌ కలిసి చేస్తుండడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఓపెనింగ్స్‌ విషయంలో ఎలాంటి సందేహం లేకున్నా.. కంటెంట్‌ బాగుంటే లాంగ్ రన్ లో రూ.1000 కోట్ల మార్క్‌ దాటడం సాధ్యమే. కాబట్టి మొత్తంగా చూస్తే 2026లో ఎన్ని సినిమాలు.. ఏ ఏ సినిమాలు రూ.1000 కోట్ల క్లబ్‌ లో చేరనున్నాయో వేచి చూడాలి.