టాప్ స్టోరి: ఎక్కువ ప్లాపులిచ్చిన టాప్-10 ఇండియన్ హీరోలు!
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఒక నటుడి విజయాన్ని కేవలం వారి హిట్ల ఆధారంగానే కాకుండా.. వారు చేసిన సినిమాల సంఖ్య ఆధారంగా కూడా అంచనా వేస్తుంటారు.
By: Sivaji Kontham | 17 May 2026 5:00 AM ISTభారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఒక నటుడి విజయాన్ని కేవలం వారి హిట్ల ఆధారంగానే కాకుండా.. వారు చేసిన సినిమాల సంఖ్య ఆధారంగా కూడా అంచనా వేస్తుంటారు. ఇండస్ట్రీలో దశాబ్దాల పాటు కెరీర్‌ను కొనసాగించి వందలాది చిత్రాలలో నటించిన అగ్ర హీరోల ఖాతాలో సహజంగానే ప్లాపుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. బాక్సాఫీస్ చరిత్రను పరిశీలిస్తే.. అత్యధిక ప్లాపులు సాధించిన నటుల జాబితాలో బాలీవుడ్ లెజెండ్ మిథున్ చక్రవర్తి ఏకంగా 180 ప్లాపులతో మొదటి స్థానంలో ఉన్నారు. ఆయన 1976లో `మృగయా` చిత్రంతో కెరీర్ ప్రారంభించి, దాదాపు ఐదు దశాబ్దాల ప్రస్థానంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేశారు. ఆయన కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రం `డిస్కో డ్యాన్సర్` (1982). ఈ సినిమా సృష్టించిన ప్రభావం అంతా ఇంతా కాదు.. ఇది భారతీయ సినిమా స్థాయిని అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో ఉన్న జీతేంద్ర 106 ఫ్లాపులతో రెండో స్థానంలో ఉండగా, ధర్మేంద్ర 99 ఫ్లాపులతో మూడో స్థానంలో ఉన్నారు. 1960ల కాలంలో పరిశ్రమలోకి అడుగుపెట్టిన వీరు నాలుగు దశాబ్దాలకు పైగా స్టార్ హీరోలుగా వెలిగారు. జీతేంద్ర నటించిన హిమ్మత్‌వాలా (1983) ఆయన కెరీర్‌లో ఒక పెద్ద కమర్షియల్ బ్లాక్‌బస్టర్‌గా నిలవడమే కాకుండా హిందీ ఇండస్ట్రీలో సౌత్ ఇండియన్ మసాలా చిత్రాల ట్రెండ్‌కు కీలక మలుపుగా మారింది. అలాగే మాచో మ్యాన్ ధర్మేంద్ర కెరీర్‌లో `షోలే` (1975) చిత్రం భారతీయ చలనచిత్ర చరిత్రలోనే ఆల్‌టైమ్ క్లాసిక్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఎక్కువ సినిమాలు చేయడం వల్లే వీరికి ఈ స్థాయిలో ప్లాపులు వచ్చాయనేది వాస్తవం.
నేటి తరం స్టార్లలో అక్షయ్ కుమార్.. కామెడీ కింగ్ గోవిందా!
ఈ తరం నటుల్లో అత్యధిక ప్లాపులు ఉన్న హీరోగా బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ 80 ప్లాపులతో నాలుగో స్థానంలో నిలిచారు. 1991లో `సౌగంధ్` చిత్రంతో హీరోగా ప్రస్థానం ప్రారంభించిన అక్షయ్ గత మూడున్నర దశాబ్దాలుగా ఏడాదికి మూడు నుండి నాలుగు సినిమాలు చేస్తూ అత్యంత వేగంగా సినిమాలు పూర్తి చేసే హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన కెరీర్‌కు `ఖిలాడీ` (1992) చిత్రం పెద్ద టర్నింగ్ పాయింట్ కాగా, ఆ తర్వాత వచ్చిన రౌడీ రాథోర్, 2.0 వంటి చిత్రాలు భారీ బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి. మరోవైపు తనదైన డాన్సులు, అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో 90ల కాలాన్ని ఊపేసిన గోవిందా 75 ప్లాపులతో ఐదో స్థానంలో ఉన్నారు. 1986లో `ఇల్జామ్` సినిమాతో ఎంట్రీ ఇచ్చిన గోవిందా కెరీర్‌లో కూలీ నెం. 1, హీరో నెం. 1 వంటి చిత్రాలు కల్ట్ బ్లాక్‌బస్టర్లుగా నిలిచి ఆయనను కామెడీ కింగ్‌గా నిలబెట్టాయి.
ఇక ఆరో స్థానంలో ఉన్న సంజూ బాబా సంజయ్ దత్ ఖాతాలో 70 ప్లాపులు ఉన్నాయి. 1981లో వచ్చిన `రాకీ` చిత్రంతో రొమాంటిక్ హీరోగా కెరీర్ ప్రారంభించిన సంజయ్ దత్ జీవితం ఎన్నో ఒడిదుడుకులతో సాగింది. ఆయన కెరీర్‌ను అద్భుతమైన మలుపు తిప్పిన చిత్రం `ఖల్ నాయక్` (1993). ఆ తర్వాత వచ్చిన `మున్నాభాయ్ ఎంబీబీఎస్` సిరీస్ ఆయన కెరీర్‌లోనే అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచి.. ఆయన ఇమేజ్‌ను పూర్తిగా మార్చేసింది. అలాగే ఏడో స్థానంలో ఉన్న చాక్లెట్ బాయ్ రిషి కపూర్ 1973లో `బాబీ` చిత్రంతో హీరోగా సంచలన కెరీర్ ప్రారంభించి దాదాపు నాలుగు దశాబ్దాల ప్రస్థానంలో 65 ప్లాపులను చూశారు. `బాబీ`.. `చాందిని` వంటి చిత్రాలు ఆయన కెరీర్‌లో మైలురాళ్ళుగా నిలిచాయి.
చివరిగా బాలీవుడ్ మొట్టమొదటి సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా 60 ప్లాపులతో ఎనిమిదో స్థానంలో నిలిచారు. 1966లో `ఆఖ్రీ ఖత్` చిత్రంతో కెరీర్ ప్రారంభించిన ఆయన 1969 నుండి 1971 మధ్య వరుసగా 15 బ్యాక్-టు-బ్యాక్ సోలో హిట్లు ఇచ్చి భారతీయ సినిమా చరిత్రలోనే ఎవరికీ సాధ్యంకాని రికార్డు సృష్టించారు. ఆయన కెరీర్‌లో `ఆరాధన` (1969), `ఆనంద్` (1971) చిత్రాలు క్లాసిక్ బ్లాక్‌బస్టర్లుగా నిలిచి ఆయన స్టార్‌డమ్‌ను తారాస్థాయికి చేర్చాయి.
అయితే ఈ లెక్కలు చూస్తే ఒక విషయం స్పష్టమవుతుంది.. ప్లాపుల సంఖ్య అనేది వారి వైఫల్యాన్ని కాదు.. దశాబ్దాల పాటు పరిశ్రమలో వారు చూపిన పట్టుదలను, అజేయంగా కొనసాగించిన సుదీర్ఘ ప్రయాణాన్ని సూచిస్తుంది. ఇంకా పలువురు హీరోలు 40కి పైగా ఫ్లాపులతో కెరీర్ ని రన్ చేయడం గమనించదగినది.
