'భారతీయుడు 3' వస్తోంది.. చూస్తారా చూడరా? సోషల్ మీడియాలో బిగ్ డిబేట్!
అయితే ఒక ప్లాప్ సినిమాకి సీక్వెల్‌గా వస్తున్న ఈ మూడో భాగాన్ని చూడటానికి ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా లేదా అన్నది ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చగా మారింది.
By: Sivaji Kontham | 11 Sept 2026 7:30 AM ISTఅగ్ర దర్శకుడు శంకర్- విశ్వనటుడు కమల్ హాసన్ కాంబినేషన్‌లో వచ్చిన భారతీయుడు 2 (ఇండియన్ 2) బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచినా.. ఇంకా శంకర్ కి `ఇండియన్ 3` ఆశలు సజీవంగానే ఉన్నాయి. అందుకే ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి సిద్ధమవుతున్నారని సమాచారం. శంకర్ సర్వం సిద్ధం చేస్తే, కమల్ హాసన్ కూడా ఈ సినిమా కోసం పూర్తి సహకారం అందిస్తానని మాట ఇచ్చారట. నిజానికి అసలు కథ, భావోద్వేగాలు మొత్తం `ఇండియన్ 3`లోనే ఉంటాయని శంకర్ టీమ్ చెబుతోంది. అయితే ఒక ప్లాప్ సినిమాకి సీక్వెల్‌గా వస్తున్న ఈ మూడో భాగాన్ని చూడటానికి ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా లేదా అన్నది ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చగా మారింది.
ఈ క్రమంలోనే సోషల్ మీడియాల్లో నెటిజన్లు ఈ సీక్వెల్ ప్రకటనలపై తమదైన శైలిలో వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. ఈ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా తేడాలేకుండా ఎలాగైనా `ఇండియన్ 4` కూడా తీసేస్తారంటూ ఒక నెటిజన్ భారీ సెటైర్ వేశారు. దానికి తోడు.. అంతా అయ్యాక టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ `దిల్ రాజు` (హార్ట్ కింగ్) అప్పుడే ఆ సినిమా హక్కులు కొనడానికి రెడీగా ఉంటారంటూ కామెంట్లు చేయడం విశేషం.
మామూలుగానే టాలీవుడ్‌లో ఇప్పుడు పార్ట్-2ల ట్రెండ్ నడుస్తోంది. ఇదే ఫ్లోలో పోతే `హరిహర వీరమల్లు 2`, `రాజాసాబ్ 2`, `ది కింగ్‌డమ్ 2` మాత్రమే కాకుండా చివరకు `గుంటూరు కారం 2` కూడా వచ్చేస్తే సరిపోతుందని అభిమానులు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఇక సినిమాల నిర్మాణ వ్యయం, బడ్జెట్లపై స్పందిస్తూ ``ఇంత మనీ ఉంటే మాకేదో సాయం చేయొచ్చు కదా .. ఇలాంటి సినిమాలు తీసి థియేటర్లలో మాపై విడుదల చేయకండి" అని ఫన్నీగా పోస్టులు పెడుతున్నారు.
అయితే అందరూ నెగెటివ్‌గా మాత్రమే స్పందించడం లేదు. `ఇండియన్ 3` పై కొంతమందిలో భిన్నాభిప్రాయాలు, ఆశలు కూడా ఉన్నాయి. `ఇండియన్ 2` సినిమా నిడివి ఎక్కువ అవ్వడం వల్లే బలవంతంగా రెండు భాగాలుగా విడదీశారని...అందుకే రెండో భాగం అంతగా ఆకట్టుకోలేదని కొందరు విశ్లేషిస్తున్నారు. కానీ `ఇండియన్ 3` టీజర్‌లో చూపించిన బ్రిటిష్ కాలం నాటి `రణబాలి` ఫ్లాష్‌బ్యాక్ కాన్సెప్ట్ - లుక్ చాలా బాగున్నాయని.. అందుకే ఈ సినిమాపై ఇంకా కొద్దిగా అంచనాలు ఉన్నాయని కొందరు ఫ్యాన్స్ పేర్కొంటున్నారు.
చివరికి `ఇండియన్ 3`ని ప్రేక్షకులు చూస్తారా చూడరా? అని పెద్ద డిబేట్ పెట్టినా.. దర్శకుడు శంకర్ మార్క్ టేకింగ్‌పై అతడి డై హార్డ్ ఫ్యాన్స్‌కు అంతో ఇంతో నమ్మకం ఇంకా ఉందనేది వాస్తవం. ఎందుకంటే చిత్ర పరిశ్రమలో ఎప్పుడు ఏ మ్యాజిక్ జరుగుతుందో.. ఏ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందో ఎవరూ ఊహించలేరు. మరి శంకర్-కమల్ హాసన్‌ల కాంబో ఈ మూడో భాగంతో అయినా గ్రాండ్ కంబ్యాక్ ఇస్తుందో లేదో వేచి చూడాల్సిందే!
