'భారతీయుడు 3' బిగ్ డిబేట్ : పెద్ద తెరపైనా? ఓటీటీలోనా?
లోకనాయకుడు కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన `భారతీయుడు 2` ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో మూడో భాగం రిలీజ్ డైలమాలో పడిన సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 15 Sept 2026 9:41 AM ISTలోకనాయకుడు కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన `భారతీయుడు 2` ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో మూడో భాగం రిలీజ్ డైలమాలో పడిన సంగతి తెలిసిందే. భారతీయుడు 3 రిలీజవుతుందా.. అవ్వదా? అనే దానిపై ప్రస్తుతం సినీ వర్గాల్లో పెద్ద డిబేట్ నడుస్తోంది. ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించి కేవలం 20 రోజుల పెండింగ్ షూటింగ్, ప్యాచ్ వర్క్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే నటీనటులు- సాంకేతిక నిపుణుల పెండింగ్ పారితోషికాల చెల్లింపులు లైకా ప్రొడక్షన్స్‌కు పెద్ద భారంగా మారినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ ఆర్థిక భారం కారణంగానే సినిమాను థియేట్రికల్‌గా విడుదల చేయడం.. మరింతగా ఖర్చు పెట్టడం దండగ అని నిర్మాణ సంస్థ భావిస్తున్నట్లు మీడియాలో కథనాలొస్తున్నాయి. అయితే `భారతీయుడు 2` కేవలం ఒక ఇంట్రడక్షన్ లాంటిదని.. అసలైన కథ. అసలు సిసలైన భావోద్వేగాలు అన్నీ `భారతీయుడు 3`లోనే ఉన్నాయని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ఈ చిత్రం గనుక థియేటర్లలోకి వస్తే బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టడం ఖాయమని వారు భావిస్తున్నారు. కానీ లైకా సంస్థ - శంకర్ ఈ ప్రాజెక్ట్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ప్రస్తుతం సస్పెన్స్‌గా మారింది.
ఈ సినిమా అసలు బలం అంతా స్వాతంత్య్ర సమరయోధుడి కాలం నాటి ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లోనే ఉండబోతోంది. శంకర్ గత చిత్రాల్లో చూపించిన విజువల్ గ్రాండియారిటీని- పీరియడ్ బ్యాక్‌డ్రాప్‌ను పెద్ద తెరపై చూస్తేనే అసలు సిసలైన అనుభూతి కలుగుతుంది. ఒకవేళ నిర్మాతలు వెనకడుగు వేసి దీనిని ఓటీటీలో విడుదల చేస్తే శంకర్ సినిమాలకు ఉండే భారీ రీచ్ దెబ్బతినే అవకాశం ఉంది. ఈ తాజా చిత్రానికి ఎలాంటి భారీ అంచనాల ఒత్తిడి లేదు కాబట్టి.. మునుపటి సినిమా లాగా కాకుండా ఇది ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
అయితే ఈ సినిమా ముందు కొన్ని భారీ సవాళ్లు కూడా లేకపోలేదు. ఒకవేళ పీరియడ్ ఫ్లాష్‌బ్యాక్ అద్భుతంగా వర్కౌట్ అయినా.. సినిమా మళ్లీ ఆధునిక కాలపు `భారతీయుడు 2` టైమ్‌లైన్‌కు రావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అదే రకమైన నెరేటివ్ ఫెటిగ్ పునరావృతమయ్యే ప్రమాదం ఉంది. శంకర్ గత చిత్రాల స్థాయికి తగిన బలమైన రైటింగ్ లోపించడం దీనికి ఒక పెద్ద రిస్క్. సుజాత, బాలకుమారన్ లాంటి దిగ్గజ రచయితల సహకారం లేకపోవడం వల్ల.. ప్రెజెంట్ డే సీన్స్ తేలిపోతే మొదటికే మోసం వచ్చే రిస్క్ కూడా లేకపోలేదు.
ఇన్ని అనుమానాలు, ఆర్థిక సందిగ్ధతలు ఉన్నప్పటికీ కమల్ హాసన్ ఈ ప్రాజెక్ట్ విషయంలో మొదటి నుంచీ పూర్తి నిబద్ధతతో ఉన్నారు. రెండు భాగాల సంయుక్త కథా బలంపై నమ్మకంతోనే ఆయన దీనికి ఒప్పుకున్నారు. కేవలం 20 రోజుల షూటింగ్ పూర్తి చేసి సరైన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగిస్తే ఈ సినిమా అంచనాలను తలకిందులు చేసే సత్తా ఉంది. శంకర్ - కమల్ కాంబో నుంచి వస్తున్న ఈ ఆఖరి ప్రయత్నం థియేటర్లలో అదరగొడుతుందా లేక ఓటీటీ బాట పడుతుందా అనేది వేచి చూడాలి. లోకనాయకుడే తలుచుకుని ఇన్వాల్వ్ అయి సమస్యను పరిష్కరించి రిలీజ్ చేయిస్తారేమో చూడాలి.
