Begin typing your search above and press return to search.

నవ్వుల వెనుక ఎఫ్‌ఐఆర్ల భయం!

ఒకప్పుడు వినోదం పంచే సాధనంగా ఉన్న హాస్యం ఇప్పుడు సామాజిక పరిశీలనకు, చట్టపరమైన ఇబ్బందులకు వేదికగా మారుతోంది.

By:  Srikanth Kontham   |   18 Jun 2026 5:00 AM IST
నవ్వుల వెనుక ఎఫ్‌ఐఆర్ల భయం!
X

స్టాండ్-అప్ కామెడీ రంగం కొన్నేళ్లుగా ఊహించని మార్పులకు లోనవుతోంది. ఒకప్పుడు వినోదం పంచే సాధనంగా ఉన్న హాస్యం ఇప్పుడు సామాజిక పరిశీలనకు, చట్టపరమైన ఇబ్బందులకు వేదికగా మారుతోంది. స్టేజ్ మీద హాస్యనటులు వేసే జోకులు నవ్వులకే పరిమితం కాకుండా వ్యంగ్యం పేరిట హద్దులు దాటినప్పుడు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. భావప్రకటన స్వేచ్ఛకు, సమాజ భావోద్వేగాలకు మధ్య ఉన్న సన్నని గీతను దాటిన ప్రతిసారీ హాస్యనటులు పోలీసు స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగాల్సిన ప‌రిస్థితులు అంత‌కంత‌కు పెరిగిపోతున్నాయి.

ఇటీవలి కాలంలో ఈ తరహా వివాదాల్లో చిక్కుకున్న తాజా ఉదాహరణగా ప్రణిత్ మోరే నిలిచారు. ఆయన తన షోలలో నిర్వహించిన `క్రౌడ్ వర్క్`కు సంబంధించిన క్లిప్‌లు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర దుమారం రేపాయి. ఒక క్లిప్‌లో మహిళల పట్ల అగౌరవంగా, స్త్రీద్వేషాన్ని ప్రతిబింబించేలా ఉన్న వ్యాఖ్యలు, మరో క్లిప్‌లో మృతదేహాల పరిమాణాలపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలు నెటిజన్ల ఆగ్రహానికి కారణమయ్యాయి. ఈ ఉదంతాన్ని తీవ్రంగా పరిగణించిన మహారాష్ట్ర సైబర్ పోలీసులు సదరు హాస్యనటుడితో పాటు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రేక్షకులపై కూడా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం హాస్య రంగంలో సరికొత్త చర్చకు దారితీసింది.

మరో ప్రముఖ హాస్యనటుడు సమయ్ రైనా డిజిటల్ షో `ఇండియాస్ గాట్ లేటెంట్` ద్వారా ప్రజాదరణ పొంది నప్పటికీ చట్టపరమైన ఇబ్బందుల నుండి తప్పించుకోలేకపోయారు. గత ఏడాది ఈ షోలో అతిథిగా వచ్చిన ఒక పోడ్‌కాస్టర్ చేసిన జోక్ దేశవ్యాప్తంగా పెద్ద వివాదంగా మారింది. దీంతో సమయ్ రైనా - ఆ అతిథిపై దేశంలోని ప్రాం తాల్లో పలు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. పరిస్థితులు చేయిదాటడంతో సమయ్ రైనా తన ఛానల్ నుండి సదరు ఎపిసోడ్‌లను తొలగించి బహిరంగ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఈ సంఘటన డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో కంటెంట్ సృష్టించేవారిపై ఉండే బాధ్యతను గుర్తుచేసింది.

హాస్యనటులు రాజకీయ, మతపరమైన అంశాలను ముడిపెట్టినప్పుడు వివాదాల తీవ్రత మరింత పెరుగుతోంది. కునాల్ కమ్రా మహారాష్ట్ర రాజకీయ పరిస్థితులను .. ముఖ్య నేతలను లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యంగ్య వ్యాఖ్యలపై శివసేన ఎమ్మెల్యే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడమే కాకుండా ఆయన షో జరిగిన వేదికపై దాడి కూడా జరిగింది. గతంలో మునావర్ ఫారుఖీ హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్టు చేయడంతో నెల రోజులకు పైగా జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ఈ పరిణామాలు హాస్యంలో ఉండే రాజకీయ, మతపరమైన పరిమితులను స్పష్టం చేస్తున్నాయి.

భారతీయ కామెడీ రంగంలో ఇలాంటి వివాదాలు ఈనాటివి కావు. గతంలో తన్మయ్ భట్ ..ఆయన బృందం సెలబ్రిటీలను ఉద్దేశించి చేసిన ఘాటైన రోస్ట్ షో తీవ్ర విమర్శలపాలై, వారి గ్రూప్ రద్దు కావడానికి దారితీసింది. వ్యక్తిగతంగా కూడా ప్రధానమంత్రిపై వేసిన మీమ్స్ కారణంగా తన్మయ్ భట్ ఎఫ్‌ఐఆర్‌లను ఎదుర్కొన్నారు. అలాగే మధుర్ విర్లి, ఐశ్వర్య మోహన్‌రాజ్ వంటి ఇతర హాస్యనటులు కూడా అత్యాచారాలు ..సున్నితమైన శారీరక విషయాలపై జోకులు వేసి ఆన్‌లైన్ నిరసనలను, నెటిజన్ల ఆగ్రహాన్ని ఎదుర్కొని క్షమాపణలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి.