Begin typing your search above and press return to search.

మీ ఇంట్లో ఎన్నిగ‌దులున్నాయి?: జ‌న‌గ‌ణ‌న‌లో చిత్రాలు తెలుసా?

దేశ‌వ్యాప్తంగా జ‌న‌గ‌ణ‌న కార్య‌క్ర‌మం ఏప్రిల్ 1(బుధ‌వారం) నుంచి ప్రారంభం కానుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే.. కొంత మేర‌కు ఆల‌స్యంగా ప్రారంభం కానుంది.

By:  Garuda Media   |   1 April 2026 9:26 AM IST
మీ ఇంట్లో ఎన్నిగ‌దులున్నాయి?: జ‌న‌గ‌ణ‌న‌లో చిత్రాలు తెలుసా?
X

దేశ‌వ్యాప్తంగా జ‌న‌గ‌ణ‌న కార్య‌క్ర‌మం ఏప్రిల్ 1(బుధ‌వారం) నుంచి ప్రారంభం కానుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే.. కొంత మేర‌కు ఆల‌స్యంగా ప్రారంభం కానుంది. ఇది దేశానికి స్వాతంత్రం వ‌చ్చిన త‌ర్వాత చేప‌డుతున్న 16వ జ‌న‌గ‌ణ‌న‌. వాస్త‌వానికి జ‌న గ‌ణ‌న‌ను ప్ర‌తి ప‌దేళ్ల‌కు ఒక‌సారి చేప‌డ‌తారు. అయితే.. 2021లో క‌రోనా నేప‌థ్యంలో వాయిదా వేశారు. ఎట్ట‌కేల‌కు ఇప్పుడు జ‌న గ‌ణ‌న‌తోపాటు కుల గ‌ణ‌న కూడా చేప‌ట్ట‌నున్నారు. ఏపీలో ఏప్రిల్ 16 నుంచి తెలంగాణ‌లో 23వ తేదీ నుంచి జ‌న‌గ‌ణ‌న ప్రారంభంకానుంది. దేశ‌వ్యాప్తంగా జ‌రిగే ఈ గ‌ణ‌న కోసం.. కేంద్ర ప్ర‌భుత్వం.. 11,718 కోట్ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చే చేస్తోంది.

తొలిద‌శ‌లో..

జ‌న గ‌ణ‌న‌లో మొత్తం మూడు ద‌శ‌లు ఉన్నాయి.

1) గృహ గ‌ణ‌న‌.

2) జ‌న గ‌ణ‌న‌.

3) కుల గ‌ణ‌న‌(ఈసారి తొలిగా చేస్తున్నారు).

ఇప్పుడు తొలిద‌శ‌లో గృహ గ‌ణ‌ణ‌ను చేప‌ట్ట‌నున్నారు. ఇది అత్యంత కీల‌కంగా మార‌నుంది. ఎందుకంటే దేశంలో ఎంత మందికి సొంత ఇళ్లు ఉన్నాయి? ఎంత‌మంది ఇళ్లులేని వారు ఉన్నారు? అంతేకాదు.. ఏయే త‌ర‌హా ఇళ్లు ఉన్నాయి? ఇంట్లో బాత్ రూమ్‌, లెట్రిన్ సౌక‌ర్యం ఉందా? లేదా? వాహ‌నాలు ఎన్ని ఉన్నాయి..? ఇలా అనేక అంశాల‌ను తెలుసుకుంటారు. త‌ద్వారా ప్ర‌భుత్వాలు అమ‌లు చేసే సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను భ‌విష్య‌త్తులో ఇవి నిర్దేశించ‌నున్నాయ‌ని అంటున్నారు.

మొత్తం 33 ప్ర‌శ్న‌లు..

తొలి ద‌శ‌లో చేపడుతున్న గ‌ణ‌న‌లో మొత్తం 33 ప్ర‌శ్న‌లు సంధిస్తారు. వీటిలో ఇంట్లో ఎన్ని గ‌దులు ఉన్నాయి? వాటికి ఎన్ని బాత్‌రూమ్‌లు ఉన్నాయ‌న్న ప్ర‌శ్న‌లు కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు..ఇంటి గచ్చు మట్టితో నిర్మించారా? కాంక్రీట్, పెంకులు, టైల్స్, రాయి, కలపతో నిర్మించారా? అనేది ప్ర‌శ్నిస్తారు. ఇంటి గోడలకు వినియోగించిన సామ‌గ్రిని తెలుసుకుంటారు.

ఇంటి పైకప్పు గడ్డితోనా, ఇటుకలతోనా, రేకులతోనా, సిమెంట్, కాంక్రీట్‌తో నిర్మించారా? ప్ర‌శ్నిస్తారు. ఇక‌, కుటుంబ స‌భ్యుల సంఖ్యతోపాటు వారి వైవాహిక సంబంధాలు తెలుసుకుంటారు. స‌హ‌జీవ‌నం అయితే అదే న‌మోదు చేస్తారు.

ఇక‌, కుటుంబానికి ప్రత్యేకంగా ఉన్న గదుల సంఖ్యను న‌మోదు చేస్తారు. తాగునీటి వనరుల‌పైనా ప్ర‌శ్నిస్తారు. తాగునీటి వనరు లభ్యత ఎలా ఉందో తెలుసుకుంటారు. లైటింగ్ కోసం విద్యుత్, కిరోసిన్, సౌర శక్తి ల‌లో దేనిని వాడుకుంటున్నారో తెలుసుకుంటా రు. మరుగుదొడ్డి సదుపాయం: ఉందా/లేదా? ప్ర‌శ్నిస్తారు. ఉంటే అది ఏ త‌ర‌హాదో తెలుసుకుంటారు. వంటగది వివ‌రాలు, వినియోగించే గ్యాస్, క‌ట్టెలు, కిరోసిన్ ఇలా.. అనేక అంశాలు తొలిద‌శ‌లో ఎదురు కానున్నాయి. ఇంటింటికీ వ‌చ్చి చేసే స‌ర్వేతోపాటు.. ఇది కుద‌ర‌ని వారు.. ఆన్‌లైన్‌లోనూ ఈ గ‌ణ‌న‌లో పాలుపంచుకునే అవ‌కాశం ఉంది.