Begin typing your search above and press return to search.

హాలీవుడ్‌కు ఇండియా కీలక మార్కెట్‌గా మారిందా?

ఇండియాలోని ఆడియ‌న్స్ ఎంట‌ర్టైన్మెంట్ టేస్ట్ లో వచ్చిన మార్పు కూడా దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   1 Aug 2026 7:36 PM IST
హాలీవుడ్‌కు ఇండియా కీలక మార్కెట్‌గా మారిందా?
X

ప్రపంచ సినీ మార్కెట్‌లో ఇండియా ప్లేస్ గత కొన్నేళ్లలో గణనీయంగా మారింది. ఒకప్పుడు హాలీవుడ్ స్టూడియోలు భారతదేశాన్ని కేవలం ఎక్స్‌ట్రా క‌లెక్ష‌న్లు వచ్చే రీజ‌న‌ల్ మార్కెట్‌గా మాత్రమే చూసేవి. కానీ ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది. భారీ బడ్జెట్ హాలీవుడ్ సినిమాల రిలీజ్ ప్లాన్స్, ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్స్, డబ్బింగ్ వెర్షన్లు, ప్రీమియం స్క్రీన్ ప్లానింగ్ వంటి అంశాలను పరిశీలిస్తే ఇండియాకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఇండియాలోని ఆడియ‌న్స్ ఎంట‌ర్టైన్మెంట్ టేస్ట్ లో వచ్చిన మార్పు కూడా దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఇంట‌ర్నేష‌న‌ల్ లెవెల్ విజువల్ ఎక్స్‌పీరియెన్స్, సూపర్ హీరో ఫ్రాంచైజీలు, ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్, అడ్వెంచర్ సినిమాల‌కు యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ముఖ్యంగా మెట్రో నగరాలతో పాటు టైర్- 2, టైర్- 3 నగరాల్లోనూ హాలీవుడ్ సినిమాల ప్రాంతీయ భాషా వెర్షన్లకు డిమాండ్ పెరగడం మార్కెట్ విస్తరణకు దోహదపడుతోంది.

ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ‌య్యే కొన్ని హాలీవుడ్ సినిమాల‌కు ఇండియా ఇప్పుడు టాప్ ఇంట‌ర్నేష‌న‌ల్ మార్కెట్లలో ఒకటిగా నిలుస్తోంది. అమెరికా, చైనా తర్వాత గణనీయమైన క‌లెక్ష‌న్లు అందించే దేశాల లిస్ట్ లో ఇండియా తరచుగా కనిపిస్తోంది. మ‌రీ ప్ర‌త్యేకంగా మొద‌టి వీకెండ్ కలెక్షన్లు, ప్రీమియం ఫార్మాట్ టికెట్ సేల్స్, అడ్వాన్స్ బుకింగ్స్ వంటి అంశాలు ఇండియ‌న్ మార్కెట్ స్ట్రెంగ్త్ ను ప్రతిబింబిస్తున్నాయి. హాలీవుడ్ స్టూడియోలు కూడా ఈ అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని తమ ప్లాన్స్ ను మార్చుకుంటున్నాయి. తెలుగు, తమిళ, హిందీ సహా ప్రధాన భారతీయ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయడం, ఇండియ‌న్ ఆడియ‌న్స్ కు అనుగుణంగా ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్ రూపొందించడం, సోషల్ మీడియా క్యాంపెయిన్లలో స్థానిక మార్కెట్‌ను టార్గెట్ గా చేసుకోవడం వంటి మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

2027 నాటికి ఈ ధోరణి మరింత బలపడే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సూపర్ హీరో ఫ్రాంచైజీలు, భారీ విజువల్ ఎపిక్స్, ప్రముఖ డైరెక్ట‌ర్ల గ్లోబల్ ప్రాజెక్టులు వరుసగా రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ఇండియాలో ఐమ్యాక్స్, లేజర్ ప్రొజెక్షన్, ప్రీమియం మల్టీప్లెక్స్ స్క్రీన్ల సంఖ్య పెరగడం కూడా హాలీవుడ్ మార్కెట్‌కు అనుకూలంగా మారే అంశంగా భావిస్తున్నారు. వీట‌న్నింటినీ పరిశీలిస్తే, ఇండియా ఇక మీద‌ట‌ హాలీవుడ్‌కు కేవలం డబ్బింగ్ మార్కెట్ మాత్రమే కాద‌ని, వ‌ర‌ల్డ్ బాక్సాఫీస్ సమీకరణాలను ప్రభావితం చేసే స్ట్రాట‌జిక్ మార్కెట్‌గా రూపాంతరం చెందుతున్న దశలో ఉందని చెప్పవచ్చు.