పెద్ద తెలుగు స్టార్ లేకున్నా థియేటర్లు ఖాళీగా లేవే!
ఈ వీకెండ్ థియేట్రికల్ లైనప్ చూస్తే సూర్య నటించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఈరోజే థియేటర్లలోకి వచ్చింది.
By: M Prashanth | 14 Aug 2026 9:43 AM ISTస్వాతంత్ర్య దినోత్సవం, సంక్రాంతి, దసరా లాంటి ఫెస్టివల్ వీకెండ్స్ వస్తున్నాయంటే చాలు.. చాలా ముందుగానే పెద్ద స్టార్ హీరోల సినిమాలతో డేట్స్ బ్లాక్ అయిపోయేవి. బాక్సాఫీస్ దగ్గర ఒకే సినిమా డామినేషన్ ఎక్కువగా కనిపించేది. కానీ ఈసారి ఆగస్టు 14 ఇండిపెండెన్స్ డే వీకెండ్ కు మాత్రం ఆ వాతావరణం లేదు. టాప్ రేంజ్ స్ట్రెయిట్ తెలుగు రిలీజ్ లేకపోయినా క్యాలెండర్ ఖాళీగా ఉండిపోలేదు. నాలుగైదు సినిమాలు స్క్రీన్స్ కోసం పోటీ పడుతూ థియేటర్లను షేర్ చేసుకున్నాయి.
ఈ వీకెండ్ థియేట్రికల్ లైనప్ చూస్తే సూర్య నటించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఈరోజే థియేటర్లలోకి వచ్చింది. హీరోకి ఉన్న స్టార్ వాల్యూతో పాటు డైరెక్టర్ వెంకీ అట్లూరి కావడంతో ఇది కేవలం తమిళ హీరో సినిమా అనే ఫీలింగ్ బయట ఎక్కడా లేదు. తెలుగులో దీనికి డీసెంట్ అటెన్షన్ దొరికింది. అయితే మౌత్ టాక్ ఎలా ఉందనే దానిపైనే ఈ సినిమా లాంగ్ రన్ రిజల్ట్ ఆధారపడి ఉంటుంది.
ఇదే వీకెండ్ లో 'పల్లబురుసు', 'అగాధ' లాంటి మీడియం రేంజ్ స్ట్రెయిట్ సినిమాలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. థియేటర్ల దగ్గర పెద్ద స్టార్ సినిమా లేని ఇలాంటి హాలిడే వాతావరణం వీటికి చాలా ప్లస్ అవుతుంది. పోటీలో బడా హీరోలు లేకపోవడం వల్ల వీటికి స్క్రీన్స్, షోలు ఈజీగా దొరకడమే కాకుండా, ఓపెనింగ్స్ పరంగా కూడా లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్ దక్కుతుంది. కంటెంట్ ప్రూవ్ చేసుకోవడానికి ఇది మంచి స్పేస్.
హాలిడే వీకెండ్ దొరికింది కదా అని థియేటర్లు నిండిపోతాయని గుడ్డిగా నమ్మడానికి లేదు. ఫస్ట్ డే టాక్ పాజిటివ్ గా వస్తే వీకెండ్ లో ఆటోమేటిక్ గా ఈ సినిమాలకు కలెక్షన్లు పెరుగుతాయి. ఒకవేళ రెస్పాన్స్ ఏమాత్రం వీక్ గా అనిపించినా, ప్రేక్షకులు వెంటనే పక్కనున్న మరో ఆప్షన్ వైపు వెళ్లిపోతారు. కాబట్టి ఎవరైతే తమ కంటెంట్ తో మెప్పిస్తారో వాళ్లకు మాత్రమే ఈ సీజన్ కలిసి వస్తుంది.
ఇప్పుడు థియేటర్లకు వచ్చే ఆడియన్స్ కి భాషా భేదాలు చాలా వరకు తగ్గిపోయాయి. కంటెంట్ బాగుంటే తమిళ్, మలయాళ చిత్రాలు కూడా డబ్బింగ్ రూపంలో గట్టి ఆప్షన్స్ గా మారుతున్నాయి. ఈ వారం 'మకుటం' కూడా ఇలానే డబ్బింగ్ రిలీజ్ గా రేసులోకి వచ్చింది. ఒక పెద్ద స్ట్రెయిట్ సినిమా పోటీలో లేదు కదా అని మిగిలిన సినిమాలకు గ్రౌండ్ ఓపెన్ గా ఉన్నట్లు కాదు. అసలైన కాంపిటీషన్ డబ్బింగ్ మార్కెట్ తో కూడా నడుస్తోంది.
పండుగలు వస్తే క్యాలెండర్ ఒకే ప్రాజెక్ట్ చుట్టూ తిరిగే ట్రెండ్ మారుతోంది. ఒకే పండుగను డబ్బింగ్, మీడియం రేంజ్ సినిమాలు సమానంగా పంచుకునే కల్చర్ ఎక్కువవుతోంది. రాబోయే రెండు మూడు రోజులు బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాల మధ్య ఫైట్ జరగడం ఖాయం. ఇక వీకెండ్ ముగిసేసరికి ఆడియన్స్ ఫైనల్ గా ఏ సినిమాను ఎక్కువగా లైక్ చేస్తారో చూడాలి.
