Begin typing your search above and press return to search.

క‌ర‌ణ్ జోహార్‌తో క‌లిసి రానా మైండ్ బ్లోయింగ్ ప్లాన్?

అయితే ఈ అవార్డుల వేడుక ఒక ఎత్తు అయితే రానా నటన కెరీర్ గురించి ఆయన అభిమానులు మరో రకమైన ఆశలు పెట్టుకున్నారు.

By:  Sivaji Kontham   |   2 April 2026 9:00 AM IST
క‌ర‌ణ్ జోహార్‌తో క‌లిసి రానా మైండ్ బ్లోయింగ్ ప్లాన్?
X

భారతీయ చలనచిత్ర పరిశ్రమను ఒకే గొడుగు కిందికి తీసుకువచ్చే బృహత్తర లక్ష్యంతో టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి .. బాలీవుడ్ దిగ్గజం కరణ్ జోహార్ చేతులు కలిపారు. వీరిద్దరి కలయికలో ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అనే సరికొత్త వేదిక రూపుదిద్దుకుంది. ఈ అకాడమీ ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహించబోతున్న ఐ.ఎన్.సి.ఏ అవార్డుల ప్రధానోత్సవం ఏప్రిల్ 16న ముంబైలో అత్యంత వైభవంగా జరగనుంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని భాషల సినీ కళాకారులను, సాంకేతిక నిపుణులను గౌరవించడం ఈ అకాడమీ ప్రధాన ఉద్దేశ్యం.

ఈ ప్రతిష్టాత్మక వేడుకకు రానా దగ్గుబాటి - కరణ్ జోహార్ స్వయంగా హోస్ట్‌లుగా వ్యవహరించనుండటం విశేషం. మొత్తం 25 విభాగాల్లో ఈ అవార్డులను అందజేయనున్నారు. ముఖ్యంగా భారతదేశంలోని 12 ప్రధాన భాషా చిత్రాలకు విడిగా ఉత్తమ నటుడు, నటి, దర్శకుడు, ఉత్తమ చిత్ర అవార్డులను అందించడం ఈ వేడుక ప్రత్యేకత. దీనివల్ల ప్రాంతీయ చిత్రాలకు జాతీయ స్థాయిలో గొప్ప గుర్తింపు లభించనుంది. ఇప్పటికే విడుదలైన నామినేషన్లలో ధురంధర్, లోక చాప్టర్ వన్, కాంతార: చాప్టర్ 1 వంటి చిత్రాలు పోటాపోటీగా నిలిచాయి.

కేవలం నటనకే కాకుండా సంగీతం, రచన , సాంకేతిక విభాగాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన వారిని గుర్తించడానికి మరో 21 అదనపు కేటగిరీలను కేటాయించారు. `ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా` ఈ కార్యక్రమానికి చీఫ్ పాట్రన్‌గా మద్దతు ఇస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న సినీ పరిశ్రమల మధ్య సహకారాన్ని పెంపొందించడం.. భారతీయ సినిమాను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఏకీకృతం చేయడం అనే రానా, కరణ్‌ల బిగ్ ప్లాన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వేడుక భారతీయ సినీ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలవనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

అయితే ఈ అవార్డుల వేడుక ఒక ఎత్తు అయితే రానా నటన కెరీర్ గురించి ఆయన అభిమానులు మరో రకమైన ఆశలు పెట్టుకున్నారు. బాహుబలి సినిమాను ఉత్తరాదిలో భారీ స్థాయిలో విడుదల చేయడంలో కరణ్ జోహార్ పాత్ర మరువలేనిది. అప్పట్లో ప్రభాస్‌కు బాలీవుడ్‌లో తిరుగులేని క్రేజ్ రావడానికి కరణ్ పంపిణీ వ్యూహమే ప్రధాన కారణం. ఇప్పుడు అదే స్థాయిలో కరణ్ జోహార్ తన సొంత నిర్మాణంలో రానా కోసం ఒక అద్భుతమైన స్క్రిప్టును, స్టార్ డైరెక్టర్‌ను సెట్ చేసి.. రానాకు హిందీలో ఒక బిగ్ బ్రేక్ ఇవ్వాలని దగ్గుబాటి అభిమానులు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.

రానా ప్రస్తుతం తన నటన కెరీర్ కంటే ఎక్కువగా బిజినెస్ ఐడియాలు, ఇలాంటి అకాడమీ కార్యక్రమాలపైనే దృష్టి పెడుతున్నారు. దీంతో ఆయన నటనా కెరీర్ గురించి కూడా సీరియస్ గా ఆలోచించాలని.. కరణ్ జోహార్ దర్శకత్వంలో లేదా నిర్మాణంలో రానా ఒక పూర్తి స్థాయి కమర్షియల్ సినిమా చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఏదేమైనా.. ఏప్రిల్ 16న జరిగే ఐఎన్.సి.ఏ అవార్డుల వేడుక రానా - కరణ్ జోహార్‌లను ఒకే వేదికపైకి తీసుకురావడమే కాకుండా.. వీరిద్దరి కాంబినేషన్‌లో కొత్త సినిమా ప్రకటన ఏమైనా వస్తుందేమోనని సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.