Begin typing your search above and press return to search.

ఉద‌య‌నిది స్టాలిన్ కుమారుడు హీరోగా ఆరంగేట్రం?

డాక్ట‌ర్ కొడుకు డాక్ట‌ర్, యాక్ట‌ర్ కొడుకు యాక్టర్ అవ్వ‌డం స‌హ‌జం. డాక్ట‌ర్ కాబోయి యాక్ట‌ర్ అయిన వాళ్లు ఉన్నారు.

By:  Sivaji Kontham   |   4 Sept 2025 7:00 PM IST
ఉద‌య‌నిది స్టాలిన్ కుమారుడు హీరోగా ఆరంగేట్రం?
X

డాక్ట‌ర్ కొడుకు డాక్ట‌ర్, యాక్ట‌ర్ కొడుకు యాక్టర్ అవ్వ‌డం స‌హ‌జం. డాక్ట‌ర్ కాబోయి యాక్ట‌ర్ అయిన వాళ్లు ఉన్నారు. కానీ ఇక్క‌డ యాక్ట‌ర్ కొడుకు యాక్ట‌ర్ అవ్వ‌డానికి ముందే నిర్మాత అవుతున్నాడు. త‌న తండ్రి విజ‌యవంతంగా నిర్వ‌హించిన బ్యాన‌ర్ ని నడిపిస్తూనే, ఈ యువ‌కుడు హీరోగాను కొత్త రోల్ పోషించేందుకు అవ‌కాశం ఉంద‌ని కోలీవుడ్ మీడియాలో క‌థ‌నాలొస్తున్నాయి.

ఇదంతా ఎవ‌రి గురించి? అంటే... ప్ర‌ముఖ నటుడు-రాజకీయ నాయ‌కుడు ఉదయనిధి స్టాలిన్ కుమారుడు ఇన్బన్ ఉదయనిధి గురించే ఇదంతా. ఇన్బ‌న్ పేరు గ‌త కొద్దిరోజులుగా త‌మిళ మీడియాలో న‌లుగుతోంది. ఈ యువ‌కుడు 2008లో ఉదయనిది స్థాపించిన నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ మూవీస్‌కు సారథ్యం వహిస్తున్నారని తెలిసింది. తండ్రి ఉద‌య‌నిది రాజ‌కీయాల్లో పూర్తి బిజీగా ఉన్నందున ఇప్పుడు కుమారుడికి బాధ్య‌త‌లు అప్ప‌జెబుతున్నార‌ని తెలిసింది. ధనుష్ న‌టిస్తున్న `ఇడ్లీ కడై` థియేట్రికల్ హక్కులను కొనుగోలు చేయడంతో పాటు ఈ బ్యాన‌ర్ బాధ్య‌త‌ల్ని ఉద‌య‌నిది కుమారుడు నిర్వ‌హిస్తార‌ని అధికారిక‌ ప్రకటన వచ్చింది.

రెడ్ జెయింట్ మూవీస్ 2008లో ప్రారంభ‌మైంది. విజ‌య్- త్రిష జంట‌గా ధరణి దర్శకత్వం వహించిన 'కురువి' బ్యాన‌ర్ లో మొద‌టి సినిమా. ఆధవన్ (2009), మన్మధన్ అంబు (2010), ఏళాయుమ్ అరివు (2011), ఒరు కల్ ఒరు కన్నడి (2012), నీర్‌పరావై (2012), వణక్కం చెన్నై (2013), మణిథాన్ (2016), మామన్నన్ (2023) వంటి చిత్రాలు ఈ బ్యాన‌ర్ లో తెర‌కెక్కాయి. ఈ ఏడాది కూడా ఈ సంస్థ‌లో రెండు సినిమాలు తెర‌కెక్కాయి. కిరుతిగ ఉదయనిధి (ఉద‌యనిది స్టాలిన్ భార్మ‌) దర్శకత్వం వహించిన కాదలిక్క నేరమిల్లై , కమల్ హాసన్-మణిరత్నంల థగ్ లైఫ్ ఇప్ప‌టికే విడుద‌ల‌య్యాయి.

'ఇడ్లీ కడై' చిత్రాన్ని త‌మిళంలో రెడ్ జెయింట్ బ్యాన‌ర్ విడుద‌ల చేస్తుంది. అరుణ్ విజయ్, నిత్యా మీనన్, రాజ్‌కిరణ్, సముద్రఖని తదితరులు ఈ చిత్రంలో నటించారు. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించ‌గా, కిరణ్ కౌశిక్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రం అక్టోబర్ 1న థియేటర్లలో విడుదల కానుంది.

రెడ్ జెయింట్ బ్యాన‌ర్ స‌క్సెస్ రేటు అంతంత మాత్ర‌మే. ఈ బ్యాన‌ర్ లో తెర‌కెక్కిన కొన్ని ప్ర‌తిష్ఠాత్మ‌క సినిమాలు డిజాస్ట‌ర్లుగా నిలవ‌డంతో స్టాలిన్ నిరాశ‌కు గుర‌య్యార‌ని క‌థ‌నాలొచ్చాయి. అయితే ఇప్పుడు ఫ్లాపుల్లో ఉన్న సంస్థ‌ను స‌రైన దారిలో పెట్టాల్సిన బాధ్య‌త కుమారుడు ఇన్బ‌న్ పై ఉంది.