Begin typing your search above and press return to search.

ఏం ఉందిలే అని పెద‌వి విరిచేశాక స్లో పాయిజన్‌లా ఎక్కిన ప్రేమ‌క‌థా చిత్రాలు!

కులం, మతం, భాష, సరిహద్దులు.. వేటితోనూ సంబంధం లేని ఒక అందమైన ప్రేమకావ్యాన్ని వెండితెరపై ఆవిష్కరించడంలో బాలీవుడ్ దర్శకుడు ఇంతియాజ్ అలీ శైలి ప్రత్యేకం.

By:  Sivaji Kontham   |   22 Jun 2026 4:00 PM IST
ఏం ఉందిలే అని పెద‌వి విరిచేశాక స్లో పాయిజన్‌లా ఎక్కిన ప్రేమ‌క‌థా చిత్రాలు!
X

కులం, మతం, భాష, సరిహద్దులు.. వేటితోనూ సంబంధం లేని ఒక అందమైన ప్రేమకావ్యాన్ని వెండితెరపై ఆవిష్కరించడంలో బాలీవుడ్ దర్శకుడు ఇంతియాజ్ అలీ శైలి ప్రత్యేకం. చాలా కాలం తర్వాత ఆయన దర్శకత్వంలో వచ్చిన `మై వాపస్ ఆవుంగా` చిత్రం మళ్లీ ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేస్తోంది. ఇటీవల కాలంలో వచ్చిన `సయ్యారా` చిత్రం ఒక స్వచ్ఛమైన ప్రేమకథగా పెద్ద విజయం సాధించగా, ఆ తర్వాత మళ్లీ ఒక స్లోపాయిజ‌న్‌లా హృదయాలను హత్తుకుంటూ.. కంటతడి పెట్టించే అద్భుతమైన ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ఇంతియాజ్ సినిమా నిలుస్తోంది. స‌య్యారాతో ఈ సినిమాకి పోలిక లేదు కానీ.. ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరీగా ఇది నెమ్మ‌దిగా హృద‌యాల‌ను పిండుతోంది. విడుదలైన కొత్తలో మిశ్రమ స్పందనలు వ్య‌క్త‌మైనా.. ప్రస్తుతం ఈ చిత్రం ఒక కల్ట్ క్లాసిక్‌గా మారి.. స్లో పాయిజన్‌లా ప్రేక్షకుల మనసులకు ఎక్కుతూ భారీ విజయం వైపు అడుగులు వేస్తోంది.

ఈ సినిమా విడుదలైన మొదటి నాలుగైదు రోజులు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ నెమ్మదిగా ప్రేక్షకుల నుంచి `మౌత్ టాక్` స్ప్రెడ్ అవ్వడం ప్రారంభమైంది. `సినిమాలో మంచి ఫీల్ ఉంది.. అద్భుతమైన ప్రేమకథ ఉంది.. ముఖ్యంగా క్లైమాక్స్‌లో కన్నీళ్లు పెట్టుకోకుండా థియేటర్ నుండి బయటకు రాలేరు!`` అంటూ ఒకరి నోటి నుంచి మరొకరికి పాజిటివ్ టాక్ పాకిపోయింది. దాంతో ఒక్కసారిగా థియేటర్లలో వంద శాతం ఆక్యుపెన్సీతో కలెక్షన్లు క‌ళ్ల‌జూడ‌టం మొద‌లైంది. సాధారణంగా సోమవారం రోజున చాలా సినిమాల వసూళ్లు పడిపోతుంటాయి... కానీ ఈ చిత్రం మాత్రం సోమవారం నాడు మిరాకిల్ గా మారి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. తను నమ్మి తీసిన సినిమాను ప్రేక్షకులు ఆలస్యంగానైనా గుర్తించి పెద్ద హిట్ చేస్తున్నందుకు దర్శకుడు ఇంతియాజ్ అలీ ఉబ్బితబ్బిబ్బవుతూ అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

`మై వాపస్ ఆవుంగా` కథ విషయానికి వస్తే.. ఇది సరిహద్దులు లేని, కాలంతో సంబంధం లేని ఒక అమరప్రేమ గాథ. ఈ చిత్రంలో దిల్‌జీత్ దోసాంజ్, శర్వరి, వేదంగ్ రైనా .. సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా కీలక పాత్రల్లో నటించారు. దేశ‌విభ‌జ‌న నేప‌థ్యంలో ఇద్ద‌రు ప్రేమికుల ఎమోషనల్ ల‌వ్ స్టోరి ర‌క్తి క‌ట్టిస్తోంది. ఈ సినిమాలో నటీనటుల నటన, ఇంతియాజ్ అలీ మార్క్ స్క్రీన్ ప్లే, గుండెల్ని పిండేసే క్లైమాక్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద `కాక్‌టైల్ 2` లాంటి భారీ కమర్షియల్ ఎంటర్‌టైనర్ సినిమా పోటీగా ఉన్నప్పటికీ.. ఈ సినిమాలోని కంటెంట్, ఇంటెన్సిటీని గుర్తించిన ప్రేక్షకులు ఇప్పుడు బ్రహ్మరథం పడుతున్నారు. భాషా హద్దులను దాటేసి ప్రతి ఒక్కరినీ ఈ కథ కదిలిస్తోంది. ప్రారంభం స్లో నేరేష‌న్ అన్న వాళ్లే ఇదిరా ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరి అంటే అంటూ పొగిడేస్తున్నారు. అస‌లు భాష‌తో సంబంధం లేకుండా థియేట‌ర్లకు వెళ్లి ఈ సినిమాని ఎంజాయ్ చేస్తార‌ని క్రిటిక్స్ ప్ర‌శంసిస్తున్నారు.

సినిమా చరిత్రలో ఇలాంటి `స్లో పాయిజన్` చిత్రాలు కొత్తేమీ కాదు. గతంలో నాగార్జున క‌థానాయ‌కుడిగా లెజెండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన క్లాసిక్ లవ్ స్టోరీ `గీతాంజలి` కూడా ఈ కేటగిరీకి చెందినదే. విడుదలైన ఆరంభంలో హీరో హీరోయిన్లు ఇద్దరూ చివర్లో మరణించడం ఏమిటనే కోణంలో ఆ సినిమా ఎవరికీ అర్థం కాలేదు.. కానీ ఆ తర్వాత మౌత్ టాక్‌తో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అలాగే బాలీవుడ్‌లో వచ్చిన `ఆషిఖీ`ఫ్రాంచైజీ సినిమాలు కూడా స్లో పాయిజన్‌లాగే మైండ్‌లోకి వెళ్లాయి. మొదటి భాగం బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఆ తర్వాతి సినిమాలకు పెద్దగా ప్రచారం అవసరం లేకుండానే ప్రేక్షకులు ఓన్ చేసుకున్నారు. మంచి ప్రేమ‌క‌థ‌, అందులో నిజాయితీ ఉంటే జనాలు ఎప్పుడైనా ఆదరిస్తారని ఇవి నిరూపించాయి.

సరిగ్గా ఇలాంటి మ్యాజిక్‌నే టాలీవుడ్‌లో `పెళ్లి చూపులు` (2016), `సీతా రామం` (2022) చిత్రాలు కూడా సాధించాయి. విజయ్ దేవరకొండ, రీతూ వర్మ నటించిన `పెళ్లి చూపులు` బడ్జెట్ పరిమితుల వల్ల ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా విడుదలై ఆరంభ‌ రోజుల్లో తక్కువ ఆదరణ పొందింది. కానీ.. ఆ తర్వాత సహజమైన కామెడీ.. మోడ్రన్ లవ్ స్టోరీతో మౌత్ టాక్ తెచ్చుకుని నేషనల్ అవార్డు సాధించే స్థాయికి ఎదిగింది. ఇక దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ ల `సీతా రామం` చిత్రానికి కూడా మొదటి రోజు కలెక్షన్లు సాధారణంగానే ఉన్నా... రామ్-సీతల అమరప్రేమ కథ ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించి, మౌత్ టాక్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది. బాలీవుడ్ లోనే లూటేరా, బ‌ర్ఫీ లాంటి చిత్రాలు కూడా ప్రారంభం ఏం ఉందిలే అంటూ పెద‌వి విరిచేసినా ఆ త‌ర్వాత పెద్ద హిట్ల‌య్యాయి. ఇప్పుడు ఇంతియాజ్ అలీ `మై వాపస్ ఆవుంగా` కూడా అదే బాటలో క్లాసిక్ హిట్ వైపు దూసుకుపోతోంది.