Begin typing your search above and press return to search.

న‌టుడు 'లీవ్ ఇండియా' నోటీసుపై కేంద్రం కీలక ప్రకటన!

బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్ కు కేంద్ర ప్రభుత్వం .. బాంబే హైకోర్టు నుంచి తాత్కాలికంగా భారీ ఊరట లభించింది.

By:  Srikanth Kontham   |   27 Oct 2026 7:00 PM IST
న‌టుడు లీవ్ ఇండియా నోటీసుపై కేంద్రం కీలక ప్రకటన!
X

బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్ కు కేంద్ర ప్రభుత్వం .. బాంబే హైకోర్టు నుంచి తాత్కాలికంగా భారీ ఊరట లభించింది. అక్టోబర్ 28 నాటికి భారతదేశాన్ని విడిచి వెళ్లాలంటూ ముంబైలోని ఫారిన్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ జారీ చేసిన లీవ్ ఇండియా నోటీసు పై విధించిన గడువుకు విరామం లభించింది. ఈ నోటీసును సవాలు చేస్తూ ఇమ్రాన్ ఖాన్ దాఖలు చేసిన పిటిషన్‌పై తదుపరి విచారణను బాంబే హైకోర్టు నవంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది.

చట్టపరమైన చర్యల నుంచి ఇమ్రాన్ ఖాన్‌కు మినహాయింపు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది హైకోర్టుకు కీలక హామీ ఇచ్చారు. తదుపరి విచారణ జరిగే నవంబర్ 2 వరకు ఆయనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోబోమని అదనపు సొలిసిటర్ జనరల్ కోర్టుకు మౌఖిక పూచీకత్తు ఇచ్చారు. దీంతో ఇమ్రాన్ ఖాన్ తక్షణమే దేశం విడిచి వెళ్లాల్సిన విపత్కర పరిస్థితి తప్పినట్లయింది.

ఈ వివాదానికి ప్రధాన కారణం అమెరికన్ పౌరసత్వం కలిగిన ఇమ్రాన్ ఖాన్‌కు ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ అక్టోబర్ 14న ఇచ్చిన నోటీసే. ఇమ్రాన్ భారతదేశంలో జరిగిన ఓ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు అనే ఆరోపణతో అక్టోబర్ 28లోగా దేశం విడిచిపోవాలని అధికారులు ఆదేశించారు. ఈ ఆదేశాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఇమ్రాన్ ఖాన్ పిటిషన్ దాఖలు చేస్తూ అధికారులు తన వాదన వినకుండా .. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.

హైకోర్టు చీఫ్ జస్టిస్ మహేష్ చంద్ర త్రిపాఠి, జస్టిస్ అద్వైత్ సేత్నాతో కూడిన ధర్మాసనం ముందు విచారణ జరిగింది. కేంద్ర ప్రభుత్వం తగిన సమయం కోరడంతో విచారణ వాయిదా పడింది. అయితే ఇమ్రాన్ న్యాయవాది వెంకటేష్ ధోండ్ అక్టోబర్ 28 నాటి గడువు విషయాన్ని లేవనెత్తగా ఏమీ జరగదు, తదుపరి విచారణ వరకు ఆయన దేశం విడిచి వెళ్లాల్సిన అవసరం లేదు అని కేంద్ర ప్రభుత్వం తరఫున ఏఎస్‌జీ అనిల్ సింగ్ స్పష్టం చేశారు.

ఇమ్రాన్ ఖాన్ 2006 నుండి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్‌హోల్డర్‌గా ఉన్నారు. తనకు రెండు సంవత్సరాల వయస్సు ఉన్నప్పటి నుంచే భారతదేశంలో నివాసం ఉంటున్నానని.. తన విద్యాభ్యాసం, కెరీర్ , కుటుంబ బంధాలన్నీ ఇక్కడే ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారిజనర్స్ యాక్ట్ 2025 కింద తాను ఎలాంటి ఉల్లంఘనకు పాల్పడలేదని అధికారులు ఎలాంటి వివరణ తీసుకోకుండా ఈ నోటీసు జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని వాదించారు.

మొత్తానికి ఇమ్రాన్ ఖాన్ కు చట్టపరమైన పోరాటంలో తాత్కాలిక సమయం లభించింది. నవంబర్ 2న మధ్యాహ్నం 3 గంటలకు జరగబోయే తుది విచారణలో బాంబే హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందోననే అంశంపై సినీ.. న్యాయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.